logo

గౌరవ భృతి ఏదీ?

జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో నిరంతరం సేవలు అందించిన బీఎల్వో(బూత్‌స్థాయి అధికారి)లు గౌరవ భృతి కోసం ఎదురు చూస్తున్నారు.

Published : 22 May 2024 03:27 IST

బీఎల్వోల ఎదురుచూపులు
జిల్లా వ్యాప్తంగా రూ.3.21 కోట్ల బకాయిలు
ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో నిరంతరం సేవలు అందించిన బీఎల్వో(బూత్‌స్థాయి అధికారి)లు గౌరవ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో 295 మందితోపాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో 1781 మంది బీఎల్వోలుగా విధులు నిర్వహించారు. వీరందరూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే. వీరికి గౌరవ భృతి కింద రూ.3.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. గతంలో అంగన్‌వాడీ, ఆశా, పురపాలిక ఉద్యోగులు సిబ్బంది ఈ విధులు నిర్వహించారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత ఎంపిక చేసిన సచివాలయ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు.  

విధులు ఇవే: గత 33 నెలలుగా వీరు ఇంటింటి ఓటరు సర్వే, ఆ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితా, సవరణ, ప్రత్యేక శిబిరాలు, అవగాహన ప్రదర్శన, సదస్సుల నిర్వహణ, పోలింగు కేంద్రాలలో వసతుల కల్పన, గుర్తింపు పత్రాలు పంపిణీతోపాటు గ్రామాంతరం వెళ్లిన ఓటర్ల గుర్తింపు, మృతులు, కొత్త ఓటర్ల చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం పోలింగు ప్రక్రియలో కీలక పాత్ర వహించారు. వీరికి గౌరవ భృతి చెల్లించాలన్న ఈసీ ఆదేశాలు నేటి వరకు అమలుకు నోచుకోలేదు.

బడ్జెట్‌ విడుదలైతేనే.. : ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ప్రతి బీఎల్వోకు గౌరవ భృతిగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6000 చెల్లించాల్సి ఉంది. గత 33 నెలలుగా విధులు నిర్వహిస్తున్న వీరికి ఇటీవల మూడు నెలకు సంబంధించిన గౌరవ భృతిని రాష్ట్రప్రభుత్వం చెల్లించింది. ఇంకా 30 నెలకు సంబంధించి రూ.3.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. విషయాన్ని సచివాల ఉద్యోగల సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బడ్జెట్‌ రాగానే అందజేస్తామని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదలైన బడ్జెట్‌ నిధుల నుంచి ప్రభుత్వ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు, అధికారులకు ఇప్పటికే నిబంధనల మేర చెల్లింపులు చేశారు. తమకు మాత్రం ప్రభుత్వం రిక్తహస్తమే చూపుతుందని ఆరోపిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని