logo

పకడ్బందీగా నిర్వహించేనా..?

జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Published : 22 May 2024 03:38 IST

27 కేంద్రాల్లో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు
డిపార్ట్‌మెంటల్‌ అధికారులు లేకపోవడంపై విమర్శలు
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేయడంతోపాటు విధులు కేటాయించిన సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఈసారి డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించకుండా చీఫ్‌ సూపరింటెండెంట్, అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లతో పరీక్షలు నిర్వహించడం వల్ల పర్యవేక్షణ లోపించే అవకాశం ఉందన్న విమర్శలు అధ్యాపకవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 

మచిలీపట్నంతో పాటు పెడన, అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, గుడివాడ ఇలా వివిధ ప్రాంతాల్లోని కళాశాలల్లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 8,968, ద్వితీయ సంవత్సరం 1,373 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూనియర్‌ ఇంటర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పర్యవేక్షణ.. ఆందోళన

గతంలో ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌తోపాటు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉండేవారు. ప్రస్తుతం డిపార్ట్‌మెంటల్‌ అధికార్లు లేకుండా మిగిలిన ఇద్దరిని మాత్రమే నియమించారు. దీనివల్ల పరీక్షల నిర్వహణపై పర్యవేక్షణ లోపించే అవకాశం ఉంటుందని పలువురు వాపోతున్నారు. ప్రయివేటు కళాశాలలకు బయట వ్యక్తులను నియమించినా, ప్రభుత్వం కళాశాలల్లో ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాల్లో అదే కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అలాంటి కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్, సహాయ సూపరింటెండెంట్‌ ఇద్దరూ అదే కళాశాలకు చెందిన వారు కావడంతో కాపీయింగ్‌ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పెడన కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఒక వ్యక్తి బదులు మరో వ్యక్తి పరీక్ష రాస్తూ పట్టుబడిన సంఘటనలు కూడా కొందరు గుర్తుచేసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 


జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు  

- రవికుమార్, ఆర్‌ఐవో

పరీక్షలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. కళాశాలల్లో అధ్యాపకులకు విధులు ఉండడంతో డిపార్ట్‌మెంటల్‌ అధికారులను ఈసారి నియమించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు రాయడంవల్ల ఏ కళాశాల విద్యార్థులు ఆ కళాశాలలో రాసే అవకాశం లేదు. జిల్లాలో పెడన, మొవ్వ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మాత్రమే ఆ కళాశాల విద్యార్థులు వేరే కేంద్రం అందుబాటులో లేక అక్కడే పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక స్క్వాడ్‌ను కూడా నియమించడం జరిగింది. ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని