logo

‘ఓటే’మాతరం

ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే.  సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. 

Updated : 20 May 2024 05:18 IST

ఉవ్వెత్తున ఎగసిన జన చైతన్యం
పోలింగ్‌లో రికార్డులు
అత్యధిక బూత్‌లలో 95% పైగానే ఓటింగ్‌
ఈనాడు, అమరావతి - మధురానగర్, న్యూస్‌టుడే

ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే.  సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు.   తననెవరు పరిపాలించాలో.. ఐదేళ్లకోసారి ఓటు ద్వారా ఎన్నుకునే సదవకాశాన్ని కాదనుకుంటే ఏం జరుగుతుందో గ్రహించారు కాబట్టే... కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్‌ నమోదైంది. ఖండాలు దాటి... దేశాలు దాటి.. రాష్ట్రాలను దాటి... వేల కిలోమీటర్లు వచ్చి మరీ ఓటేశారంటే.. అదే ప్రజాస్వామ్య గొప్పదనం. ఎప్పుడూ బద్ధకంగా ఉండే నగర ఓటరు సైతం ఒళ్లు విరుచుకుని మరీ ఓటుకు పోటెత్తారు కాబట్టే నగరాల్లోనూ గరిష్ఠస్థాయిలో ఓట్లు పోలయ్యాయి. అంతేకాదు.. అత్యధిక గ్రామాల్లో 95 శాతానికి మించి పోలింగ్‌ నమోదైంది. 2019లో అత్యధిక ఓటింగ్‌ అనుకుంటే 2024లో అంతకుమించి రికార్డులు బద్ధలయ్యాయి.

విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ పరిధిలో గతంతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరిగినప్పటికీ ఏ ఒక్క బూత్‌లో కూడా 90 శాతం మించి ఓట్లు పోల్‌కాకపోవడం గమనార్హం.

విజయవాడకు చెందిన విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం కుటుంబం చెన్నైలో ఉంటోంది. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణకు ఈయన దూరపు బంధువు. ఈయన ఇద్దరు కుమార్తెలు దీప్తి, లావణ్య చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులంతా  విజయవాడ వచ్చి ముత్యాలంపాడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ బూత్‌ వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడి మరీ ఓట్లేశారు.


గన్నవరం

98%

 

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: గన్నవరం మండలం చిక్కవరంలోని 111 బూత్‌లో 98.99 శాతం ఓటింగ్‌ జరిగింది. మొత్తం 595 మంది ఓటర్లకు గాను 589 మంది ఓటు వేశారు. ఇదే గ్రామంలోని 112 బూత్‌లో సైతం 97.38 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 381 మంది ఓటర్లకు గాను 371 మంది ఓటు వేశారు. ఉంగుటూరు మండలం మధిరపాడులో 96.83 శాతం ఓటింగ్‌ జరిగింది. మొత్తం 347 మంది ఓటర్లు ఉండగా, 336 మంది ఓటు వేశారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో 183వ బూత్‌లో 96.10 శాతం నమోదైంది. మొత్తం 616 ఓటర్లకు గాను 592 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే పంచాయతీలోని 184వ బూత్‌లోనూ 95.52 శాతం పోలింగ్‌ జరిగింది. మొత్తం 1,005 మంది ఓటర్లకు గాను 960 మంది ఓటు వేశారు. ఎక్కువుగా రైతులు, కూలీలే ఉన్నప్పటికీ ఓటు వినియోగంలో స్ఫూర్తి చాటారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ 95 శాతం ఓటింగ్‌ జరగడం గమనార్హం.

మిన్నగా నిలిచాయి: చిన్న గ్రామాల్లో అత్యధిక ఓటింగ్‌ జరిగింది. గన్నవరం మండలం జక్కులనెక్కలం, బూతిమిల్లిపాడులో దాదాపు 97 శాతం, ఉంగుటూరు మండలం వెన్నూతలలో 96, తుట్టగుంటలో 95, లంకపల్లి, గారపాడులో 94 శాతం నమోదైంది.
రంగన్నగూడెంలో రెండు గంటలు ఈవీఎం మొరాయించినా ఓటేసేందుకు ఓపిగ్గా నిరీక్షించారు


తిరువూరు

97%

తిరువూరు: కాలికి గాయమైనా 80 ఏళ్ల వయసులో ఓటేసిన వృద్ధురాలు

తిరువూరు, గంపలగూడెం: ఎ.కొండూరు: కోమటికుంట 231 బూత్‌లో అత్యధికంగా 97.09 శాతం నమోదైంది. 412 మందికి 400 మంది ఓటేసి ఆదర్శంగా నిలిచారు. బీసీ, ఎస్టీ, ఓసీ ఓటర్లు వెల్లువలా వచ్చి స్ఫూర్తి చాటారు. ర

  • ఎ.కొండూరు: కుమ్మరికుంట్ల 222 పోలింగ్‌ బూత్‌లో 95.30 శాతం పోలింగ్‌ నమోదైంది. గిరిజన మహిళలు తరలివచ్చారు. 
  • విస్సన్నపేట: కొండపర్వలో మూడు బూత్‌లలో 95.20, 95.28, 96.44 పోలింగ్‌ నమోదైంది.
  • చెన్నవరం 51వ పోలింగ్‌ బూత్‌లో 508 మందికి 489 మంది ఓటేయగా 96.25% పోలింగ్‌ నమోదైంది.
  • లింగాలలో 38, 39 పోలింగ్‌ కేంద్రాల్లో 1,433 మందికి 1,371 మంది (95.67%) ఓటేశారు.

మైలవరం

99%

మైలవరం: గణపవరంలో ఓటేసేందుకు మహిళల బారులు

మైలవరం: రెడ్డిగూడెం మండలం అడవి కొత్తూరులో 129 మందికి 128 మంది ఓట్లేయగా 99.22 శాతంగా నమోదైంది. మొర్సుమిల్లి తండాలో 177 ఓట్లకు 173 మంది ఓటేయగా 97.74 శాతం నమోదైంది. ఇక్కడంతా వ్యవసాయ కూలీలే. ఇక్కడే 75వ పోలింగ్‌ బూత్‌లో 858కి 836 మంది ఓటేయగా, 97.44 శాతంగా నమోదైంది. మైలవరం నియోజకవర్గంలో 296 పోలింగ్‌ బూత్‌లకు.. 32 చోట్ల 94 శాతంపైగా.. మరో 80 బూత్‌లలో 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. అధికశాతం పోలింగ్‌ జరిగిన ప్రతీచోట మహిళలే అధికంగా ఓటు వేయడం విశేషం


పామర్రు

96%

పామర్రు గ్రామీణం: తోట్లవల్లూరు మండలం తోడేళ్లదిబ్బలో 3వ బూత్‌లో 346 మందికి 334 మంది ఓటేయగా 96.53 శాతం నమోదైంది.

  • గుర్విందపల్లి 36వ పోలింగ్‌ బూత్‌లో 736 మందికి 704 మంది ఓటేయగా 95.65 శాతం..  
  • అగినపర్రు 70వ బూత్‌లో 581కి 554 ఓట్లు పోలై 95.35%.. 
  • పామర్రు మండలం ప్రాకెర్లలో 176వ బూత్‌లో 331 మందికి 316 మంది తరలిరాగా 95.47.. 
  • మొవ్వ మండపాలెం 234వ బూత్‌లో 946 మందికి 902 మంది ఓటేయగా 95.75% వచ్చింది. 
  • కాజ 235వ పోలింగ్‌ బూత్‌లో 439 మందికి 420 మంది ఓటేయగా 95.67% వచ్చింది.

అవనిగడ్డ

96%

కోడూరులో కిటికిటలాడిన పోలింగ్‌ బూత్‌

అవనిగడ్డ: నాగాయలంక మండలం చోడవరం బూత్‌ నెంబర్‌ 233లో 977 మందికి 943 మంది ఓటేయగా 96.52 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎస్సీ, బీసీలు అత్యధికంగా ఉన్నారు. 245వ బూత్‌.. పాత ఉపకాలిలో 634 ఓట్లకు 604 పోలవగా 95.27 శాతం ఓటింగ్‌ నమోదైంది.


నందిగామ

96%

నందిగామ గ్రామీణం: చందర్లపాడు: లింగాలపాడులో 763 మంది ఓటు వేయగా 95.73 శాతం, తక్కెళ్లపాడులో 95 శాతం, నందిగామ డీవీఆర్‌ కాలనీలో 95 శాతం, చందర్లపాడులో 96.20, ఉస్తేపల్లిలో 96.04, పోపూరులో 96.72, కంచికచర్ల మండలం వేములపల్లి, గొట్టుముక్కల, కొత్తపేటల్లో 95 % నమోదైంది. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన యువత... వెల్లువలా తరలివచ్చారు.


మచిలీపట్నం

96%

గొడుగుపేట: పొట్లపాలెంలోని 18వ బూత్‌ పరిధిలో 458 ఓటర్లు ఉండగా 440 మంది ఓటేయగా 96.07 నమోదైంది. 

  • కొత్తపూడి 17వ పోలింగ్‌బూత్‌లో 635 మందికి 607 మంది ఓటేయగా 95.59 ఓటింగ్‌ శాతం నమోదైంది. అందరూ అన్నదాతలే అయినా ఓటు ప్రాధాన్యం చాటిచెప్పారు. 
  • మంగినపూడిలో 16వ పోలింగ్‌ బూత్‌లో 816 మందికి 782 మంది ఓటేయగా 95.83 శాతం ఓటింగ్‌ వచ్చింది.

పెనమలూరు

96%

కంకిపాడు: మండలంలోని జగన్నాథపురం 96.26 శాతం పోలింగ్‌తో మేటిగా నిలిచింది. పోలింగ్‌ కేంద్రాలు 205లో 96.2, 227లో 95.17 శాతం పోలింగ్‌ జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు, ఉయ్యూరు గ్రామీణ మండలాల్లోని 28 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 90-99 శాతం ఓటింగ్‌ నమోదైంది.కోలవెన్నులో 218 బూత్‌లో 100% పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు పేర్కొనగా 92.18 శాతమే.. 757కు 710 పోలైనట్లు ప్రధాన పార్టీల ఏజెంట్లు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


గుడివాడ

95%

గుడివాడ గ్రామీణం: గుడ్లవల్లేరు.. పసుబొట్లవారిపాలెం 219వ బూత్‌లో 870 మందికి 829 మంది ఓటేయగా.. 95.29 శాతం పోలింగ్‌ జరిగింది. చినగొన్నూరు 211 బూత్‌లో 527 మందికి 501 మంది ఓటేయగా 95.07.. 

  • చంద్రాల 178వ బూత్‌లో 640 మందికి 614 మంది ఓటేసి 95.94 శాతం నమోదైంది.
  • గుడివాడ మండలం శెరీదింటకుర్రు  171లో 627 మందికి 601 మంది ఓటేయగా 95.85 శాతం పోలింగ్‌ వచ్చింది. 
  • నందివాడ: చినలింగాల రెండో బూత్‌లో 373 మందికి 356 మంది ఓటేసి 95.44 పోలింగ్‌ శాతం నమోదు చేశారు, చేతివృత్తుల వారే ముందుండి ఓటేసి స్ఫూర్తిగా నిలిచారు.

పెడన

97%

పెడన: బంగ్లాస్కూలు పోలింగు కేంద్రంలో రాత్రి 10 గంటలయినా..

పెడన: కృత్తివెన్ను... ఒర్లగొందితిప్పలో 1,151కి 1,048 ఓట్లు పోలవగా 91.05 శాతం పోలింగ్‌ వచ్చింది.ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు భారీగా వచ్చి ఓటేయగా.. గత ఎన్నికల్లో 76 శాతమే నమోదైన పోలింగ్‌ ఈసారి ఏకంగా 15 శాతం పెరిగింది. 

  • గూడూరు: పిండివానిపాలెంలో 1,149 మందికి 1,116 మంది ఓటేయగా 97.12 శాతం నమోదైంది. రైతులు, రైతు కూలీలు అధికంగా తరలివచ్చారు.
  • బంటుమిల్లి మండలం చోరంపూడి, గూడూరు మండలం పోసినవానిపాలెం, పెడన బంగ్లాస్కూలు, 5వ వార్డు పోలింగు కేంద్రాల్లో రాత్రి 10.30 గంటల వరకు పోలింగ్‌ జరిగింది.

జగ్గయ్యపేట

96%

జగ్గయ్యపేట: తిరుమలగిరి 72వ నెంబర్‌ బూత్‌లో 1,137 మందికి 1,101 మంది ఓటేయగా.. 96.83% పోలింగ్‌ నమోదైంది. వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజలే ఇక్కడి ఓటర్లలో అధికం.

పెనుగంచిప్రోలు: తోటచర్లలోని 193 బూత్‌లో 762కి 733 ఓట్లు పడగా 96.19%... కొళ్లికూళ్ల 198వ బూత్‌లో 1,084 ఓట్లకు 1,030 ఓట్లు నమోదవగా 95.02%.. శివాపురం బూత్‌ నంబరు 161లో 742 మందికి 704 మంది ఓటేయగా 94.88% పోలింగ్‌ జరిగింది. నవాబుపేట 188, 189, 190, 191 బూత్‌ల్లో ఎన్నడూలేనంతగా 91-93% ఓటింగ్‌ జరిగింది. అనిగండ్లపాడులో సాయంత్రం 6 గంటల తర్వాత వందల మంది రాగా రాత్రి 11.30 వరకు ఓట్లు వేసే అవకాశం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని