logo

రూ.50 లక్షల వ్యయం.. పనుల్లో డొల్లతనం

హనుమాన్‌జంక్షన్‌ పైవంతెన వాహనదారులను భయాందోళనలకు గురి చేస్తోంది.

Published : 24 May 2024 04:05 IST

పైవంతెన గోతులమయం
దెబ్బతిన్న పిల్లర్‌ జాయింట్లు
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే

ధ్వంసమైన వంతెన రెయిలింగ్‌

నుమాన్‌జంక్షన్‌ పైవంతెన వాహనదారులను భయాందోళనలకు గురి చేస్తోంది. అడుగడుగునా గుంతలమయంగా మారి ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా తయారవడంతో రాకపోకలు సాగించే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నామమాత్రపు మరమ్మతులతో సరిపెట్టడం, దిగువన పిల్లర్ల సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తడంతో ఎప్పుడు ఎలాంటి అనర్థం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల కిందటే నూజివీడు వైపు వంతెన దిగువున పిల్లర్‌ వద్ద జాయింట్లు దెబ్బతిని, భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో విపరీతంగా కుంగుతూ కన్పించింది. దీంతోపాటు పలుచోట్ల వంతెనకు ఇరువైపులా ఉన్న సిమెంట్‌ రెయిలింగ్‌ ధ్వంసమవ్వడం ప్రమాద సంకేతాన్నిస్తోంది.

పెడన-విస్సన్నపేట జాతీయ రహదారిపై రాకపోకలకు హనుమాన్‌జంక్షన్‌ రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద తీవ్ర విఘాతం ఏర్పడుతుండడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి తెదేపా ప్రభుత్వం పై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రహదారులు, భవనాలు శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన నిర్వహించారు. రైల్వే పరిధిలో చేపట్టే నిర్మాణానికి అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ భూమిపూజ చేశారు.

మట్టిని ఇలాగే వదిలేశారు..

మూణ్ణాళ్ల ముచ్చటే: 2009లో పూర్తి స్థాయిలో వంతెన అందుబాటులోకి రావడంతో రాకపోకలు సాఫీగా జరగడం మొదలైంది. కానీ నిర్మాణంలో సరైన ప్రమాణాలు లేకపోవడంతో అనతి కాలంలోనే వంతెన మార్గం ధ్వంసమైంది. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టుకుంటూ వచ్చారు. మూడేళ్ల కిందట మాత్రం రూ.50 లక్షల వ్యయంతో నిర్వహణ పనులు చేపట్టారు. రెండు వారాలకు పైగా రాకపోకలు పూర్తిగా నిలిపివేసి మరీ చేసిన ఈ మరమ్మతులు కూడా ముణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి. ఎక్కడికక్కడ గుంతలు, ఇనుపచువ్వలు బయటకు చొచ్చుకురావడం షరా మామూలే అన్నట్లుగా తయారైంది పరిస్థితి.

ఫిర్యాదు చేసినా..: వంతెన పైభాగం పరిస్థితి ఇలా ఉంటే, దిగువన కొన్నిచోట్ల మరింత ప్రమాదకరంగా తయారైంది. బాపులపాడు డంపింగ్‌ యార్డుకు వెళ్లే రహదారికి సరిగ్గా ఎదురుగా ఉన్న పిల్లర్‌ పలుచోట్ల దెబ్బతినిపోయింది. పైభాగాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ చేపట్టిన నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఓ మోస్తరు నుంచి అతి భారీ వాహనాలు వెళ్లే సమయంలో వంతెన కుంగుబాటుకు గురవతూ, గాల్లో కిందకు, పైకి లేస్తుంది. గతంలో మరమ్మతులు చేపట్టిన క్రమంలో జాయింట్ల వద్ద తవ్వకాలు చేపట్టారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఈ తరహా కుంగుబాటుని గమనించిన స్థానికులు అధికార్లకు ఫిర్యాదు చేశారు. కానీ నేటి వరకు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వారధిపై ఈ తరహా గుంతలు సర్వసాధారణం

ఇదీ వంతెన చరిత్ర..

నిర్మాణం తలపెట్టింది: 2003లో
ఎక్కడ: విజయవాడ-విశాఖ రైల్వే మార్గంలో 336 లెవల్‌ క్రాసింగ్‌ వద్ద
ఎంత దూరం: 880 మీటర్లు
అధికారికంగా ప్రారంభించింది: 2009, ఫిబ్రవరి 22

అధికారులకు పట్టదు

లారీలు అదుపు తప్పి ఢీకొట్టడంతో వంతెనకు ఇరువైపులా నిర్మించిన సిమెంట్‌ రెయిలింగ్‌ రెండుచోట్ల బాగా ధ్వంసమైంది. అప్రమత్తంగా లేకుంటే వీటి మీదుగా వాహనాలు దూసుకుపోయి కింద పడే ప్రమాదం పొంచి ఉంది. పైగా రెయిలింగ్‌ ధ్వంసమైన సమయంలో కొన్నిచోట్ల శిథిలాలు అలాగే వేలాడుతూ, ఏక్షణమైనా కింద పడొచ్చనే రీతిలో ఉన్నాయి. సర్వీసు రోడ్లలో రాకపోకలు సాగించేవారిపై ఇవి పడేందుకు ఆస్కారం ఉంది. అయినా కూడా ఆర్‌అండ్‌బీ అధికారులెవ్వరూ కూడా తమకేం సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా ఇటీవల మట్టి ట్రాక్టరు ప్రమాదానికి గురవడంతో వంతెన మీదే మట్టిని వదిలేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు