logo

బైపాస్‌ పేరుతో... బరితెగింపు

‘‘కొత్తూరు తాడేపల్లిలో అర్ధరాత్రి మట్టి టిప్పర్ల భారీ రవాణాపై సమాచారం రావడంతో అధికారులు క్షేత్రానికి వెళ్లారు. లారీలను ఆపి ప్రశ్నిస్తే.. తమకు అనుమతులు ఉన్నాయనీ, విజయవాడ బైపాస్‌కు.. మేఘా ఇంజినీరింగ్‌ తరఫున రవాణా చేస్తున్నామని పత్రాలు చూపారు.

Updated : 22 May 2024 05:11 IST

మేఘా పేరిట అనుమతులు
తరలించేది ప్రైవేటు వెంచర్లకే
మంత్రి అనుచరుల మట్టి దందా
ఈనాడు, అమరావతి

‘‘కొత్తూరు తాడేపల్లిలో అర్ధరాత్రి మట్టి టిప్పర్ల భారీ రవాణాపై సమాచారం రావడంతో అధికారులు క్షేత్రానికి వెళ్లారు. లారీలను ఆపి ప్రశ్నిస్తే.. తమకు అనుమతులు ఉన్నాయనీ, విజయవాడ బైపాస్‌కు.. మేఘా ఇంజినీరింగ్‌ తరఫున రవాణా చేస్తున్నామని పత్రాలు చూపారు. అధికారులు తలూపి వెనక్కు వచ్చారు. కానీ ఆ టిప్పర్లు రామవరప్పాడు సమీపంలో ఓ ప్రైవేటు వెంచర్‌కు వెళ్లి గ్రావెల్‌ను అక్కడ పోసి వచ్చాయి. ఒక టిప్పరు విలువ రూ.10 వేలు. ఇలా దాదాపు 50 ఎకరాల్లో వెంచర్‌ను కొన్ని రోజులుగా రాత్రుళ్లు నింపేస్తున్నారు.’’

విజయవాడ బైపాస్‌ రహదారి పనులు నాలుగు ప్యాకేజీల్లో రెండు పూర్తవగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో మూడో ప్యాకేజీ మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకు దక్కగా 96 శాతం పనులు పూర్తి చేసింది. కొంత ప్రాంతంలో ట్రయల్‌ రన్‌ వేసింది. ఒకటి రెండు ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల వద్ద చిన్న పనులు మిగిలాయి. బైపాస్‌ నాలుగో ప్యాకేజీ నవయుగ-అదానీ గ్రూపు సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. గుంటూరు వైపు నిర్మాణం జరుగుతోంది. కానీ మేఘా సంస్థ పేరుతో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ మంత్రి అనుచరుడు రాత్రుళ్లు మట్టి తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. మేఘా సంస్థ పేరుతో అనుమతి పత్రాలు సృష్టించి అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి తవ్వకాలకు కళ్లెం పడినా.. మంత్రి అనుచరుడి దందా ఆగలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు సాంకేతిక పరిశీలన చేయకుండా బైపాస్‌ పేరుతో వదిలేస్తున్నారు.


కలెక్టర్‌ ఆదేశించినా అంతే...

న్నికల ముందు ఓ మంత్రి అనుచరుడు కాగిత ఇన్‌ఫ్రా పేరుతో జగనన్న కాలనీల మెరక అని తహసీల్దారు ఇచ్చిన అనుమతులతో జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లిలో కొండలను తవ్వేశారు. రాత్రుళ్లు తవ్వుతూ.. గ్రామస్థులు తిరగబడకుండా గుడ్‌విల్‌ పేరుతో మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు అదేమంత్రి సిఫార్సులతో మేఘా సంస్థను అడ్డంపెట్టుకున్నారు. కొత్తూరు తాడేపల్లిలో తవ్వకాలను తెదేపా కార్యకర్త జములయ్య ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మట్టి తవ్వకాలు ఆపేయాలని తహసీల్దారును ఆదేశించారు. ఏడాదిగా విజయవాడ గ్రామీణం, జి.కొండూరు, గన్నవరం మండలాల్లో ఇష్టానుసారం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు వైకాపా ప్రజాప్రతినిధుల అండతో చెలరేగి పోతున్నారు. వారి సిఫార్సులతో కలెక్టర్‌ నుంచి లేఖలు పొంది జగనన్న కాలనీల మెరక పేరుతో అరాచకాలు సాగించారు.


అంతటా గుల్లే...

డప జిల్లా గుత్తేదారుకు వణుకూరు లే ఔట్‌ మెరక కోసం రూ.కోట్ల ఉపాధి హామీ నిధులు చెల్లించారు. కొండలు కరిగాయి.. కానీ వణుకూరు లే ఔట్‌ మాత్రం చిన్న వర్షానికే చెరువులా మారుతోంది. ఉపాధి నిధులు రూ.వంద కోట్ల వరకు కాలనీల మెరకకు కరిగిపోయాయి. జక్కంపూడి, వేమవరం, వసంతరాయలతిప్ప, గుబ్బలగుట్ట, షాబాద్‌లో వడ్లగట్టు, దొండతిప్పల్లో 200 ఎకరాల మేర తవ్వారు. వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, పాతపాడు, అటవీ, అసైన్డ్‌ భూములు, పట్టాలు, పోలవరం కట్టలు కాకుండా ఈ తవ్వకాలు కొత్తగా జరిగాయి. పాతవాటిపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. వివిధ సర్క్యులర్లు వివిధ రూపాల్లో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 


మట్టి ఎక్కడ..?

విజయవాడ బైపాస్‌ పేరుతో అధికారికంగా తరలుతున్న మట్టి ఎక్కడ నింపుతున్నారనేది అధికారులు పరిశీలించడం లేదు. చిన్నఅవుటపల్లి నుంచి సూరంపల్లి వరకు 30 కిమీ బైపాస్‌ రహదారి మేఘా సంస్థ నిర్మిస్తోంది. సూరంపల్లి వద్ద ఎక్కువ శాతం వీటీపీఎస్‌ బూడిద నింపారు. అండర్‌పాస్, పైవంతెనలకు ఎక్కువగా బూడిదనే వాడారు. కానీ మేఘా సంస్థ పేరుతో కొత్తూరు తాడేపల్లిలో దాదాపు 50 ఎకరాల్లో అనుమతి తీసుకున్నారు. నిరుడు మేఘా పేరుతో వైకాపా నాయకులే తవ్వకాలు సాగించారు. ఇప్పుడు మట్టి నింపే పనులన్నీ పూర్తయినా అదే పేరుతో ఇంకా తవ్వేస్తున్నారు. గతంలో గనుల శాఖ అధికారులు కేసు పెట్టినా.. ఓ వైకాపా నాయకుడు మంత్రి అండతో దందా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే మట్టి తవ్వడంతో ప్రైవేటుగా నివేశన స్థలాల్లో మట్టి నింపడానికి డిమాండ్‌ పెరిగింది. గతంలో రూ.6 వేలకు ఇచ్చే టిప్పరు ఇప్పుడు రూ.10 వేలకు అమ్ముతున్నారు. కొందరు గ్రామస్థులు గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. దానిని ఎన్నికల సంఘానికి పంపారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆదివారం రెండు టిప్పర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులను మాత్రం గుర్తించలేదు. అసలు గనుల శాఖ అనుమతులకు, ఈ తవ్వకాలకు పొంతన లేదు. అధికారిక తవ్వకాలైతే.. రాత్రి రవాణాలో ఆంతర్యం ఏంటనేది అధికారులకే తెలియాలి. మరోవైపు యంత్రాలను పగలు మామిడి తోటల్లో దాచేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు