logo

జాతీయ రహదారైతే మాకేంటి?

16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్‌కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది.

Published : 20 May 2024 03:35 IST

ఇష్టారాజ్యంగా వాహనాల నిలుపుదల
విస్తరించింది ఇందుకేనా అంటున్న ప్రజలు
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే

హనుమాన్‌జంక్షన్‌ శివారులో సర్వీసు రోడ్డులోకి రాలేని విధంగా లారీల నిలిపివేత

16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్‌కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. ఇవి వాహనాలు తిరిగేందుకు వీలుగా కృష్ణా జిల్లా చిన్నఆవుటపల్లి నుంచి ఏలూరు జిల్లా కలపర్రు వరకు 24 కి.మీ మేర దీనిని రెండేళ్ల కిందట ఆరు వరుసలుగా విస్తరించారు. అప్పట్నుంచి ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలను నిలిపివేయడం మరింత ఎక్కువైంది. ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన హైవే పెట్రోలింగ్‌ అధికారులు కానీ, పోలీసు శాఖకు చెందిన రోడ్‌ సేఫ్టీ సిబ్బంది కానీ అంతగా పట్టించుకోకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరగడంతో పాటు, రాకపోకలకు నానా పాట్లు పడాల్సి వస్తోంది.

అడ్డదిడ్డంగా: జాతీయ రహదారి విస్తరణ తర్వాత లారీలు నిలుపుకొనేందుకు వీలుగా తేలప్రోలు శివారు, బొమ్ములూరు టోల్‌ప్లాజా సమీపంలో ట్రక్‌ లేబైలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిమితికి మించి భారీ వాహనాలను నిలపడంతో పాటు, చిన్నఆవుటపల్లి నుంచి ప్రారంభించి బొమ్ములూరు వరకు పలుచోట్ల లారీలను నిలిపి ఉంచడం నిత్యకృత్యమైంది. చిన్నఆవుటపల్లి, ఆత్కూరు, తేలప్రోలు, అంపాపురం, వీరవల్లి, శేరీనరసన్నపాలెం, వేలేరు, బొమ్ములూరు వద్ద హైవే వంతెనలు ఎక్కేచోట, దిగేచోట పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక రెండు టోల్‌ ప్లాజాల వద్ద రహదారి ఉందా? లేక మొత్తం లారీల పార్కింగ్‌కే కేటాయించారా? అన్నరీతిలో ఉంటుంది ఇక్కడ పరిస్థితి.

ఏ అండర్‌ పాస్‌లో చూసినా ఇదే పరిస్థితి

రాకపోకలు గగనం: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్న గ్రామాలను వేరు చేస్తూ సర్వీసు రోడ్లను నిర్మించారు. ఈ క్రమంలో రెండు గ్రామాలకు ఒకచోట హైవే నుంచి సర్వీసు రోడ్డులోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో చిన్నఆవుటపల్లి నుంచి కలపర్రు వరకు ఉన్న 17 గ్రామాలకు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు వీటి మీదుగానే వెళ్లాల్సి ఉంది. కానీ పొట్టిపాడు, బొమ్ములూరు, వేలేరు వంటి గ్రామాల వద్ద విచ్చలవిడిగా లారీలు, భారీ వాహనాలు ఎడాపెడా నిలిపివేసి ఉంచడంతో ప్రజా రవాణా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడుతోంది. వీటి అడ్డంకుల్ని అధిగమించలేక రాత్రి వేళ్లలో కొన్నిసార్లు ఆర్టీసీ బస్సులు గ్రామాల్లోకి రాకుండానే వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా కళాశాలల విద్యార్థులు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు ఇంటికి చేరుకునేందుకు నానా ప్రయాసలు పడాల్సి వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకోని పెట్రోలింగ్‌ యంత్రాంగం

16వ జాతీయ రహదారి అత్యంత భద్రత ప్రమాణాలు కల్గిన మార్గంగా రూపొందించేందుకు ఆదర్శ(మోడల్‌) ప్రాజెక్టుగా ఎంపిక చేసి, విదేశీ ప్రమాణాలు అవలంబించేలా చర్యలు చేపడుతున్నట్లు జాతీయ రహదారుల సంస్థ, రవాణా, పోలీసు అధికారులు గతంలోనే ప్రకటించారు. కానీ విస్తరణ తర్వాత ఇవేవీ ఆచరణకు నోచుకోలేదు. కనీస స్థాయిలోనైనా ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్‌ఏఐ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి. రహదారిపై వాహనాలు నిలిపి ఉంచకుండా, రాకపోకలకు ఎలాంటి అవరోధాలు కలగకుండా చూసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ తరఫున నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలతో పాటు, పోలీసు ఆధ్వర్యంలో కేటాయించిన పెట్రోలింగ్‌ వాహనాలు నిరంతరాయంగా పర్యవేక్షించాల్సి ఉంది. కానీ సంబంధిత యంత్రాంగం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని