logo

తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు.

Updated : 18 May 2024 07:20 IST

గోళ్లమూడిలో బాధితురాలు రంగమ్మ ఆవేదన

 

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపి వేశారు. వివరాల్లోకెళితే.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన బరిగెల రంగమ్మ, ఆమె భర్త వీరయ్య కూలి పనులకెళ్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో తాము తెదేపా అభ్యర్థులకు ఓటేశామన్న కారణంగా స్థానిక వైకాపా నాయకులు తమకు మూడు రోజులుగా ఉపాధి హామీ పనులు లేకుండా చేశారని రంగమ్మ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. తమ తోటి కూలీలందరూ పనులకు వెళ్లారని, తమకు మాత్రం స్థానిక ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు నండ్రు కాటయ్య పనులు లేకుండా చేశారని వాపోయారు. వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పరిపాలనలో తమకు ఒక్క పథకం వర్తించలేదని, తమ ఇంటి వద్ద తాగునీటి కుళాయి ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తమది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబమని, ఇలా పొట్టకొట్టడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. దీనిపై ఉపాధి హామీ పథకం ఏపీవో శరత్‌ను వివరణ కోరగా డిమాండ్‌ ఆధారంగానే పనులు కల్పిస్తున్నామని, ఇందులో భాగంగానే ఎన్నికల తరువాత గ్రామంలో 20 మంది కూలీలకు పనులు లేవని చెప్పారు. రాజకీయ కారణాలతో పనులు నిలపలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని