logo

ఈసారీ అదే తంతు..?

పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే  అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు.

Updated : 19 May 2024 04:31 IST

సగమే వచ్చిన పాఠ్యపుస్తకాలు
న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్‌

పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే  అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. అయితే ప్రస్తుతం కొన్ని తరగతుల పుస్తకాలు మాత్రమే రావడం, పదోతరగతికి సిలబస్‌ ప్రవేశపెట్టడంతో సకాలంలో పుస్తకాలు అందుతాయా లేదోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు అందజేసిన ఇండెంట్‌ ప్రకారం పుస్తకాలు మండలకేంద్రాలకు చేర్చే ప్రక్రియ ప్రారంభించారు.1-7 తరగతులకు సంబంధించిన పుస్తకాలు విద్యాశాఖ ద్వారా ఎమ్మార్సీ కేంద్రాలు చేరవేస్తుండగా 8, 9, 10 తరగతులకు సంబంధించిన వాటిని మాత్రం ప్రింటింగ్‌ప్రెస్‌ నుంచి నేరుగా మండల కేంద్రాలకు చేర్చేలా  ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 1-7 తరగతుల పుస్తకాలు 2.36లక్షలు పంపిణీకి సిద్ధం చేశారు. పంపిణీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం బందరు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాలకు పుస్తకాలు చేరినా అవి కేవలం 9వ తరగతివి మాత్రమే వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇంతవరకు అన్ని పుస్తకాలు ఎమ్మార్సీ కేంద్రాలకు  తరలించలేదు. అక్కడకు చేరితేనే పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేస్తారు. ఎమ్మార్సీ కేంద్రాలకు వచ్చిన వెంటనే పాఠశాలలకు పంపించాలని  ఉన్నతాధికారులు ఎమ్యీవోలకు ఆదేశాలు జారీ చేసినా పుస్తకాలు పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత పంపిణీ చేద్దామన్న ఆలోచనలో వారు ఉన్నారు. దీంతో పుస్తకాల పంపిణీ  ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితినెలకొంది. దీంతోపాటు 5.99 లక్షల రాతపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా అది కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు.దీంతో  ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల్లో కూడా అందోళన నెలకొంది.

విడతల వారీగా..

గూడూరు ఎమ్మార్సీ కేంద్రంలో పాఠ్య పుస్తకాలు

బడితెరిచే నాటికి కొన్ని పుస్తకాలు ఇచ్చి, మిగిలినవి విడతల వారీగా  ఇస్తూ వస్తున్నారు.  ఈ సమస్యను ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రధానంగా పుస్తకాల పంపిణీలో జాప్యం విద్యార్థుల ఫలితాలపై  ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠ్యపుస్తకాల పంపిణీ వేగవంతం చేసి బడితెరిచేనాటికి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బడితెరిచే నాటికి అందించకపోతే ఇబ్బందుల్చే

ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీలో జరుగుతున్న జాప్యం విద్యార్థులకు అందించే బోధనపై  ప్రభావం చూపుతోంది. ఈసారి కూడా అదే పునరావృతం కాకుండా జూన్‌ 12వ తేదీ నాటికి పాఠశాలలకు పుస్తకాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విద్యాసంవత్సరంలో పదోతరగతి పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌లో మార్పులు, చేర్పులు జరిగాయి. కొత్త పుస్తకాలు అందిస్తే తప్ప  వార్షిక ప్రణాళిక తయారు చేసుకుని ఉపాధ్యాయులు బోధన ప్రారంభించడానికి అవకాశం ఉండదు.  గత కొన్నేళ్లుగా సకాలంలో అన్ని పుస్తకాలు అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు ఇవ్వకుండా నిర్దేశించిన సమయానికి సిలబస్‌ పూర్తిచేయాలంటూ ఒత్తిడి పెడుతున్నారంటూ పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.


చర్యలు తీసుకున్నాం

బడితెరిచే నాటికి అన్ని పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి మండలంలో పుస్తక నిల్వకేంద్రం ఏర్పాటు చేసి వచ్చిన పుస్తకాలు వచ్చినట్లు అక్కడ భద్రపరుస్తున్నాం. పుస్తక పంపిణీ  ప్రక్రియ సక్రమంగా నిర్వహించేలా ఎంఈవో-2లను ఇన్‌ఛార్జులుగా నియమించాం. ఇప్పటికే రాత పుస్తకాలు మండలకేంద్రాలకు చేరాయి. కొన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు కూడా వచ్చాయి. మిగిలిన పాఠ్యపుస్తకాలు కూడా త్వరలోనే కేంద్రాలకు చేరతాయి.

తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు