logo

పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు.

Updated : 18 May 2024 08:13 IST

ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ

ఐదేళ్లలో రూ.వందల కోట్లు కొల్లగొట్టారు

చోడవరం: భూగర్భ జలాలు బయటకు వచ్చేలా తవ్వకాలు

ఈనాడు, అమరావతి : కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. విచ్చలవిడిగా నదిలోని ఇసుకను యంత్రాలు పెట్టి తోడేసి మరీ.. తరలించుకుపోయారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న వైకాపా ప్రజాప్రతినిధులకు.. గత ఐదేళ్లుగా ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కొందరు వైకాపా ఎమ్మెల్యేలు ఏకంగా ఇసుకపైనే రూ.వందల కోట్లను కొల్లగొట్టారు. గురువారం వరకూ అక్రమంగా ఇసుకను కృష్ణా నదిలో తవ్వుతూనే ఉన్నారు. తాజాగా ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం చేసిన నేపథ్యంలో తాత్కాలికంగా ఆపారు. జిల్లా కలెక్టర్లకు న్యాయస్థానం అత్యంత తీవ్రమైన హెచ్చరికలను చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు.. కలెక్టర్ల పర్యవేక్షణలోనే ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించాలని సూచించింది.

గత ఐదేళ్లుగా నదీ వనరుల దోపిడీ మామూలుగా లేదు. చాలాచోట్ల ఇసుక క్వారీలను పూర్తిగా పీల్చి పిప్పి చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు, తోట్లవల్లూరు పరిధిలోని రొయ్యూరు, వల్లూరుపాలెం, విజయవాడ శివారులో యనమలకుదురు, పులిపాక, అవనిగడ్డ పరిధిలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం, పాపవినాశనం, పమిడిముక్కల మండలం లంకపల్లి.. సహా అనేక ప్రాంతాల్లో క్వారీల్లో ఇసుకను ఊడ్చి పడేశారు. కొన్నిచోట్ల అనుమతి తీసుకుని.. మరికొన్ని అక్రమంగా యంత్రాలను పెట్టి తోడేశారు. పెనమలూరు మండలం చోడవరంలో ఎన్నికల ముందు కూడా ఇసుకను మంత్రి జోగి రమేష్‌ అనుచరులు విచ్చలవిడిగా తరలించుకుపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలో కంచికచర్ల మండలం చెవిటికల్లు, మున్నలూరు, కీసర వంతెన వద్ద, వత్సవాయి మండలం కన్నెవీడు, చందర్లపాడు పరిధిలో కాసరబాద.. వంటి ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా గత ఐదేళ్లు సాగాయి.

కీసర: ఇసుక తరలింపును అడ్డుకోవడానికి దారి తవ్విస్తున్న తెదేపా నాయకులు


రైతులు తిరగబడడంతో తాత్కాలిక నిలిపివేత

న్యూస్‌టుడే, పెనమలూరు: చోడవరం ఇసుక క్వారీలో రెండున్నరేళ్లలో ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా సాగాయి. ఇసుక కింద భూమి కనిపించేలా తవ్వేయడంతో ఎక్కడికక్కడ చేపల చెరువుల్లా తయారయ్యాయి. కాసర్నేనివారిపాలెం నుంచి పెదపులిపాక వరకూ దాదాపు 6 కిమీ మేర నదిలో సాగిన తవ్వకాలతో 15-20 అడుగుల లోతున గుంతలు ప్రాణాంతకంగా మారాయి.వరదలు, నదిలో నీరు చేరిన సమయాల్లో ఇవి మృత్యు కుహరాల్లా మారాయి. దాదాపు రూ.100 కోట్ల విలువైన ఇసుక కొల్లగొట్టారు.


అడ్డుకట్ట పడుతుందా..

కృష్ణా నది, మున్నేరులో గత ఐదేళ్లుగా విచ్చలవిడిగా ఇసుకను తవ్వుకుని రూ.వందల కోట్లను వైకాపా నేతలు కొల్లగొట్టారు. తాజాగా.. ఇసుక తవ్వకాలపై ఫిర్యాదుల నమోదుకు ఒక టోల్‌ఫ్రీ నంబరు, ప్రత్యేక ఈమెయిల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించింది. జిల్లాల పరిధిలో పోలీసులు, ఇతర అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు నాలుగు రోజుల్లోగా అన్ని క్వారీలను తనిఖీ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఇసుక తవ్వకాలతో ప్రకృతి వనరుల దోపిడీతో పాటు అనేక మంది యువత ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇసుక గుంతల్లో పడి.. రెండు జిల్లాల్లో ఎంతోమంది యువకులు బలయ్యారు. వారి తల్లిదండ్రులు ప్రస్తుతం జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. కనీసం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికైనా ఇసుకాసురులకు అడ్డుకట్ట వేసేందుకు రెండు జిల్లాల కలెక్టర్లు కఠిన చర్యలు చేపడతారో.. లేదో చూడాలి.


గద్దల్లా  తన్నుకుపోయారు..

మద్దూరు పరిధి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా మూడేళ్లుగా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వకాలు నిషేధిత ప్రాంతంలోనే రాత్రి 11 నుంచి వేకువన 3 గంటల వరకు... రోజుకు 100-200 ట్రాక్టర్ల ఇసుక తోడేశారు. తోడివేతతో 6-8 అడుగుల లోతైన గుంతలు ఏర్పడ్డాయి. తరలించిన ఇసుకను ఖాళీ ప్రదేశాలు, వెంచర్లలో డంప్‌ చేస్తున్నారు. మరికొంత నేరుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. నకిలీ బిల్లులపై భారీ టిప్పర్లలో ఇసుక తరలించినా అడ్డుకోలేదు. అడపాదడపా ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. నాలుగు భారీ జేసీబీలతో లోడింగ్‌ చేసి వేల ఘనపుటడుగుల ఇసుక కొల్లగొట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సిండికేట్‌గా మారడంతో ఫిర్యాదు చేసినా నామమాత్ర చర్యలతో సరిపెట్టారు. రోజుకు రూ.10-20 లక్షల ఇసుక తరలించి సొమ్ము నగదు రూపంలోనే వసూలు చేశారు. అనుమతి పొందిన పరిధి దాటి గుంటూరు, కాసర్నేనివారిపాలెం వైపు క్వారీని విస్తరించారు.

నిరుడు కృష్ణా నదికి వచ్చిన వరదల్లో క్వారీకి వేసిన దారి కొట్టుకుపోయింది. కొత్త దారి ఏర్పాటుపై వివాదాలు నెలకొన్నాయి. దీంతో ప్రస్తుతానికి క్వారీ ఆపేశారు. అప్పటికే రూ.వందల కోట్ల విలువైన ఇసుక కొల్లగొట్టారు. దీనిపై అప్పటి కలెక్టర్‌, ఉన్నతాధికారులు పంపిన నివేదికలో ‘నిబంధనల మేరకే ఇసుక రవాణా జరిగిందని’ పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లతో అక్రమ తరలింపు నిరంతరం కొనసాగుతోంది.


అడిగేదెవరు.. ఆపేదెవరు?

శ్రీకాకుళంలో.. నదిలో దారేసి మరీ..

న్యూస్‌టుడే, కంకిపాడు, ఘంటసాల: కృష్ణా నదిలో రెండు వారాలకుపైగా పొక్లెయిన్లతో భారీ టిప్పర్లలో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. పది టైర్ల లారీల్లో అధిక లోడుతో ఇసుక తరలించడంతో దారులూ శిథిలం అవుతున్నాయి. భారీ యంత్రాలతో లోతుగా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మున్ముందు తాగు, సాగునీటి అవసరాలకు విఘాతం ఏర్పడే వీలుంది. శ్రీకాకుళంలో గురువారం వరకూ అక్రమ తవ్వకాలు జరగ్గా... శుక్రవారం ఆపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు