logo

పాడి రైతు అభ్యున్నతే లక్ష్యం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్థాపించిన విజయ డెయిరీ.. పాల సేకరణలో అగ్రగామిగా నిలుస్తూ, పాడి రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది.

Published : 22 May 2024 03:25 IST

విజయ డెయిరీ ఛైర్మన్‌ చలసాని

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్థాపించిన విజయ డెయిరీ.. పాల సేకరణలో అగ్రగామిగా నిలుస్తూ, పాడి రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ప్రతికూల పరిస్థితోల్లోనూ పశుపోషకులకు అత్యధిక ధర చెల్లించడంతో పాటు, అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో అనతికాలంలోనే నూతన యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చలసాని ఆంజనేయులు ఈ సంస్థ ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టి నేటితో అయిదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వివరాలు వెల్లడించారు. 

మరింత నమ్మకం కల్పించాం : కొవిడ్‌ మహమ్మారి రావడంతో డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయినా కూడా తట్టుకుని రైతులకు అత్యధిక ధర, బోనస్‌ చెల్లించాం. రాష్ట్ర ప్రభుత్వం పోటీగా అమూల్‌ సంస్థను తెరపైకి తీసుకువచ్చినా.. విజయ డెయిరీపై రైతులకు మరింత నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్నాం. పాల సేకరణలో గణనీయమైన వృద్ధి సాధించాం.

అత్యధిక ధర చెల్లింపు : ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకున్నా సహకార వ్యవస్థలోనే రైతులకు అత్యధిక ధర చెల్లిస్తున్నాం. లీటరుకు గరిష్ఠంగా రూ.80 ధర, మూడు విడతలుగా బోనస్‌ చెల్లించి పశు పోషకులకు చేయూతనిచ్చాం. విజయ డెయిరీ ప్రతి రూపాయిలో 82 పైసలు రైతులకే అందిస్తుంది.

సంక్షేమానికి ప్రాధాన్యం : రైతుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ప్రమాదవశాత్తూ మరణించినవారికి క్షీరబంధు పథకం పేరుతో రూ.50 వేలు, రైతు కుటుంబాల్లో వివాహం చేసుకునే వారికి రూ.20 వేల విలువైన బంగారు నాణేలు ఇస్తున్నాం. ఇప్పటివరకు 1,600 కుటుంబాలకు క్షీరబంధు, 2,300 జంటలకు బంగారు నాణేలు అందజేశాం. రెండు వేల మందికి ఉచిత వైద్య పరీక్షలు, ఆరు వేల మందికి కంటి పరీక్షలు చేయించాం.

నూతన యూనిట్‌ ఓ మైలురాయి  : ఉత్పత్తి ఖర్చును తగ్గించుకుని, మరింత నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడానికి వీలుగా బాపులపాడు మండలం వీరవల్లిలో ‘ప్రాజెక్ట్‌ కామధేను’ పేరుతో అధునాతన యూనిట్‌ని నిర్మించగలిగాం. రోజుకు ఆరు లక్షల లీటర్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేశాం. దేశ చరిత్రలోనే పూర్తి ఆటోమేషన్‌ యూనిట్‌గా నిలిచింది. సంస్థకు రూ.200 కోట్ల విలువైన ఆస్తిని సమకూర్చగలిగాం.

రూ.2,500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం : అయిదేళ్ల కిందట సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.719 కోట్లుగా ఉంది. దీనిని రూ.1,196 కోట్లకు చేర్చగలిగాం. పాలకవర్గ సభ్యులు, ఉద్యోగుల సమన్వయంతో ఇది సాధ్యమైంది. రానున్న అయిదేళ్లలో రూ.2,500 కోట్లకు చేర్చాలన్న లక్ష్యంగా పెట్టుకున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని