logo

ఉసురు తీసిన సరదా

కృష్ణా నదిలో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు బాలురిలో ఒకరు గల్లంతై మృత్యువాత పడిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Published : 24 May 2024 03:57 IST

మద్దూరు: నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన బాలుడు కార్తీక్‌

మద్దూరు (కంకిపాడు గ్రామీణం), న్యూస్‌టుడే: కృష్ణా నదిలో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు బాలురిలో ఒకరు గల్లంతై మృత్యువాత పడిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  తాడిగడపలో నివసించే కారాణి నాగరాజుకు ఇద్దరు కుమారులు. వేసవి సెలవులకు కంకిపాడు మండలంలోని మద్దూరులో ఉన్న అమ్మమ్మ ఇంటికి కొన్ని రోజులక్రితం వచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆడుకుంటామని ఇంటి నుంచి వెళ్లిన ఈ ఇద్దరు అదే గ్రామంలోని మరో ముగ్గురు బాలురతో కలిసి కృష్ణా నదిలోకి స్నానానికి వెళ్లారు. వీరంతా స్నానం చేస్తుండగా నాగరాజు చిన్న కుమారుడు ఆరో తరగతి చదువుతున్న కారాణి పళని కార్తీక్‌ (13) నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు తోటి బాలురు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సమీపంలోని పెద్దలకు విషయం తెలియజేయగా వారువచ్చి నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించగా బాలుడి మృత్యువాతపడి విగతజీవిగా లభ్యమయ్యాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు కార్తీక్‌ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. బాలుడి మృతికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని, అతని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని