logo

12వ సారి సహకార బ్యాంకు పదవి పొడిగింపునకు యత్నం

గుడివాడలోని ఓ సహకార బ్యాంకుకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా 11 సార్లు పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Published : 22 May 2024 03:12 IST

ఉద్యోగులు రూ.లక్షలు కాజేసినా కేసులు లేవు!

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడలోని ఓ సహకార బ్యాంకుకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా 11 సార్లు పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే కమిటీ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించడానికి ఎన్నికల కోడ్‌ అడ్డు రావడంతో ఈ సారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పట్టణంలోని ఈ బ్యాంకులో ఓ ఉద్యోగి అక్రమంగా సుమారు రూ.50 లక్షలు స్వాహా చేసిన ఘటనపై జిల్లా సహకార అధికారులు విచారించి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా నేటికీ అవినీతి సిబ్బందిపై కేసులు నమోదు చేయలేదని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు యాజమాన్యం తప్పును సరిదిద్దేందుకు అక్రమాలకు పాల్పడిన ఉద్యోగి నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. మిగిలిన సొమ్ముని బ్యాంకు రిజర్వు నిధుల నుంచి చెల్లించారు. బ్యాంకు రిజర్వు నిధులు చెల్లించాలంటే మహాజన సభ, సహకార శాఖతోపాటు హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వారి ఆమోదం కావాలి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బ్యాంకు బోర్డు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి ఫిక్సిడ్‌ డిపాజిట్లు బొక్కేసిన సంగతి 8 ఫిబ్రవరి, 2024 జరిగినా మహాజన సభలో సభ్యులకు తెలియపర్చలేదని.. సభ ఎజెండాలోని ఏడు అంశాల్లో ఈ అక్రమాల ఊసే లేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. ్ర సహకార బ్యాంకులోని సొమ్మును ఎక్కడ డిపాజిట్‌గా పెడితే భద్రంగా ఉంటుందని బ్యాంకు ఖాతాదారులు కొందరు ప్రశ్నిస్తున్నారు. వడ్డీ వస్తుందనే సాకుతో బ్యాంకులోని నగదును ఏలూరు డీసీసీబీలో రూ.7.5 కోట్లు, ఆప్కాబ్‌ గొల్లపూడిలో రూ.3.5 కోట్లు, ఆప్కాబ్‌ చల్లపల్లిలో రూ.1.0 కోట్లు, కేడీసీసీబీలో రూ.4.11 కోట్లు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, గుడివాడలో రూ.5 కోట్లు, గుడ్లవల్లేరు కేడీసీసీబీలో రూ.2.01 కోట్లు డిపాజిట్‌ చేశారని.. జాతీయ బ్యాంకులో ఎందుకు జమ చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. భద్రత పట్ల బ్యాంకు పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. వారి పదవులను పొడిగించుకోవడానికి 12వ సారి ప్రయత్నాలు సాగిస్తూ కోర్టుకు వెళ్లడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు