logo

విజ్ఞానం.. వినోదం

తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్‌-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్‌ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది.

Updated : 19 May 2024 04:04 IST

వేసవి శిక్షణ శిబిరాన్ని వినియోగించుకుంటున్న బాలబాలికలు
తిరువూరు, న్యూస్‌టుడే

శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులు

తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్‌-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్‌ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యం వెలికి తీసేందుకు చిత్రలేఖనం, చదరంగం, మెదడుకు పదును పెట్టేలా క్విజ్, వ్యాసరచన, బిడియం పోగొట్టేందుకు వక్తృత్వం వంటి పోటీలు, ఆటవిడుపుగా ఆటలు, పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఇంద్రజాలికుడు పాపారావు తన ఇంద్రజాల ప్రదర్శన ద్వారా విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. విద్యారంగ నిపుణులు తెలుగు, ఆంగ్లభాష, లెక్కల సబ్జెక్టుపై పట్టు సాధించడం కోసం మెలకువలు నేర్పిస్తున్నారు. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభను చాటి చెప్పేందుకు శిబిరాలను వేదికగా మలచుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్న శిబిరాలకు హాజరవుతూ విజ్ఞానం పెంపొందించుకోవడంతోపాటు వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.


కొత్త విషయాలు నేర్చుకున్నా

వేసవి శిక్షణ శిబిరంలో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఆంగ్లం, తెలుగు గ్రామర్‌లో మెలకువలు నేర్చుకున్నాను. లెక్కలు చేయడం కష్టం కాదని తెలుసుకున్నాను. స్నేహితులతో కలిసి ఆటపాటలతో గడుపుతుంటే సమయం తెలియడం లేదు. విజ్ఞానం పెంపొందించుకునేందుకు శిబిరాలు దోహదపడతాయని తెలిసింది.

డి.దీక్షిత, 8వ తరగతి


పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగింది

పుస్తక పఠనంలో భాగంగా కథలు, ప్రముఖుల జీవిత చరిత్ర వంటి పుస్తకాలు చదివిస్తున్నారు. పాఠశాలలో కేవలం పాఠ్యపుస్తకాలతోనే కుస్తీ పట్టే నాలాంటి వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగింది. కథల ద్వారా నీతిని, ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం వల్ల వారి లక్ష్యం అర్థమైంది.

ఎస్‌కే సమీనా, 9వ తరగతి


ఉత్సాహంగా హాజరవుతున్నాం

వేసవి శిక్షణ శిబిరంలో ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్పుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా క్రమం తప్పకుండా వస్తున్నాం. వీటికి తోడు పలు రకాల పోటీలు నిర్వహిస్తుండటంతో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మధ్య మధ్యలో ఆటవిడుపుగా జోక్స్‌ చెప్పడం, ఇంద్రజాల ప్రదర్శనల వల్ల బోర్‌ కొట్టడం లేదు.

తేజ ఉమాయశస్విని, 9వ తరగతి


నిపుణుల సలహాలు ఎంతో ఉపయోగం

రోజుకో అంశంపై చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. క్విజ్‌ పోటీలతో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. శిబిరానికి హాజరవుతున్న వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. మేము అడిగిన ప్రశ్నలకు విద్యారంగ నిపుణులు తమ సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు అనుమానాలను నివృత్తి చేస్తున్నారు.

నవ్యతేజశ్రీ, 6వ తరగతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని