logo

చొరవ లేకనే చక్రబంధం!

విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు రోడ్డెక్కితే.. ఎప్పటికి గమ్యస్థానం చేరతామో తెలియకుంది. రద్దీ సమయాల్లో అయితే మరింత చికాకు పెడుతున్నాయి.

Updated : 21 May 2024 06:12 IST

చిన్న సమస్యలతో నగరంలో గంటలకొద్దీ ట్రాఫిక్‌
చక్కదిద్దే వాటినీ వదిలేస్తున్న పోలీసులు
ఈనాడు - అమరావతి

పద్మవ్యూహాన్ని తలపిస్తున్న బెజవాడ ట్రాఫిక్‌

విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు రోడ్డెక్కితే.. ఎప్పటికి గమ్యస్థానం చేరతామో తెలియకుంది. రద్దీ సమయాల్లో అయితే మరింత చికాకు పెడుతున్నాయి. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు తగినట్లు దారులు విస్తరించకపోవడం ఒక ఎత్తు అయితే.. కాస్త దృష్టి పెడితే పరిష్కారం అయ్యే వాటినీ వదిలేయడమే ఇందుకు కారణం. ఆయా బీట్లలో విధుల్లో ఉండే ట్రాఫిక్‌ సిబ్బంది నిర్లక్ష్యం తోడవడంతో కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ విషయంలో ఇదే జరుగుతోంది. అసలే పద్మవ్యూహాన్ని తలపించే బెజవాడ ట్రాఫిక్‌.. నియంత్రణ విషయంలో నిర్లక్ష్య వైఖరితో రద్దీ లేని వేళల్లోనూ వాహనాలు బారులు తీరుతున్నాయి. చొరవ చూపితే పరిష్కారమయ్యేవి కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. 


కాస్త దృష్టి సారిస్తే చాలు

బెజవాడలో దాదాపు 180 వరకు విధులు నిర్వహించాల్సిన ట్రాఫిక్‌ బీట్లు ఉన్నాయి. ఉన్న సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమైనచోట్ల మాత్రమే విధులు కేటాయిస్తున్నారు. దీంతో చాలాచోట్ల సిబ్బందిని వేయలేని పరిస్థితి. కూడళ్లు కాకపోయినా ప్రధాన మార్గాల్లో పలు చోట్ల రద్దీ నెలకొంది. ఈ ప్రాంతాల్లో వాహనాలు ఆగిపోతుండటంతో.. ఆ ప్రభావం వాటిని ఆనుకుని ఉన్న అంతర్గత రోడ్లపై పడుతోంది. ఇక రద్దీ సమయాల్లో అయితే నరకం కనిపిస్తోంది. కీలకమైన బందరు రోడ్డుపై ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ముందు రోడ్డు అంతా ఖాళీగా ఉన్నా.. ఆ ప్రాంతంలో వాహనాలు ఆగడంతో వెనుక బారులు తీరుతున్నాయి. వీటిని వెంటనే సరిచేయకపోవడంతో చాలాసేపు ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. 


ఎక్కడం.. దిగడం వారిష్టమే

నగర శివారు పెనమలూరు ఠాణా పరిధిలోకి వచ్చే కామయ్యతోపు సెంటర్‌ వద్ద ఎక్కువ సందర్భాలలో రోడ్డు ఖాళీగా ఉన్నా.. ఆంజనేయ స్వామి గుడి వద్ద వాహనాలు ఆగిపోతున్నాయి. కానూరు నుంచి బందరు రోడ్డులోకి వచ్చి బెంజి సర్కిల్‌ వైపు వెళ్లాల్సినవి, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, అవనిగడ్డ, నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులను ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు అక్కడ ఆపుతున్నారు. దీని వల్ల వెనుక వాహనాలు ఎక్కువ దూరం ఆగిపోతున్నాయి. రద్దీ వేళల్లో సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజి వరకు ఆగిపోతున్నాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బంది నియంత్రణ విషయంలో చొరవ చూపడం లేదు.


బాబోయ్‌.. ఆటోనగర్‌ కూడలి

బందరు రోడ్డులో రద్దీగా ఉండే ఆటోనగర్‌ కూడలి వాహనదారులను హడలెత్తిస్తోంది. ఇది దాటాలంటే సాధారణ సమయాల్లోనూ చాలా సమయం పడుతోంది. రద్దీ వేళల్లో సహనానికి పరీక్ష పెడుతోంది. బందరు వైపు వెళ్లాల్సిన వారు.. ఇక్కడ ఫ్రీలెఫ్ట్‌ తీసుకుని పంటకాలవ రోడ్డులోకి పోదామంటే మలుపు వద్ద ఆటోలు బారులు తీరి ఉంటాయి. అక్కడే ట్రాఫిక్‌ సిబ్బంది విధుల్లో ఉన్నా.. ఆటోలను నియంత్రించడంలో విఫలం అవుతున్నారు. దీనివల్ల ఆటోనగర్‌గేట్‌ నుంచి వెళ్లాలంటే చాలా ప్రయాసపడాల్సిందే. 


మలుపులో ముచ్చెమటలే..

విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిలో డొంక రోడ్డు ప్రాంతం అసలే ఇరుకుగా ఉంటుంది. దీనికి తోడు డివైడర్‌ కటింగ్‌ ఇవ్వడంతో ఒకవైపు నుంచి మరో వైపునకు ఇక్కడ వాహనదారులు దాటుతున్నారు. పెద్ద వాహనాలు మలుపు తిరగడం కూడా కష్టంగా ఉండటంతో దారికి రెండు వైపులా పెద్దసంఖ్యలో వాహనాలు ఆగిపోతున్నాయి. ఇక్కడ రోడ్డు విస్తరించాక యూ టర్నింగ్‌ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. పటమటలో సోనోవిజన్‌ ఎదురు కూడా ఇలా మలుపు తిరిగేందుకు డివైడర్‌ను కొంత తొలగించారు. రోడ్డు ఇరుకుగా ఉండి ఎక్కువ సమయం ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. 


ఫ్రీ లెఫ్ట్‌ దారిలో అడ్డగోలు

అత్యంత రద్దీ కూడలి.. బెంజి సర్కిల్‌. ఈ కూడలి మీదుగా నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పటమట నుంచి బస్టాండు, గుంటూరు వైపు వెళ్లేందుకు బెంజి సర్కిల్‌ వద్ద ఫ్రీ లెఫ్ట్‌ మార్గం ఉంది. పీసీఆర్‌ కూడలి వైపు వెళ్లే వాహనదారులు ఈ మార్గంలోకి వచ్చేస్తున్నారు. దీని వల్ల వీటి వెనక గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, అవనిగడ్డ, తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఆగిపోతున్నాయి. బస్టాండుకు వెళ్లాల్సిన ఇవి ఆగిపోవడంతో.. ఎన్టీఆర్‌ సర్కిల్‌ దాటి వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అక్కడ విధుల్లో ఉండే సిబ్బంది క్లియర్‌ చేస్తే చాలు. 


విస్తరణ జాప్యం.. జనాలకు శాపం

బందరు రోడ్డులోకి మచిలీపట్నం వైపు నుంచి నగరంలోకి నిత్యం 7,500 వాహనాలు ప్రవేశిస్తుంటాయి. బెంజి సర్కిల్‌ నుంచి కానూరు వరకు రోడ్డు ఇరుకుగా ఉంటుంది. జాతీయ రహదారి అయినా విస్తరణకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని 120 అడుగులకు విస్తరించాలి. వీఎంసీ పరిధిలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ వరకు విస్తరణ పనులు ఎంతకూ పూర్తికావడం లేదు. 2017 నుంచి ఇంతే. రెండేళ్ల కిందట నగరపాలక సిబ్బంది కొంత మేర రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు తొలగించారు. పలుచోట్ల న్యాయస్థానాల్లో కేసులు ఉండడంతో ప్రక్రియ ఆగింది. కోర్టు వ్యాజ్యాలు పరిష్కారం అయ్యేలా చూడడంలో అధికారులు చొరవ చూపడం లేదు. ఇదీ ట్రాఫిక్‌ సమస్యలకు కారణమే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు