logo

నిధులు మళ్లాయి.. కన్నీళ్లు మిగిలాయి..!

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో బృహత్తర తాగునీటి ప్రాజెక్టు అటకెక్కనుంది. మంజూరైన నిధులను దారి మళ్లించడంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదు.

Published : 22 May 2024 03:46 IST

సర్కారును నమ్మలేక పనులు నిలిపివేత
ప్రాథమిక స్థాయిలోనే ఆగిన ప్రాజెక్టు
రూ.8 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌
ఐదు పాలికల్లో అటకెక్కిన ఏఐఐబీ ప్రాజెక్టు
ఈనాడు, అమరావతి

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో బృహత్తర తాగునీటి ప్రాజెక్టు అటకెక్కనుంది. మంజూరైన నిధులను దారి మళ్లించడంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదు. జిల్లాలో చాలా పట్టణాల పరిధిలో కృష్ణా నది ప్రవహిస్తున్నా తాగునీటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బోర్లపైనే ఆధారపడి పథకాలు నడుస్తుండడంతో వేసవి వస్తే చాలు ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. ఇప్పుడున్న జనాభాకు తగ్గట్లుగా రక్షిత నీరు చాలడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఐదు పురపాలికల్లో తాగునీటి సమస్యలు తీర్చేందుకు రూ.484.1 కోట్లతో తెదేపా ప్రభుత్వం ప్రాజెక్టును రూపొందించింది. దీనికి ఏఐఐబీ (ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు) సాయం చేసేందుకు ముందుకొచ్చింది. దీనిని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా పనులు ఆలస్యంగా ప్రారంభం కావడం.. బిల్లులు రాకపోవడం.. పనులు కూడా అరకొరగానే జరిగి ఆగిపోయాయి.

ఇదీ ప్రాజెక్టు స్వరూపం..

ఉయ్యూరు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, పెడన పాలికల్లో ఎప్పుడో నిర్మించిన తాగునీటి పథకాలే నేటికీ దిక్కు. ఈ నీరు పట్టణవాసులకు చాలడం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా నీటిని తీసుకుని కొత్తగా తాగునీటి పథకాలను అభివృద్ధి చేశారు. ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా రక్షిత, శుద్ధి చేసిన నీటిని అందించనున్నారు. 2048 నాటి అవసరాలు, జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు రూపొందించారు. ఇందుకు అయ్యే వ్యయం రూ.484.1 కోట్లలో ఏఐఐబీ 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం సాయం చేయనున్నాయి. నీటి వనరు నుంచి తాగునీటి ట్యాంకు వరకు పనులు మొదటి ప్యాకేజీగా, అక్కడి నుంచి ఇంటింటికీ కొళాయిలు వేసి రక్షిత నీటిని అందించే పనులను రెండో ప్యాకేజీలో చేపట్టాలి.

ఐదేళ్లుగా అడ్డంకులు...

ఈ ప్రాజెక్టు తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైంది. రెండు ప్యాకేజీలకు గాను తొలుత.. రెండో ప్యాకేజీ టెండర్లను తెరిచి, గుత్తేదారును ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీ పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకుంది. మొదటి ప్యాకేజీ టెండర్లు తెరవడం ఆలస్యమైంది. ఈలోపు ఎన్నికలు జరిగి, ప్రభుత్వం మారిపోయింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైకాపా ప్రభుత్వం అప్పట్లో టెండర్లను ఆపేసింది. ఇటీవల ఈ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. మొదటి ప్యాకేజీకి టెండర్లు తెరవలేదు. వీటిని రద్దు చేసి, మళ్లీ పిలిచింది. దీంతో చాలా సమయం వృథా అయింది. 


ఎస్క్రో ఖాతా ఊసే లేదు..

ప్రాజెక్టుకు ఏఐఐబీ సాయం చేస్తోంది. పనులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన అపిట్కో పర్యవేక్షిస్తోంది. ఏఐఐబీ నుంచి వచ్చే నిధులను నేరుగా అపిట్కో వద్ద తెరిచే ఎస్క్రో ఖాతాలో వేయాలని కోరుతోంది. గుత్తేదారులు కూడా ఇదే కోరుతున్నారు. విడుదలయ్యే నిధులు నేరుగా ప్రభుత్వానికి వెళ్తే గుత్తేదారులకు సకాలంలో చెల్లించడం కష్టమని భావిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల విషయంలో ఇదే జరుగుతోంది. బిల్లులు రావడం లేదు. ప్రత్యేక ఖాతా విషయంలో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. బ్యాంకు మంజూరు చేసే నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసింది. జిల్లాలో ఐదు పాలికల్లో చేసిన పనుల తాలూకూ బిల్లులను గుత్తేదారులు ప్రభుత్వానికి సమర్పించినా ఇప్పటి వరకు చెల్లించలేదు. దాదాపు రూ.8 కోట్ల మేర పాక్షిక బిల్లులు రావాలి. ప్రభుత్వంపై నమ్మకం లేక, బిల్లులు రావన్న ఉద్దేశంతో ఏజెన్సీలు పనులు ఆపేశారు.


దాహం కేకలు...

ఉయ్యూరు: ప్రస్తుతం భూగర్భ జలాలే దిక్కు. కొత్త పథకంలో దాదాపు 10 కి.మీ దూరంలోని తోట్లవల్లూరులో కృష్ణా నది నుంచి నీటిని పట్టణానికి తేవాలి. అక్కడే పంపింగ్‌ హౌస్‌ నిర్మించి.. శుద్ధి చేసి నీటిని తేవాలనేది ప్రణాళిక. పట్టణంలో ప్రస్తుతం 9 ట్యాంకులు ఉన్నాయి. అదనంగా మరో మూడు నిర్మించాలి. ఇంత వరకు పనులే ప్రారంభం కాలేదు.


పెడన : పట్టణానికి తర్కటూరులోని మచిలీపట్నం నగరపాలిక ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీరు తరలించాలి. ఎస్‌ఎస్‌ ట్యాంకుకు బందరు కాలువ నుంచి నీటిని తీసుకుంటారు. ఏడాది కిందట గుత్తేదారు పనులు ప్రారంభించి ఆపారు. పట్టణ శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుత తాగునీటి పథకం ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. 


నందిగామ : నగర పంచాయతీ జనాభా 50 వేలు. తాగునీటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. పట్టణంలో చాలా చోట్ల రెండు, మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో ఆయా ప్రాంతాలకు ట్యాంకర్లతో తాగునీరు ఇస్తున్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి తెదేపా హయాంలో ఏఐఐబీ ప్రాజెక్టు మంజూరైంది. 8వ వార్డులో 2 కి.మీ మేర పైపులైన్లు వేశారు. చేసిన పనులకు బిల్లు ఇవ్వకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని