logo

చిలకలపూడి స్టేషన్‌లో సమస్యల కూత

మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్‌తో పాటు చిలకలపూడి స్టేషన్‌లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్‌గోల్డ్‌ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు  ఈ స్టేషన్‌నే ఆశ్రయిస్తారు.

Published : 19 May 2024 03:47 IST

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

స్టేషన్‌లో తిరగని ఫ్యాన్లు

మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్‌తో పాటు చిలకలపూడి స్టేషన్‌లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్‌గోల్డ్‌ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు  ఈ స్టేషన్‌నే ఆశ్రయిస్తారు. అలాంటి స్టేషన్‌లో డబ్లింగ్‌ పనులు చేసే క్రమంలో వివిధ వసతులు కల్పించడంతో అభివృద్ధి చెందుతుందని అందరూ సంతోషించారు. అనతి కాలంలోనే పాడైపోవడంతో ఇక్కడకు వచ్చేవారికి ఇక్కట్లు తప్పడం లేదు.

అన్ని రైళ్లూ ఆగేదెప్పుడో?: మచిలీపట్నం పరిసర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రయాణికులు వివిధ రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. మచిలీపట్నం నుంచి యశ్వంత్‌పూర్, బీదర్, తిరుపతి, ధర్మవరం, విశాఖపట్నం, కర్నూలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతోపాటు పెడన, గుడివాడల మీదుగా విజయవాడకు మరో 8 ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. చిలకలపూడి స్టేషన్‌లో కేవలం ప్యాసింజర్‌ రైళ్లను మాత్రమే ఆపుతున్నారు. కొవిడ్‌కు ముందువరకు ఇక్కడ అన్ని రైళ్లూ ఇక్కడ ఆగేవి. రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమలకు నిలయమైన చిలకలపూడి నుంచే రోల్డుగోల్డు నగలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అందుకోసమే ఇక్కడ అన్ని రైళ్లూ ఆగేలా చర్యలు తీసుకున్నారు. చిలకలపూడి పరిసర ప్రాంతాలతోపాటు బందరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వేలాది మందికి ఈ స్టేషన్‌ చేరువలో అన్ని రైళ్లూ  ఆపాలని రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమల నిర్వాహకులతోపాటు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రైల్వే ఉన్నతాధిÅకారులకు కూడా వినతిపత్రాలు అందించినా ఎలాంటి చర్యలు లేవు. దీంతో అందరూ దూరమైనా ప్రధాన స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. అందుబాటులో స్టేషన్‌ ఉన్నా రూ.వంద వెచ్చించి ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రధానస్టేషన్‌కు వెళ్తున్నామని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. గతంలో అన్ని రైళ్లూ ఆగడంతో ఆటోకార్మికులు ఉపాధిపొందేవారు. ప్రస్తుతం వారు కూడా అవస్థలు పడాల్సి వచ్చింది. 

వచ్చే మార్గంలో పిచ్చిమొక్కలు

ఇదీ పరిస్థితి

  • ప్లాట్‌ఫాం వెంబడి రెండు చోట్ల తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్నాళ్లు సక్రమంగా పనిచేసినా తరువాత పాడైపోయాయి. ఇటీవల ట్యాపులు అమర్చినా కానీ సక్రమంగా నీళ్లు రావడం లేదు. ః  తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు పాడైపోయాయి. దీంతో మహిళలు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
  • ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన ఫ్యాన్లు తిరగడం లేదు. ఉక్కపోతతో ప్రయాణికుల ఇబ్బందిపడుతున్నారు.
  • స్టేషన్‌ ముఖద్వారం నుంచి ఆవరణలోకి వచ్చే మార్గంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. రెండో నంబరు ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లడానికి వంతెన నిర్మించపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

అధికారులు చర్యలు తీసుకోవాలి

చిలకలపూడి రైల్వేస్టేషన్‌లో అన్ని రైళ్లూ ఆగేలా చర్యలు తీసుకోవాలని  ఎప్పటి నుంచో అడుగుతున్నాం. అయినా ఇంతవరకు పట్టించుకున్న నాథుడే లేడు. నగరంలోని రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమల నిర్వాహకులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగలు కొనుగోలు చేసి వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఈ  స్టేషన్‌ నుంచే రాకపోకలు సాగిస్తారు. దీనిపై రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.

ఆలపాటి రమేష్, మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


వసతులు కల్పిస్తే మేలు

స్టేషన్‌లో అన్ని వసతులు లేకపోవడం, కొన్ని రైళ్లే ఆగడంతో ఈ రైల్వేస్టేషన్‌ అలంకారంగా మారిపోయింది. క్రమేపీ ఇక్కడకు వచ్చే ప్రయాణికులు కూడా తగ్గిపోతున్నారు. స్టేషన్‌ వద్ద ప్రత్యేకంగా స్టాండ్‌ ఏర్పాటు చేసుకుని వందల మంది ఆటో కార్మికులు ఉపాధి పొందేవారు. వారంతా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. సంఘ పరంగా అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

బూర సుబ్రహ్మణ్యం, సీఐటీయూ నాయకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని