logo

పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్‌ నేరగాళ్ల దందా

విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్‌లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు.

Updated : 19 May 2024 08:37 IST

సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో వల

విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్‌లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. నిజమే అని నమ్మిన ఆ యువకుడు సరే అనడంతో వెంటనే టెలిగ్రామ్‌ గ్రూప్‌లో కలిపి.. అందులో పలు పథకాలకు సంబంధించిన ప్రకటనలను పోస్ట్‌ చేశాడా మోసగాడు. ఆ వ్యక్తి సూచించిన బ్యాంకు ఖాతాల్లో దశలవారీగా రూ. 4 లక్షలు జమ చేశాడు ప్రసాదంపాడు యువకుడు. చెప్పిన గడువు దాటిపోయినా.. ఎంతకూ రాబడులు తన ఖాతాలో జమ కాకపోవటం... ఇంకా వివిధ పేర్లతో డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుండడంతో మోసపోయానని గుర్తించాడు. 

కొద్దిపాటి డబ్బుతోనే స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఊహించని లాభాలు ఆర్జించవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ ప్రకటనకు ఆకర్షితురాలయ్యారు నగరానికి చెందిన ఓ మహిళ. వెంటనే అందులో ఇచ్చిన ఫోన్‌ నెంబరుకు కాల్‌ చేసి మాట్లాడారు. తొలుత రూ. వెయ్యి పెట్టుబడి పెట్టమని చెప్పాడు అవతలి వ్యక్తి. దీనిపై రూ. 1,300 లాభం వస్తుందని నమ్మించాడు. అనుకున్నట్టే అంత మొత్తం రావటంతో ఆమె నమ్మి దశలవారీగా రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అంతే ఆ మోసగాడు స్పందించడం మానేశాడు.

ఈనాడు, అమరావతి: బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నాలుగురెట్ల రాబడి పొందవచ్చు.. స్టాక్‌ మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రకటనలతో సైబర్‌ మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రముఖుల బోగస్‌ ఇంటర్వ్యూలు, ఏఐ ఆధారిత వీడియోలను వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అధిక లాభాలు ఆర్జించవచ్చని నమ్మబలుకుతున్నారు. నిజమే అని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారికి తొలుత కొంత మొత్తం ఇచ్చి లాభాలుగా చూపించి నమ్మకం కలిగిస్తున్నారు. చివరకు పెద్దమొత్తాలను జమ చేయించుకుని పత్తా లేకుండా పోతున్నారు. 

క్రిప్టో కరెన్సీ రూపంలో తరలుతోంది

అమాయకుల ఖాతాల్లో జమవుతున్న నగదును సైబర్‌ మోసగాళ్లు పలు బినామీ ఖాతాలకు మళ్లిస్తున్నారు. వీటి నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో మన దేశం దాటించేస్తున్నారు. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా ఉంది. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం ఒకపట్టాన సాధ్యంకాని పరిస్థితి. 

అమాయకుల ఖాతాలతో లావాదేవీలు...

తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డ మోసగాళ్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు. డబ్బు, కమీషన్‌ ఆశ చూపించి వారి బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలను తీసుకుని వీటితో వ్యవహారాలను నడిపిస్తున్నారు. అసలు ఖాతాలే లేనివారిని కూడా ఒప్పించి మరీ అకౌంట్లు తెరిపిస్తున్నారు. వీటికి సంబంధించి పాస్‌బుక్, అంతర్జాల, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లను తమవద్దనే ఉంచుకుని అంతా నడిపిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ. చివరకు అమాయకులే దొరికిపోతున్నారు. వీరెవరికీ తమ ఖాతాల ద్వారా రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలియదు. 


ప్రకటనలు చూసి బోల్తా పడొద్దు

  • సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దు.
  • మీ వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లకు వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దు
  • పెట్టుబడుల పేరుతో అనేక సైట్లు, అప్లికేషన్లు వచ్చాయి. వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ముందుకెళ్లాలి.
  • మీ పెట్టుబడికి అనేక రెట్లు ఎక్కువ సొమ్ము వస్తుందని ఊరిస్తారు. వీటి వలలో చిక్కుకోవద్దు.
  • ఒకవేళ ఏదైనా గ్రూప్‌లోకి మీ ఆమోదం లేకుండా కలిపితే.. రిపోర్ట్‌ చేసి, బయటకు వచ్చేయడం మంచిది. అనుమతి లేకుండా అవాంఛిత గ్రూప్‌లలో కలిపేందుకు అవకాశం లేకుండా సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో మార్చులు చేసుకోవచ్చు.
  • ఆర్బీఐ ఆమోదించిన ఆర్థిక సంస్థల్లోనే పెట్టుబడులు సురక్షితం. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని