logo

నైపుణ్యనారీ.. విజయాల భేరి

కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు.

Updated : 20 May 2024 04:28 IST

స్వయంగా రాణించేలా తర్ఫీదు
కేబీఎన్‌ కళాశాలలో మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణ
ఈనాడు డిజిటల్, అమరావతి

మగ్గం వర్క్‌ నేర్చుకుంటూ..

కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంట్లో పనులు చక్కదిద్దుకుని.. తీరిక వేళల్లో స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ఆలోచనలకు పదునుపెడుతూ.. ఎక్కువ పనిభారం లేకుండా జ్ఞానం పెంపొందించుకుంటూ.. కుటుంబానికి చేదోడు అందిస్తున్నారు. ఇటువంటి ఔత్సాహిక మహిళలకు విజయవాడలోని కేబీఎన్‌ కళాశాలలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా విభాగం ఉచితంగా వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి.. వారిని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తోంది.

ఆదాయ మార్గాలు చూపిస్తూ..

విజయవాడలోని కేబీఎన్‌ కళాశాల 2006లో ప్రత్యేకంగా ‘మహిళా సాధికారిత విభాగాన్ని’ ప్రారంభించింది. కళాశాల విద్యార్థినులే కాక చుట్టుపక్కల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై వివిధ విభాగ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందించి సులభతరంగా ఆదాయ మార్గాలు చూపిస్తున్నారు. 2015లో యూనియన్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ పనితీరును గుర్తించి..ఉమెన్‌ స్టడీ సెంటర్‌గా మార్పు చేసింది.  కంప్యూటర్‌ అప్లికేషన్స్, గ్రాఫిక్స్, డిజైనింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్‌ స్టైలింగ్, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్, గ్లాస్‌ శాండ్‌ పాట్‌ పెయింటింగ్, ఇంటీరియర్‌ డిజైనింగ్, జూవెలరీ మేకింగ్, మెహందీ డిజైన్, ఆన్‌లైన్‌ పర్చేజింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.

బ్యూటీపార్లర్‌ శిక్షణ పొందుతున్న మహిళలు

రూ.100 కడితే చాలు..

రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఉచితంగా శిక్షణ ఇస్తుండడంతో ఎక్కువ మంది చేరుతున్నారు. ఏడాది పొడువునా టైలరింగ్, స్కూటీ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు.  ట్రాఫిక్‌ నిబంధనలను వివరించడం, డ్రైవింగ్‌ లైసెన్సు పొందేందుకు అవగాహన కల్పిస్తున్నారు. నిర్వాహకులు, టైలరింగ్‌ పూర్తి చేసిన వారు ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. రూ.100 దరఖాస్తు రుసుము మినహా శిక్షణ కాలంలో ఎలాంటి రుసుము వసూలు చేయకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

గ్లాస్‌ శాండ్‌ పాట్‌..

వ్యాపారంగా మలుచుకుంటూ..

విద్యార్థునులతో పాటు.. గృహిణులు ఇంట్లో తమ బాధ్యతలు నిర్వర్తిస్తునే.. ఇంట్లో పిల్లలతో పాటు ఇతరులకు కావాల్సిన దుస్తులు కుట్టి ఈ పనినే వ్యాపారంగా మలుచుకుంటున్నారు. వస్త్రాలంకరణతో పాటు అతివల అలంకరణలో నూతన డిజైన్లు, ఫ్యాషన్లకు అనువైన రీతిలో తర్ఫీదు ఇస్తున్నారు. దుస్తులు, జూవెలరీ, డిజైనింగ్స్, పెయింటింగ్స్‌లో శిక్షణ తీసుకున్నవాళ్లంతా.. వాట్సప్‌ గ్రూపులు, ఆన్‌లైన్‌ ద్వారా ప్రచారం చేస్తూ వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. బ్యూటీషియన్‌ కోర్సులు నేర్చుకున్న వారంతా వివాహాది శుభకార్యాలకు మహిళలను ముస్తాబు చేసేందుకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి మేకప్‌ వేస్తూ నెలకు పదివేల నుంచి 25 వేల రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నారు.

మెహందీ వేస్తూ..


మహిళా సాధికారితకు కృషి

ఉమెన్‌ స్టడీ సెంటర్‌ కేవలం శిక్షణ ఇచ్చి వదిలేయకుండా తర్ఫీదు అనంతరం ధ్రువపత్రాలు అందిస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందిపుచ్చుకునేందుకు ఈ ధ్రువపత్రాలు ఉపయోగపడతాయి. ఇప్పటిదాక 30 వేల మంది మహిళలు శిక్షణ పొందారు. వారంతా స్వశక్తితో వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. ఈ శిక్షణలకు లభిస్తున్న ఆదరణతో మరిన్ని కొత్త కోర్సులను ప్రారంభించి మహిళలకు ఆర్థిక భద్రత, సాధికారిత దిశగా వారిని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తాం. 

వి.శైలజ, ఉమెన్‌ స్టడీ సెంటర్‌ విభాగాధిపతి, కేబీఎన్‌ కళాశాల


స్వయంగా సంపాదిస్తున్నాను

నేను మగ్గం వర్క్‌ 25 రోజులుగా నేర్చుకుంటున్నాను. ఇదే వర్క్‌ బయట నేర్చుకోవాలంటే వేలల్లో ఖర్చు చేయాలి. ఉమెన్‌ స్టడీ సెంటర్‌లో కేవలం రూ.100 ప్రవేశ రుసుముతోనే సులభంగా నేర్చుకునే అవకాశం కల్పించారు. ఇంట్లో కూడా మగ్గం వర్క్‌ ప్రాక్టీస్‌ చేస్తూ.. చిన్న దుకాణం పెట్టాను. స్వయంగా నాలుగు రోజుల్లో ఒక బ్లౌజ్‌కి మగ్గం వర్క్‌ చేస్తూ.. డబ్బు సంపాదిస్తున్నాను.

గృహలక్ష్మి, విజయవాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు