logo

గుంతలు.. ప్రాణం తీసేస్తున్నాయి

పెనమలూరు నియోజకవర్గంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోతూనే ఉన్నాయి.

Published : 24 May 2024 03:59 IST

ఇష్టారాజ్యంగా తవ్వకాలు

మద్దూరు లంకభూముల సమీపంలో ఇసుక తవ్వేసిన ప్రదేశం

కంకిపాడు, న్యూస్‌టుడే : పెనమలూరు నియోజకవర్గంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోతూనే ఉన్నాయి. మద్దూరు, కాసరనేనివారిపాలెం, చోడవరం, పెదపులిపాక, యనమలకుదురు నదీపాయల్లో స్నానానికని వెళుతున్న బాలలు, యువకులు మృత్యువాత పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఎక్కడంటే అక్కడ ఇసుకను తోడివేయడంతో 5 నుంచి 8 అడుగులలోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. కరకట్ట, లంకభూములకు సమీపంలోనే భారీ స్థాయిలో ఇసుక, బుసక (మట్టితోకూడిన సన్న ఇసుక) తోడేశారు. మద్దూరు పుష్కరఘాట్‌కు సమాంతరంగా కిలోమీటరు మేర ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలు జరిగిన సమయంలో విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం, నివేదికను ట్రైబ్యునల్‌కు పంపడం, చర్యలు తీసుకున్నామని ప్రకటించడం..ఇదంతా షరా మామూలైంది. క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు కార్యాచరణలో లేవు. దీంతో నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి.

వీటికి ముగింపు ఎన్నడో..?: వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాల నుంచి నదీ పరివాహక గ్రామాలకు బాలలు, యువకులు వస్తుంటారు. వీరిలో కొందరు సరదాగా స్నానం చేసేందుకు నదిలో దిగుతుంటారు. వీరికి ప్రమాదకర గుంతలు, ఊబిలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. పైభాగంలో నీరు నిశ్చలంగా ఉన్నట్లు కనపడుతున్నా, అడుగు భాగంలో ప్రవాహం ఉంటుంది.కాలికి అడుగుభాగం (ఇసుక) తాకుతుందనే ఉద్దేశంతో పిల్లలు మరింత ముందుకు వెళుతుంటారు. అదే ప్రాణం మీదికి తెస్తోంది. ఈత బాగా వచ్చినా ఒక్కసారిగా గుంత, ఊబిలోకి జారే క్రమంలో పట్టుతప్పి మునిగిపోతుంటారని స్థానికులు చెబుతున్నారు.

హెచ్చరిక బోర్డులు అవసరం

నదిలోకి ఈతకు వెళ్లేవారికి గతంలో జరిగిన ప్రమాదాలను తెలియజేసి హెచ్చరించాలి. నదిలో ఏర్పడిన గుంతల గురించి కూడా వివరించాలి. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని