logo

రవాణా సేవలకు సాంకేతిక సంకటం

రవాణా శాఖ ద్వారా వాహన యజమానులకు అందుతున్న సేవలు బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా నిలిచిపోయాయి.

Published : 24 May 2024 04:09 IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాహన యజమానులకు ఇబ్బందులు
సూర్యారావుపేట, న్యూస్‌టుడే

వాణా శాఖ ద్వారా వాహన యజమానులకు అందుతున్న సేవలు బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని వాహనదారులకు ‘ఏపీ ఆర్‌టీఏ ఈ ప్రగతి’తో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పరివాహన్‌ సారథి’ ద్వారా రవాణాశాఖ సేవలు అందిస్తున్నారు. కొద్ది నెలలుగా ఈ రెండు సైట్లు పలుమార్లు నిలిచిపోతుండటంతో వాహన యజమానులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం నుంచి పలు సేవలకు బ్రేక్‌ పడింది. కేవలం ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ వంటివి మాత్రమే అందుబాటులో ఉండటం.. మిగిలిన అన్ని రకాల సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక కారణాల వల్ల సేవలు నిలిచిపోయాయని అధికారులు అంటున్నా సర్వర్‌ నిర్వహణ నిమిత్తం రవాణాశాఖ ప్రైవేటు సంస్థకు రూ.కోట్లలో బకాయి ఉండటంతో సేవలను అర్ధంతరంగా నిలిపివేశారు.   

రవాణా శాఖ ద్వారా వాహన యజమానులకు పలు రకాల సేవలు అందుతుంటాయి. ఎల్‌ఎల్‌ఆర్, కొత్త డ్రైవింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సుల పునరుద్ధరణ, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీ, వాహనాల రెన్యూవల్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, నిరంభ్యంతర పత్రాల జారీ, త్రైమాసిక పన్నుల చెల్లింపులు, ఈ చలనాల వసూళ్లు, పర్మిట్లు తదితర సేవలు అందిస్తారు. ఈ సేవల నిమిత్తం నిత్యం వందలాది మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తుంటారు.

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల్లోని అధికారులు ఆయా దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం లైసెన్సులు, కొత్త రిజిస్ట్రేషన్లు తరచుగా ఆగిపోతున్నా ఈ సేవలు మాత్రమే వాహన యజమానులకు అందుబాటులో ఉన్నాయి.

రోజుకు 2,500 సేవలు

జిల్లాల ఏర్పాటు తరువాత కార్యాలయాల విభజన జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయం (డీటీసీ), నందిగామ ఆర్టీఓ కార్యాలయం, జగ్గయ్యపేటలో యూనిట్‌ కార్యాలయం ఉంది. అదే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం జిల్లా రవాణాశాఖాధికారి కార్యాలయం (డీటీఓ), గుడివాడ ఆర్టీఓ కార్యాలయం, ఉయ్యూరు యూనిట్‌ కార్యాలయం ఉంది. వీటిలో విజయవాడ డీటీసీ కార్యాలయం, మచిలీపట్నం డీటీఓ కార్యాలయాలు ప్రధానమైనవి. ఈ 6 కార్యాలయాల ద్వారా నిత్యం 2,500 మంది పలు రకాల సేవలను వినియోగించుకుంటారు. ప్రధానమైనవి ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్‌ లైసెన్సులు. ఈ రెండు జిల్లాల్లో కేవలం ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రైవింగ్‌ లైసెన్సులే రోజుకు 800 నుంచి 1000 వరకు ఉంటాయి. మిగిలినవన్నీ ఇతర రకాల సేవలు.

అధికారుల తప్పిదమే..

ఏపీ ఆర్‌టీఏ ఈ ప్రగతి నుంచి సేవలను ఒక్కొక్కటిగా కేంద్ర సర్వర్‌ ‘పరివాహన్‌ సారథి’లోకి మారుస్తున్నారు. ఏడాది కాలంగా ఇది జరుగుతున్నా తరచూ కేంద్ర సర్వర్‌ మొరాయించి సేవలు ఆలస్యం అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా వాహన యజమానులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా బకాయిల కారణంగా సేవలు నిలిచిపోవడంతో వాహన యజమానులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని యజమానులు కోరుతున్నారు.

పన్ను చెల్లింపుదారులుంటే

రవాణా వాహనాల యజమానులు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్నులు చెల్లించాలి. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఏప్రిల్‌లో చెల్లించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం త్రైమాసిక పన్ను చెల్లింపులు ఉండవు. ఒక వేళ ఉంటే రవాణాశాఖ కార్యాలయాల ద్వారా లభ్యమయ్యే సేవలు వేలల్లో ఉంటాయి. ప్రస్తుతం త్రైమాసిక పన్నులు చెల్లింపులు లేకపోవడంతో రవాణాశాఖ సేవలు నిలిచిపోయినా ఒక్కో కార్యాలయం పరిధిలో కేవలం వందల్లోనే ఇబ్బందులు పడుతున్నారు. అదే పన్ను చెల్లింపులుంటే వేలాది మంది ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని