logo

నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది.

Published : 20 May 2024 06:39 IST

బూత్‌ల వారీగా లెక్కలేసుకుంటున్న నేతలు
ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తోనూ సమాచారం సేకరణ
బయటపడుతున్న వైకాపా డబ్బుల పంచాయితీలు
ఈనాడు, అమరావతి

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఎవరికి వాళ్లు పెరిగిన ఓట్లు మావేనని.. లెక్కలేస్తునారు. బూత్‌ల వారీగా ఎన్నేసి ఓట్లు పడ్డాయి? వాటిలో తమకెన్ని వచ్చే వీలుందనే దానిపై అభ్యర్థులు లెక్కకడుతున్నారు. తమకు ఎంత మెజార్టీకి వీలుందో.. పార్టీ శ్రేణుల వద్ద ప్రకటిస్తున్నారు. ప్రధాన పార్టీల తరఫున బూత్‌ ఏజెంట్లుగా కూర్చున్న వారితో ఆరా తీస్తూ.. ఎంత ఓటింగ్‌ పడిందనే లెక్కలు కడుతున్నారు. ఈమేరకు పందేలూ జోరుగా కాస్తున్నారు. రెండు జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలుండగా.. అన్నిచోట్లా కూటమికే గెలుపు అవకాశాలు ఉన్నాయని పందేలు కాసేందుకు ఎక్కువ మంది సై అంటున్నారు

ప్రధానంగా పెనమలూరు, గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ, పామర్రు, తిరువూరుల్లో ఓటింగ్‌పైనే అందరి దృష్టి ఉంది. గుడివాడలో కొడాలికి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. అందుకే.. ఇలాంటి స్థానాలపై పందేలు జోరుగా సాగుతున్నాయి. పైగా.. కొడాలి అనుచరులు కూడా డబ్బుల పంపిణీ సరిగా చేయలేదని ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.

ఐవీఆర్‌ఎస్‌ ద్వారా గుర్తింపు..

మే 13న జరిగిన ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేశారు? పలానా పార్టీకి వేస్తే.. ఒకటి నొక్కండి.. లేదంటే రెండు నొక్కండి..’ అని ప్రస్తుతం రెండు జిల్లాల్లోని ఓటర్లకు ఐవీఆర్‌ఎస్‌ ఫోన్లు వస్తున్నాయి. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది గుర్తించేందుకు.. ఇలా పార్టీల ఆధ్వర్యంలో ఫోన్లు చేయించి మరీ గెలుపు అవకాశాలను లెక్కలు కడుతున్నారు. ప్రస్తుతం దీనిపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ను రాకుండా ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలంటూ.. విజయవాడకు చెందిన ఓ ప్రొఫెసర్‌ విజ్ఞప్తి చేశారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేసి ఎవరికి వేశారో చెప్పమని అడగడం కూడా.. ఓటర్ల గోప్యతకు భంగం కలిగించినట్టేనని ఆయన పేర్కొన్నారు. పైగా.. పార్టీల ఆధ్వర్యంలో ఎవరికి ఓటు వేశారని అడిగి, తీరా చెప్పాక.. ఫోన్‌ నంబర్ల ఆధారంగా వారిని గుర్తించి.. వేధింపులకు దిగే అవకాశం కూడా ఉందన్నారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో.. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా గుర్తించి.. పందేలు కాసేందుకు కూడా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఇలాంటి వాటికి కచ్చితంగా అడ్డుకట్ట వేయాలని కోరారు.    

డబ్బుల పంపిణీ తేలుతోంది..

పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు అధికార వైకాపా తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేసిన విషయం ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా గుడివాడలో కొడాలి నాని అనుచరుడు వీడియోలను విడుదల చేసి మరీ.. ఈ డబ్బుల పంపిణీ విషయం బయటపెట్టాడు. తాము ఇచ్చిన డబ్బులు సరిగా పంపిణీ జరగలేదని కొడాలి నాని వర్గం ఆరా తీస్తున్న నేపథ్యంలోనే వీడియోల ద్వారా వైకాపా నేతలు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. నాని ఇచ్చిన డబ్బులు తినేసినోళ్లు.. విదేశాలకు వెళ్లి జల్సాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని, వారిని పట్టుకోవాలంటూ వైకాపా నేత పెట్టిన వీడియో.. ప్రస్తుతం అధికార పార్టీ తాయిలాల గుట్టును బయటపెట్టింది. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ వైకాపా నేతలు ఇచ్చిన డబ్బులను వారి అనుచరులు సరిగా పంచలేదని.. తెరవెనుక పంచాయితీలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఓటింగ్‌ ముగిశాక కూడా ప్రత్యర్థులు, తమకు ఓట్లు వేయని వాళ్లపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపులకు దిగుతూనే ఉన్నారు. ఇలాగే గుడ్లవల్లేరు మండలం కవుతరంలో తెదేపా సానుభూతిపరుడి ఇంటిపైకి వైకాపా మూకలు పోలింగ్‌ తర్వాత దాడికి దిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని