logo

దయచేసి వినండి మీ రైలు రద్దయింది!

‘‘విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు (ట్రాఫిక్‌ బ్లాక్‌) పేరుతో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Updated : 22 May 2024 08:44 IST

ఏడాదిగా సాగుతున్న నిర్వహణ పనులు
సర్వీసుల తాత్కాలిక నిలిపివేతతో తంటాలు

ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
న్యూస్‌టుడే, విజయవాడ 

‘‘విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు (ట్రాఫిక్‌ బ్లాక్‌) పేరుతో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యాధునిక వ్యవస్థ కలిగిన రైల్వే శాఖ ఏడాదిగా నిర్వహణ పనులు చేపట్టడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. గత కొంతకాలంగా పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది.’’

రద్దీ వేళ ఇలాగేనా చేసేది?

విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రతి రోజూ విజయవాడ నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు... ఏలూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం వరకు వెళుతుంటారు. ఈ రైలును గత కొంత కాలంగా నిర్వహణ పనుల పేరుతో రద్దు చేస్తున్నారు. ఇది ద్వారకాతిరుమల చిన వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు  సౌకర్యంగా ఉండేది.

  • గుంటూరు, రాయగడ మధ్య నడిచే రైలును కూడా ఇలాగే ఆపేశారు. హౌరా మార్గంలో రైళ్లు ఎప్పుడూ రద్దీగా నడుస్తాయి. రిజర్వేషన్‌ కూడా సీజన్, అన్‌ సీజన్‌తో సంబంధం లేకుండా నాలుగు నెలల ముందే బుక్‌ చేసుకుంటారు.
  • విజయవాడ, బిట్రగుంట మధ్య నడిచే బళ్లదీ ఇదే పరిస్థితి.
  • సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి లక్ష మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా వేసవి సెలవుల్లో ఇది రెట్టింపవుతుంది. ఈ సమయంలో సర్వీసులు ఆపేయడం ఎంత వరకు సబబని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 

బ్రాంచి లైన్‌లో నరకయాతన.. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం బ్రాంచి లైన్‌లోనూ ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఈ మార్గంలో విజయవాడ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా రాకపోకలు సాగించే ఈ మార్గంలో విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు పేరుతో రైళ్లను రామవరప్పాడు రైల్వేస్టేషన్‌లో ఆపేస్తున్నారు. దీంతో విజయవాడ నగర ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. రైళ్లు ఆలస్యంగా చేరుకోవడంతో ఒక్కోసారి రాత్రి 9 గంటలు దాటుతోంది. రి విజయవాడ మీదగా నడిచే దూర ప్రాంతాల రైళ్లను దారి మళ్లింపు పేరుతో వయా ఏలూరు మీద కాకుండా గుడివాడ, మచిలీపట్నం మార్గంలో మళ్లిస్తున్నారు. దీని కారణంగా ఎక్కువ సమయం తీసుకుంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


స్పందన లేదు

-మూర్తి, ఉద్యోగి, గుడివాడ 

పాక్షిక రద్దు పేరుతో పలు రైళ్లను రామవరప్పాడు స్టేషన్‌లో ఆపేస్తున్నారు. అక్కడి నుంచి నగరానికి ఆటోలో రావాలంటే రూ.100 అడుగుతున్నారు. ఏడాదిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని