logo

కూటమిలో ఉత్సాహం.. వైకాపాలో నైరాశ్యం

‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్‌ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్‌తో కదిలాయి. పోలింగ్‌ సరళి,

Updated : 14 May 2024 08:19 IST

ఈనాడు, అమరావతి: ‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్‌ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్‌తో కదిలాయి. పోలింగ్‌ సరళి, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఓటింగ్‌లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తెదేపా, జనసేన, భాజపాలో ఉత్సాహం ఉరకలేసింది. కూటమి శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుతున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్‌ 4 వరకు ఉత్కంఠ కొనసాగనున్నా.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.’’

కోడూరులో పోలింగ్‌ను పరిశీలిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి

‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనం.. వైకాపా శ్రేణుల తీరు.. పోలింగ్‌ సరళి మేరకు.. వైకాపా శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమల్లో దాడులకు పాల్పడ్డారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పారు. కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోలింగ్‌ కేంద్రాల వరకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వారి కార్యకర్తలే నాయకులను నిలదీశారు. తమకు సొమ్ములు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు. పార్టీ నుంచి వచ్చిన సొమ్ము నొక్కేశారా అని తీవ్ర గందరగోళం సృష్టించారు. మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, గుడివాడ, పెనమలూరు ప్రాంతాల్లో సొమ్ముల కోసం నిలదీశారు. వైకాపా నాయకులు చాలా మంది తెల్లమొహం వేశారు. విజయవాడ పశ్చిమలోనూ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.’’

విజయవాడ పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్న కూటమి అభ్యర్థి కేశినేని చిన్నిపై అకారణంగా వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఏ.కొండూరు మండలం కంభంపాడులో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న చిన్నిపైకి కొందరు యువకులు దూసుకొచ్చారు. పోలింగ్‌ కేంద్రంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. అభ్యర్థికి అవకాశం ఉందని చెబుతున్నా.. అరుస్తూ నినాదాలు చేస్తూ గలాభా సృష్టించారు. ఆయన సంయమనం పాటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంత జరుగుతున్నా.. సాధారణ పోలీసులు అక్కడికి చేరుకోకపోవడం.. వారిని నివారించడం చేయలేదు. కంభంపాడులో పోలింగ్‌ సరళిపై అనుమానంతో కొందరు యువకులు ఈ అరాచకానికి పాల్పడ్డారని తెదేపా ఆరోపించింది.
నందిగామ: ఒక పోలింగ్‌ కేంద్రంలో వైకాపా నాయకులు అనవసరంగా కేకలు వేస్తూ.. చూసుకుందాం రా.. అని తెదేపా కార్యకర్తలకు సవాల్‌ విసిరారు. మద్యం మత్తులో ఉండి ఇలా ప్రవర్తించారంటే ఆయన భార్యకూడా జతకట్టడం విశేషం. ఘర్షణ కోసం తన అనుచరులను పిలిచి గోల చేసేందుకు యత్నించారు. తెదేపా కార్యకర్తలు చాల లైట్‌గా తీసుకున్నారు.
కంచికచర్ల: పరిటాలలో కొందరు మహిళలు మధ్యాహ్నం తర్వాత వైకాపాకు ఓటు వేయాలని డబ్బులు ఇస్తామని పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేయడంపై తెదేపా వారు తీవ్ర అభ్యంతరం తెలపగా ఘర్షణకు కారణమైంది. పెనుగంచిప్రోలులో వైకాపా నేతలు కవ్వింపులకు దిగి తెదేపా వారిపై దాడి చేశారు. నందిగామ మండలంలో ఎమ్మెల్సీ తన అనుచరులతో హంగామా సృష్టించారు. .
బందరులో మరోసారి వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి తలకు బలమైన గాయమైంది. గతంలోనే తెదేపా కార్యకర్తలపై, జనసేన కార్యకర్తల నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.
గుడివాడలోనూ కవ్వింపులకు దిగారు. గుడివాడలో పోలింగ్‌ సరళిని చూసిన నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. బయట తిరగలేదని ప్రచారం జరుగుతోంది.
గన్నవరం పరిధిలోని తేలప్రోలులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ కారుపై వైకాపా అభ్యర్థి వంశీతో సహా ఆ పార్టీ శ్రేణుల దాడులకు బరితెగించారు.

తెదేపా శ్రేణులపైకి దూసుకొస్తున్న గన్నవరం వైకాపా అభ్యర్థి వంశీమోహన్‌

తేలప్రోలులో యార్లగడ్డ కారుపై రాళ్లు రువ్వుతున్న ఉపసర్పంచి ఆదినారాయణరెడ్డి

ధ్వంసమైన వెంకట్రావు కారు అద్దాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని