logo

సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్ల్లు

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వి.శ్రీనివాసరావు సంబంధిత అధికారులకు సూచించారు.

Published : 22 May 2024 03:22 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వి.శ్రీనివాసరావు సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై నగరంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు, పది సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి జూన్‌ మూడు వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు.

54 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లింమెటరీ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 28,668 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 6,545 మంది హాజరు కానున్నారు. వీరి కోసం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు డీఆర్వో చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సర (జూనియర్‌), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. 

పదో తరగతికి 6,702 మంది..

పదో తరగతి అడ్వాన్సుడ్‌ సప్లింమెటరీకి రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు 6,702 మంది హాజరు కానున్నట్టు డీఆర్వో వెల్లడించారు. వీరి కోసం 35 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించడంతో పాటు, పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మాస్‌ కాపీయింగ్, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి సి.ఎస్‌.ఎస్‌.ఎన్‌.రెడ్డి, డీఈవో యు.వి.సుబ్బారావు, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.వి.ఎ.న్‌.కుమార్, డీఈసీ సభ్యులు శ్రీరామమూర్తి, వెంకట్రావు, ఆర్యపత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని