logo

సీతనపల్లి చెరువులో తాగునీటి చౌర్యం

కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది.

Published : 21 May 2024 05:08 IST

చేపల చెరువులకు మళ్లించినట్లుగా అనుమానం 
కృత్తివెన్ను మండలంలో దాహం కేకలు

అడుగంటుతున్న నీటి నిల్వలు 

పెడన, న్యూస్‌టుడే: కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. గత నెలలో ఈ చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపగా కొద్ది రోజుల్లోనే నిల్వలు నేలమట్టానికి చేరుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చెరువు నుంచి సమీపంలో ఉన్న చేపల చెరువులకు ఈ నీటిని మళ్లించినట్లు మండల ప్రజలు అనుమానిస్తున్నారు. 

కృత్తివెన్ను మండలంలో 16 పంచాయతీలు, 50 వేల జనాభా ఉండగా చినపాండ్రాక, ఇంతేరు పంచాయతీలు మినహా మిగిలిన 14 పంచాయతీల పరిధిలోని 40 గ్రామాలకు సీతనపల్లి సామూహిక నీటి పథకం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. దాదాపు 14 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువును ఒక్కసారి పూర్తిగా నింపితే రెండు నెలల వరకు తాగునీటి అవసరాలు తీరుతాయి. గత నెలలో కాలువలకు అత్యవసరంగా నీటిని విడుదల చేయగా చెరువును పూర్తి స్థాయిలో నింపారు. జూన్‌ రెండో వారంలో కాలువలకు నీటిని విడుదల చేసేంత వరకు చెరువులోని నీటి నిల్వలతో మండల ప్రజలు తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. ఒక్కసారిగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో మండలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చెరువులోని నీటిని సమీపంలోని చేపల చెరువులకు మళ్లించారని ఇందులో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పాత్ర ఉందని జడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆందోళన వెలిబుచ్చి ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంప్‌ నుంచి నీరు తీసుకెళ్తున్న గ్రామస్థులు 

తాగునీటి ఎద్దడి : ప్రస్తుతం మండలంలోని ఉప్పులూరు, చెరుకుమిల్లి, ఏటిపవరు, చినగొల్లపాలెం, వాల్లంక, పీతలావ, కృత్తివెన్ను, పడతడిక, ఒర్లగొందితిప్ప తదితర గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఒర్లగొందితిప్ప, పడతడిక గ్రామాల్లో కనీసం మంచినీటి చెరువులు కూడా లేకపోవడంతో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏటిపవరు గ్రామానికి వారానికి ఒకరోజు కూడా సరఫరా జరగడం లేదు. 1500 జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. దీనిపై ఆర్‌డబ్లూఎస్‌ ఏఈ నాగేశ్వరరావు వివరణనిస్తూ..నీటి చౌర్యం జరగలేదని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని