logo

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ఠ బందోబస్తు

‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా

Published : 21 May 2024 05:14 IST

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ
ఈనాడు - అమరావతి

‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామ’ని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ చెప్పారు. నగరంలోని కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఎక్కువగా ఘర్షణలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పారదర్శక, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలి. శాంతి, భద్రతలపరంగా సమస్యలు సృష్టించిన 109 మందిని గుర్తించామనీ, త్వరలో వారిని బైండోవర్‌ చేస్తామని వివరించారు. పది మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తాం. ఏడుగురిని నగర బహిష్కరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని’ వివరించారు. 

స్ట్రాంగ్‌రూమ్‌లు అనుసంధానిస్తూ కంట్రోల్‌ రూమ్‌.. ఈవీఎంలు భద్రపర్చిన నిమ్రా, నోవా కళాశాలల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశాం. వాటికి మూడంచెల భద్రత కల్పించాం. స్ట్రాంగ్‌ రూంల పరిసర ప్రాంతాలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాం. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉన్న వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు, ఏజెంట్లకు మాత్రమే స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించేందుకు అనుమతి ఉంది. స్ట్రాంగ్‌ రూంలోకి వెళ్లేముందు, తిరిగి వచ్చేముందు వివరాలను లాగ్‌ బుక్‌లో రాయాలి. 29 స్ట్రాంగ్‌ రూంలను అనుసంధానం చేస్తూ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. సీనియర్‌ పోలీస్‌ అధికారులు వీటిని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. ఎన్నికలు ముగిసిన అనంతరం జరిగిన సంఘటలను దృష్టిలో పెట్టుకొని అన్ని డివిజన్లలో పికెట్లు ఏర్పాటు చేశాం. సెక్షన్‌ 144తో పాటు పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉండడంతో కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టరాదు. వదంతులు నమ్మి ఎవరూ గొడవలకు పాల్పడవద్దు. ఏవైనా అనుమానాలుంటే పోలీసులను సంప్రదించి రూఢి చేసుకోవాలి. 


సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా

సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు. పెట్రోల్‌ బంకుల్లో డబ్బాలు, క్యాన్‌లలో పెట్రోల్‌ అమ్మకాలపై నిషేధం ఉంది. బాణసంచా అమ్మడం, కాల్చడం ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టేనని వాటి తయారీ, విక్రయదారులకు నోటీసులు జారీ చేశాం. సామజిక మాధ్యమాల్లో ఎవరైనా విష ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. సోషల్‌ మీడియా పర్యవేక్షణపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ బృందాన్ని మరింత విస్తరించాం. కీలకమైన ప్రాంతాల్లో స్టేషన్ల వారీగా కూడా ఏర్పాటు చేయాలని తలపోస్తున్నాం. తద్వారా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పక్కా నిఘా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామ’ని సీపీ రామకృష్ణ వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని