logo

నిర్వహణకు తూట్లు.. అన్నదాతకు పాట్లు

నిర్వహణ లేక క్యాంప్‌బెల్‌ అక్విడెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.

Published : 24 May 2024 04:11 IST

పరిరక్షణ పట్టించుకోని ప్రభుత్వం
శిథిలావస్థకు చేరిన క్యాంప్‌బెల్‌ అక్విడెక్టు
న్యూస్‌టుడే, అవనిగడ్డ గ్రామీణం

నిర్వహణ లేక క్యాంప్‌బెల్‌ అక్విడెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దివిసీమ ముఖద్వారమైన పులిగడ్డలో కృష్ణా నదిపై 1936లో కింది భాగాన నీటి ప్రవాహానికి తొట్టె, పైభాగం రవాణా మార్గంగా అక్విడెక్టు నిర్మించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లోని సుమారు 72 వేల ఎకరాలకు సాగు నీరు, 45 పంచాయతీలకు తాగు నీరు అందిస్తున్న పులిగడ్డ క్యాంప్‌బెల్‌ అక్విడెక్టు ఇంతకాలం దివిసీమ వరప్రదాయనిలా నిలిచింది. ఏటా మరమ్మతులు చేసి ఈ కట్టడాన్ని పరిరక్షించడానికి నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సరైన నిర్వహణ లేక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

రెయిలింగ్స్‌ విరిగి వేలాడుతున్నాయిలా..

  • ఏటా పంటకాలం పూర్తయిన తర్వాత అక్విడెక్టుకు మరమ్మతులు చేసి రంగులద్దేవారు. ఈ మేరకు నీటి పారుదల శాఖలో కొంత బడ్జెట్‌ కేటాయింపు ఉండేది. ఈ ఏడాది ఇంత వరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు. జూన్‌ నెలలో పంట కాల్వలకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. రైతులు ఇప్పటికే ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు.
  • వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్విడెక్టు కనీస మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుతోందని దివివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రూ.53 లక్షలు మంజూరు కాగా నీటి పారుదలకు అవసరమైన పనులు ఏప్రిల్‌ నెలలోనే చేయించామని అప్పట్లో ఎమ్మెల్యే సింహాద్రిరమేష్‌బాబు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 16న జలవనరుల శాఖ ఈఈ కృష్ణారావు అక్విడెక్టు పరిశీలనకు వచ్చి రూ.4 లక్షల మేరకు పనులు చేసినట్లు, గుత్తేదారుడికి ఇంకా బిల్లులు చెల్లించలేదని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

అడుగు భాగాన ఊడిపోయిన ఇనుప మూత

  • అక్విడెక్టు అడుగు భాగాన ఉన్న ఛాంబర్లకు ఇనుప మూతలు కొన్నింటికి ఊడిపోగా మరికొన్నింటికి ఉన్నవి తుప్పు పట్టి వేలాడుతున్నాయి. పిల్లర్లపై గడ్డి మొక్కలు దట్టంగా మొలిచాయి. అడుగుభాగంలో పగుళ్లిచ్చాయి. పైన ఉన్న రైయిలింగ్స్‌ విరిగిపోయాయి. అండర్‌ టన్నెల్స్‌ షట్టర్లు తుప్పు పట్టి అడుగుభాగం నుంచి నీరు నదిలోకి వృథాగా పోతోంది.
  • స్లాబు పెచ్చులూడిపోయింది. రంగులు వెలిసి వెలవెలబోతోంది. అక్విడెక్టును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించి దివి వరప్రదాయనిని పరిరక్షించాలని ప్రజాప్రతినిధి, అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
  • దీనిపై జలవనరుల శాఖ పులిగడ్డ సబ్‌డివిజన్‌ డీఈఈ మాట్లాడుతూ ఈ ఏడాది మరమ్మతులకు రూ.60 లక్షలకు ప్రతిపాదనలు పంపామని.. నిధులు ఇంకా మంజూరుకాలేదని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని