logo

సాగేదెట్టా.. వేగేదెట్టా?

ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు తక్కువగా ఉంది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్‌ పరిధిలో మెట్టప్రాంతం ఎక్కువ కాగా.. సాగర్‌ ఎడమ కాలువ కింద ఆయకట్టు ఉంది. దానికి డిసెంబరులో నీరిస్తారు.

Updated : 21 May 2024 06:11 IST

కాలువలు చూస్తే రైతు కంటసుడులే
మరమ్మతుల ప్రతిపాదనలకు ‘కోడ్‌’ అడ్డంట
ఈ ఏడాది కాడ్‌ నిధులు లేనట్లే..?
నిర్వహణ లేదు.. వరదొస్తే పంటలకు ముప్పే
ఈనాడు, అమరావతి

గత ఏడాది

ఖరీఫ్‌ ఆరంభానికి ముందే.. జులైలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో వరిపైరు ముంపునకు గురైంది. ఖరీఫ్‌ ప్రారంభంలోనే వెదజల్లిన పొలాలను ఇలా వరద నీరు ముంచెత్తడం.. నాలుగైదు రోజలు పైరు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరికి ఎలాంటి పరిహారం అందలేదు. సరికదా.. విత్తనాలు రాయితీపై ఇవ్వలేదు. మరోసారి నారు పోసి నాట్లు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.


ఈ ఏడాది

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. కానీ ఇంత వరకు సాగునీటి కాలువల మరమ్మతుల ఊసే మరిచారు. నిధుల లేమితో నీటిపారుదల శాఖ మౌనంగా ఉంది. ఖజానా మొత్తం ఊడ్చేశారు. ఆయకట్టు అభివృద్ధి శాఖ (సీఏడీ) వద్ద నిధుల కొరత ఏర్పడింది. మరోవైపు ఎన్నికల కోడ్‌ పేరుతో ప్రతిపాదనల్లోనూ జాప్యమైంది. ఏటా ప్రతిపాదనలు ఘనంగా నిర్వహించడం.. అత్తెసరు నిధులు ఇవ్వడం.. నామమాత్ర పనులు చేయడం ఇదీ వరస. మంజూరైన వాటిలోనూ గుత్తేదారుల మేత సరేసరి. నేతల సిఫార్సులతో పనులు చేయకుండా మమ అనిపించడం పరిపాటిగా మారింది.


వాన నీరు చేరిన పొలాన్ని చూపిస్తున్న గుడివాడ మండలం పర్నాస రైతు నాంచారయ్య (పాత చిత్రం)

న్టీఆర్‌ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు తక్కువగా ఉంది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్‌ పరిధిలో మెట్టప్రాంతం ఎక్కువ కాగా.. సాగర్‌ ఎడమ కాలువ కింద ఆయకట్టు ఉంది. దానికి డిసెంబరులో నీరిస్తారు. ఈ ఏడాది ఆ నీరు రాలేదు. అక్కడి కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. డెల్టా కింద నీటి శిస్తు రెవెన్యూ శాఖ వసూలు చేయగా... కలెక్టర్‌ ఖాతాలకు చేరతాయి. ఆ నిధులను సీఏడీ(కాడ్‌)కి పంపిస్తారు. ఈ నిధుల లభ్యత మేరకు నిర్వహణ పనులకు నిధులు మంజూరు చేస్తారు. వీటికి జూన్‌లోనే టెండర్లను పిలిచి ఖరారు చేయాలి. ఏటా మేలో ఏఈ స్థాయి అధికారుల నుంచి ప్రతి సబ్‌డివిజన్‌ నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తారు. వాటిలో నిధుల వెసులుబాటు మేరకు అత్యవసర మరమ్మతుల పనులను కాడ్‌ మంజూరు చేస్తుంది. వీటికి కలెక్టర్లు పాలన అనుమతి ఇస్తారు. సాంకేతిక అంశాలతో జలవనరుల శాఖ టెండర్లు పిలవాలి.

కంకిపాడు: డ్రెయిన్‌ను తలపిస్తున్న 600  ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువు కాల్వ

ఎంత ఇస్తారనేదీ సందేహమే

ఈ ఏడాది పనులు చేసేందుకు కాడ్‌ వద్ద నిధులు లేవని తెలిసింది. నిర్వహణ పనులకు ఎంత ఇస్తారనేది సందేహమే. ఆఖరులో మంజూరు చేసినా వెనకేసుకునేందుకే వినియోగిస్తారు. ఖరీఫ్‌ ప్రారంభమై కాలువలకు నీరు విడుదల చేశాక పనులు చేపట్టినా నిధులు మింగడానికే తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ అమలు.. కొందరు ఇంజినీర్లు ఎన్నికల విధుల్లో ఉండటంతో ప్రతిపాదనలు పూర్తిగా అందలేదు. ఇప్పటికి 2024-25 నిర్వహణ పనుల కోసం జలవనరుల సర్కిల్‌ పరిధిలో 256 పనులకు రూ.54 కోట్లతో ప్రతిపాదించారని తెలిసింది. వీటిని ఎస్‌ఈ ఆమోదించి సీఈ కార్యాలయానికి ప్రతిపాదించగా అక్కడ దస్త్రం నిలిచిపోయింది. అక్కడి నుంచి కాడ్‌ విభాగానికి చేరాక.. ఈఎన్‌సీ ఆమోదించాలి. నిరుడు జూన్‌లోనే కాలువలకు నీరిచ్చారు. ఈసారి రుతుపవనాలు ముందే కరుణించే వీలుందని అంచనా. టెండర్లు పిలిచేందుకే 20 రోజులు అవసరం. ఈ ఏడాది నీటిశిస్తు కాడ్‌కు అందలేదు. నిరుడు నిధులు లేకున్నా టెండర్లను పిలిచారు. ఈ ఏడాది నిధులు లేకుంటే పిలిచే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.


అధ్వానంగా డ్రాప్‌లు

గూడూరు: ఆకుమర్రులాకుల వద్ద తుప్పుపట్టిన డ్రాప్‌లు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే:  బందరు కాలువ పరిధిలో వివిధ సెక్షన్లు ఉన్నాయి. వాటి ఉన్న కాలువల ద్వారా పలు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుంది. కాలువ వెంబడి పలుచోట్ల గట్లు ఆక్రమణల వల్ల కుంచించుకుపోయాయి. దీనివల్ల గట్లకు గండ్లుపడే అవకాశం ఉందని  ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. గుడ్లవల్లేరు లాకుల వద్ద నుంచి పలు అనుబంధ కాలువల ద్వారా ఆయా మండలాలకు నీరు సరఫరా అవుతుంది. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని ఆయకట్టుకు నీరు అందించే బంటుమిల్లి కాలువ కూడా ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. కానీ ఈ లాకుల వద్ద గేట్లు, డ్రాప్‌లు  చాలా చోట్ల తుప్పుపట్టి పాడైపోయాయి. గతంలో డెల్టా ఆధునికీకరణలో కొన్ని మరమ్మతులు చేసినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. గూడూరు మండలం ఆకుమర్రు లాకులు, పెడన మండలం కమలాపురం లాకులు వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. 

మొవ్వ  మండలం చినముత్తేవి గేదలకోడు వద్ద  శిథిలమైన  రెగ్యులేటర్‌


గతమూ నిరాశా జనకమే...

  • 2022-23లో ఎన్టీఆర్‌ జిల్లాకు రూ.460.83 లక్షలతో 41 పనులు ప్రతిపాదించగా 11 పనులే మంజూరు చేశారు. వీటి విలువ రూ.189.75 లక్షలు. కృష్ణా జిల్లాలో రూ.38.86 కోట్లతో 194 పనులు ప్రతిపాదించగా కాడ్‌ నుంచి రూ.21.87 కోట్ల విలువైన 118 పనులే ఆమోదించారు. 2023-24లో రూ.60 కోట్లతో ప్రతిపాదిస్తే.. రూ.28.16 కోట్లకు 152 పనులు మంజూరు చేశారు. వీటిలో ఎక్కువగా డ్రెయినేజీ విభాగం పనులే.
  • అంతకు ముందు బందరు కాలువ పూడికతీతకు నీటి తీరువా (శిస్తు) నిధులు రూ.7కోట్లు మంజూరు చేశారు. కొన్ని పనులను ప్యాకేజీలుగా చేర్చి టెండర్లను పిలిచి గుత్తేదారులు పనులు చేయకుండానే బిల్లులు చేయించారనే ఫిర్యాదులు ఉన్నాయి. గత రెండేళ్లుగా బిల్లులు రాలేదని చిన్న గుత్తేదారులు చెబుతున్నారు. బడా గుత్తేదారులకు మాత్రం ఎల్‌వోసీ (లెటర్‌ఆఫ్‌ క్రెడిట్‌) ఎన్నికల ముందే జారీ చేశారు. బీ ఈఏడాది కాలువల మరమ్మతులు చేపట్టకపోతే.. వరదలు, తుపానుతో భారీ ముప్పు పొంచి ఉందని రైతులు వాపోతున్నారు.

తూడుతో నిండిపోయాయి
- బాసంశెట్టి శ్రీనివాసరావు,  మల్లవోలు, గూడూరు మండలం

మల్లవోలు పంచాయతీ పరిధిలో 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మల్లవోలు, కొత్తిమేరకోడు, దిరిసిన కాలువ.. ఇలా అన్నీ తూడుతో నిండిపోయాయి. ఇప్పటి వరకు కనీసం రసాయనాలు అయినా పిచికారీ చేయమని అడిగినా పట్టించుకున్న నాథుడే లేడు. దిగువకు నీళ్లు అందక  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కూడా ఇదే సమస్యపై మొరపెట్టుకున్నా స్పందించలేదు.  ఈఏడాదైనా పనులు చేస్తారో లేదో తెలియడం లేదు. పట్టించుకోకపోతే మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోతారు.


పూడిక తీయకే పొలాల మునక 
- పంచకర్ల బ్రహ్మయ్య,  పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షడు, వలివర్తిపాడు 

నీటి పారుదల శాఖ అధికారులు సకాలంలో పూడిక తీయకపోవడం వల్లే పంట పొలాలు భారీ వర్షాలకు ముంపు బారిన పడుతున్నాయి. వలివర్తిపాడు రైతులు ఏటా చందాలు వేసుకొని పూడిక తీసుకుంటున్నారు. పెదకాల్వ నుంచి వలివర్తిపాడుకు వచ్చే పంట కాల్వను బంటుమిల్లి రోడ్డు పెట్రోలు బంకు సమీపంలో ఆక్రమించి బడ్డీ కొట్లు ఏర్పాటు చేశారు. పూడిక తీయక, మరోవైపు ఆక్రమణలకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని