logo

సైకిల్‌ సవారీ.. వేస్తారా దారి?

విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్‌ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్‌లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్‌ చేస్తున్నారు.

Updated : 19 May 2024 04:26 IST

ట్రాక్‌ల ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?
రెండేళ్ల కిందటే నగరపాలక సంస్థ ప్రతిపాదనలు
ఈనాడు, అమరావతి

ఎంతో అనుకూలం

సైక్లింగ్‌కు విజయవాడ, మచిలీపట్నం అత్యంత అనువైన నగరాలు. రహదారులు ఎత్తుపల్లాల్లేకుండా సాఫీగా ఉండడమే దీనికి కారణం.

విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్‌ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్‌లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్‌ చేస్తున్నారు. విజయవాడలో సైక్లింగ్‌కు ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా నగరవాసులు కోరుతూనే ఉన్నారు. 2010లో అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు ప్రత్యేక చొరవ తీసుకుని బందరు, ఏలూరు రోడ్లు, బీఆర్‌టీఎస్‌లో సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయించారు. తర్వాత వచ్చిన అధికారులు ట్రాక్‌ల నిర్వహణను పట్టించుకోకపోవటంతో అవి కనుమరుగైపోయాయి. ప్రస్తుత కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 2022 ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించాక సైకిల్‌ ట్రాక్‌ల ఏర్పాటు కోసం ప్రయత్నించారు. ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలో అధికారుల నుంచి అభిప్రాయాలను సైతం సేకరించారు. కానీ.. ఇవేమీ ముందుకు కదల్లేదు.

ఐదు లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలపై డెమోగ్రాఫియా సంస్థ(అమెరికా) అధ్యయనం చేసి 2016లో నివేదించిన మేరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో తొలిగా ఢాకా, హైదరాబాద్‌ ఉన్నాయి. మూడో స్థానం విజయవాడదే.. 2016లోనే చదరపు కిలోమీటరుకు 31,200 మంది నివసిస్తున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇంత రద్దీగా ఉన్న నగరంలో ప్రజల శారీరక వ్యాయామానికి సరైన సౌకర్యాలు లేవు. అందుకే నగరవాసులను గుండె సంబంధ సమస్యలు, ఊబకాయం సహా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తే శారీరక, మానసిక వ్యాయామానికి దోహదపడుతుంది. రెండు నగరాల్లోనూ ఎటు నుంచి ఎటు వెళ్లినా పది కిలోమీటర్లలోపే ఉండడంతో సైకిల్‌ అనువైన వాహనం. దీన్ని వినియోగించాలని వేలాదిమందికి ఆసక్తి ఉన్నా.. రద్దీ రోడ్లపై సాధ్యం కావటం లేదు. భారీగా పెరిగిన ట్రాఫిక్‌ మధ్యలోంచి సైక్లింగ్‌ చేస్తున్నవారు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రత్యేకంగా రహదారులపై సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంధన ఖర్చు ఆదా..

 సైకిళ్ల వినియోగం పెరిగితే.. ఆరోగ్యంతో పాటు.. ఇంధన వ్యయాన్ని భారీగా ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 109.31, డీజిల్‌ ధర రూ. 97.17. నగరపాలక సంస్థలు సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయగలిగితే ఇంధనంపై నెలకు కనీసం రూ. వెయ్యి ఆదా చేయొచ్చు. పైగా అనారోగ్యాల కారణంగా ఆసుపత్రులకయ్యే వ్యయాన్నీ తగ్గించుకోవచ్చు.  

వాహన రద్దీని తగ్గించొచ్చు..

రెండు నగరాల్లో వాహన కాలుష్యం గత పదేళ్లలో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 15 లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు, 40 వేలకుపైగా ఆటోలు, వేల సంఖ్యలో కార్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు రహదారులపై తిరుగుతున్నాయి. విజయవాడలోని బెంజిసర్కిల్, ఎన్టీఆర్‌ సర్కిల్, రామవరప్పాడు, ఆటోనగర్, వన్‌టౌన్, ఏలూరు రోడ్డులోని అనేక కూడళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకూ ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా ఉంటోంది.

వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధుల బాధితుల సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. అందుకే సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా నాటి ప్రభుత్వం సైకిల్‌ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. వైకాపా వచ్చాక వాటిని బుట్టదాఖలు చేసింది.

నగరంలో పీఎం 10 (సూక్ష్మ ధూళి కణాలు) ఘనపు మీటరులో 114 మైక్రోగ్రాములు, పీఎం 2.5 (అతిసూక్ష్మ ధూళి కణాలు) ఘనపు మీటరులో 65 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు గతంలో ఓ నివేదిక తేల్చి చెప్పింది. ఇందులో వాహనాల ద్వారా వెలువడుతున్న ధూళి కణాలు.. పీఎం 10 సూక్ష్మధూళి కణాలు 33 మైక్రోగ్రాములు, పీఎం 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు 37 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు తేలింది.

చాలామంది ఆసక్తి..

ఇప్పటికే విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో లక్షల సంఖ్యలో సైకిళ్లు ఉన్నాయి. గతంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. బందరు రోడ్డులో పదేళ్ల కిందట సైకిల్‌ ట్రాక్‌ వేసినప్పుడు చాలామంది ఆసక్తిగా ముందుకొచ్చారు. తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోలేదు. ఇప్పటికీ సైకిళ్లపై తిరుగుతున్నవారు వందలాదిమంది ఉన్నారు. వీరిని ప్రమాదాలు చుట్టుముడుతున్నాయి. విద్యార్థుల్లో చాలామంది సైకిళ్లను వినియోగిస్తున్నారు. ట్రాక్‌లను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని