logo

సీసాలో పెట్రోల్‌ పోయలేదని బెదిరింపుల

సీసాలో లూజుగా పెట్రోల్‌ పోయనని చెప్పిన పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్‌ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్‌పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు.

Published : 20 May 2024 03:19 IST

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : సీసాలో లూజుగా పెట్రోల్‌ పోయనని చెప్పిన పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్‌ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్‌పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. కృష్ణలంకకు చెందిన బొజ్జా డానియేల్‌.. ద్విచక్రవాహనం దారిలో ఆగిపోవడంతో పెట్రోల్‌ కోసం గవర్నర్‌పేటలోని పైలట్‌ సర్వీస్‌ స్టేషన్‌కు శనివారం మధ్యాహ్నం సీసాతో వచ్చారు. సీసాలు, డబ్బాల్లో పెట్రోల్‌ లూజుగా విక్రయించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉండడంతో.. సిబ్బంది సీసాలో పెట్రోల్‌ పోసేందుకు నిరాకరించారు. డానియేల్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి, దుర్భాషలాడాడు. బంక్‌ను తగలబెడతానని బెదిరించాడని సిబ్బంది చెబుతున్నారు. దీనిపై బంక్‌ మేనేజర్‌ వెంకటప్పయ్య గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకట రమణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీ చూసి.. దాని ఆధారంగా కృష్ణలంకకు చెందిన బొజ్జా డానియేల్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితిలోనూ విక్రయించొద్దు

పెట్రోల్‌ బంక్‌ల్లో సీసాలు, డబ్బాల్లో పెట్రోల్, డీజిల్‌ విక్రయిస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని గవర్నర్‌పేట సీఐ వెంకట రమణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆయన గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీసాలు, డబ్బాల్లో ఎట్టి పరిస్థితిలోనూ విక్రయించవద్దని.. ఎవరైనా కావాలంటూ ఒత్తిడి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. బంక్‌ లైసెన్సు రద్దు చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు