logo

కూటమిదే విజయం

ఏపీలో భాజపాతో కలవడం వల్ల తెదేపా కూటమికి కొన్ని ఓట్లు తగ్గాయని.. అయితే రాష్ట్రంలో తెదేపా-జనసేన-భాజపా కూటమి విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు పేర్కొన్నారు.

Updated : 22 May 2024 05:12 IST

కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే : ఏపీలో భాజపాతో కలవడం వల్ల తెదేపా కూటమికి కొన్ని ఓట్లు తగ్గాయని.. అయితే రాష్ట్రంలో తెదేపా-జనసేన-భాజపా కూటమి విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌లో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పల్లంరాజు మాట్లాడారు. రాజీవ్‌గాంధీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లారని చెప్పారు. సాఫ్ట్‌వేర్, ఐటీ, టెలికం రంగాల్లో దేశాన్ని అభివృద్థిపథంలో తీసుకువెళ్లిన ఘనత ఆయనదేనని కొనియాడారు. 18 ఏళ్లకే ఓటు హక్కు, పంచాయతీరాజ్‌లో మూడో వంతు మహిళలకు కేటాయించి అందరి మన్ననలు పొందారని ప్రశంసించారు.  మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల గతంలో కన్నా ఆదరణ పెరిగిందన్నారు.  పది సీట్లలో గట్టి పోటీ ఇస్తున్నామని వివరించారు. రాహుల్‌గాంధీ పర్యటన కేవలం కడపకే పరిమితం కావడంపై జవాబిస్తూ.. ఇండియా కూటమి నాయకుడిగా దేశం మొత్తం తిరగాల్సి ఉందని.. అందుకే కడపలో మాత్రమే పర్యటించారని తెలిపారు. 2024లో కేవలం 317 స్థానాలకే కాంగ్రెస్‌ ఎందుకు పరిమితమైందని ప్రశ్నించగా.. కూటమి ఒప్పందంలో భాగంగా అలా జరిగిందని, పోటీ చేసేందుకు నిధుల కొరత కూడా ఒక కారణమన్నారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో 50 సీట్లు కూడా రావన్న మోదీ వ్యాఖ్యలను పల్లంరాజు ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, వి.గురునాథం, కొలనుకొండ శివాజీ, పి.వై.కిరణ్, ఏసుదాసు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు