logo

అల్లర్లు సృష్టించి... ఆట కట్టించి

కొంతమంది ఆందోళనకారులుగా, మరికొందరు పోలీసులుగా ఇలా బృందాలుగా ఏర్పడి అల్లర్లు సృష్టించడం, లాఠీఛార్జి చేయడం, నీళ్లు చల్లడం, గాల్లోకి  కాల్పులు జరపడం లాంటి పలు సన్నివేశాలు చూసిన ప్రజలు ఏంజరిగిందో తెలియక ఆశ్చర్యంగా తిలకించారు.

Published : 24 May 2024 04:01 IST

ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌

ఆందోళనకారులను అడ్డుకుంటున్న సన్నివేశం

మచిలీపట్నం కార్పొరేషన్,న్యూస్‌టుడే:  కొంతమంది ఆందోళనకారులుగా, మరికొందరు పోలీసులుగా ఇలా బృందాలుగా ఏర్పడి అల్లర్లు సృష్టించడం, లాఠీఛార్జి చేయడం, నీళ్లు చల్లడం, గాల్లోకి  కాల్పులు జరపడం లాంటి పలు సన్నివేశాలు చూసిన ప్రజలు ఏంజరిగిందో తెలియక ఆశ్చర్యంగా తిలకించారు.  ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసుశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేసేందుకు గురువారం మచిలీపట్నంలోని కోనేరుసెంటరులో పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. మొదటి పోలీసులు జన సమూహాలను వెళ్లిపోవాల్సిందిగా మైక్‌ద్వారా హెచ్చరికలు జారీ చేయగా, తరువాత బాష్పవాయువు ప్రయోగం,  ఆ వెంటనే లాఠీఛార్జి చేయడం, అప్పటికీ అదుపులోకి రాకపోతే నీళ్లు చల్లడం, ప్లాస్టిక్‌బుల్లెట్లతో కాల్పులు చేయడం, అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే కాల్పులు చేయడం ఇలా విడతలవారీగా పోలీసులు అల్లర్లను అడ్డుకునేందుకు ఏమేమి చేస్తారో ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ మాట్లాడుతూ ప్రజల అందరి సహకారంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసిందని, కౌంటింగ్‌ కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అందరూ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని విద్రోహ చర్యలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటామో అవగాహన కల్పించేందుకే ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించామని చెప్పారు. పోలీసులు ప్రదర్శించిన సన్నివేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఏఎస్పీ జి.వెంకటేశ్వరరావు, ఏఆర్‌ ఏఎస్పీ ఎస్‌వీడి ప్రసాద్, ఎస్‌బీ సీఐ జేవీ రమణలు పర్యవేక్షించగా డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పర్యవేక్షిస్తున్న ఎస్పీ

గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు

టైర్లు కాలుస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని