logo

బాదుడే మా పని.. బాధలు మాకేమని..!

విజయవాడ నుంచి జగదల్‌పూర్‌ వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-30) విస్తరణను కేంద్రం చేపట్టింది. 2016లోనే నిర్మాణం చేపట్టారు.

Updated : 24 May 2024 04:32 IST

ఐదేళ్లుగా ఎడాపెడా టోల్‌ ఛార్జీల వసూలు
అత్యంత దారుణంగా ఎన్‌హెచ్‌-30 నిర్వహణ
రహదారితో ప్రమాదాల బారిన ప్రయాణికులు
ఈనాడు, అమరావతి

ఇబ్రహీంపట్నం సర్కిల్‌ నుంచి కొండపల్లి వరకు రహదారి ఇలా...

ఇది టోల్‌ పన్నులు చెల్లించే జాతీయ రహదారి. ప్రతి 50 కిమీ చొప్పున టోల్‌ వసూలు చేయాలని నిర్ణయించి రెండు చోట్ల టోల్‌ప్లాజాలు పెట్టి పన్ను వసూలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో మూడుసార్లు టోల్‌ ధరలు పెంచినా నిర్వహణ దారుణంగా ఉంది. విజయవాడ-జగదల్‌పూర్‌ (ఎన్‌హెచ్‌-30) జాతీయ రహదారి దుస్థితి ఇది. కొండపల్లి ప్రాంతంలో రహదారి ఇలా తయారైనా అధికారులు, గుత్తేదారుకు పట్టలేదు.

ఇది ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద జాతీయ రహదారే. 1.5 కిమీ దూరం ఉన్న ఈ గ్రామంలో దారి దారుణంగా ఉంది. ఇదిగో.. అదిగో వేస్తున్నాం అనడంతోనే సరి. దుమ్ము ధూళి లేచి నివాసాలపై పడి ప్రజలు రోగాల పాలవుతున్నారు. గ్రామంలో మీటరు లోతు గోతులతో దారుణంగా ఉంది. ఇక్కడ బైపాస్‌ వేయాల్సి ఉన్నా.. అధికారులు పట్టుబడి గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి నిర్మాణానికి నాంది పలికారు. గుత్తేదారు దీనిని పూర్తి చేయకనే వెళ్లిపోగా ప్రజాప్రతినిధులూ విస్మరించారు.

విజయవాడ నుంచి జగదల్‌పూర్‌ వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-30) విస్తరణను కేంద్రం చేపట్టింది. 2016లోనే నిర్మాణం చేపట్టారు. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు, తిరిగి తిరువూరు నుంచి భద్రాచలం వరకు మొత్తం 170 కిలోమీటర్లు దూరాన్ని దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థకు అప్పగించారు. తిరువూరు వరకు 68 కిమీ నిర్మాణం పూర్తయింది. భద్రాచలం వరకు కొంత నిర్మాణంలో ఉంది. రూ.1,500 కోట్ల టెండర్‌తో ఎన్టీఆర్‌ జిల్లాలో 68 కిమీ దూరాన్ని రెండు వరసలుగా వేశారు. గ్రామాలు ఉన్నచోట నాలుగు వరసలు నిర్మించారు. తిరువూరు నుంచి కొత్తగూడెం వరకు పూర్తి చేశారు.

రూ.కోట్లలో ఆదాయం...

ఎ.కొండూరు మండలం బాడవ వద్ద ఒక టోల్‌ప్లాజా, పెనుబల్లి మండలం గౌరవరం వద్ద మరో టోల్‌ప్లాజా పెట్టి 2018 నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. బాడవ వద్ద మొదట కారుకు రూ.25, తర్వాత 45, రెండేళ్ల కిందట రూ.70 చేశారు. గౌరవరం వద్ద రూ.40 వసూలు చేస్తున్నారు. నిత్యం 2,500 వాహనాలు వెళ్తుంటాయి. భద్రాచలం పుణ్యక్షేత్రం కావడం, ఛత్తీస్‌ఘడ్‌కు అనుసంధాన దారి కావడంతో భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. టోల్‌ వసూలుతో రూ.కోట్ల ఆదాయం వస్తుంది.

నిర్వహణ దారుణం..

ఎత్తుపల్లాలతో ప్రమాదకరంగా..

ఇబ్రహీంపట్నం సర్కిల్‌ నుంచి జి.కొండూరు వరకు రోడ్డు మొత్తం కిందకు అణిగిపోయి ఎత్తుపల్లంగా ఉంది. వాహనం వెళుతుంటే ఛాసిస్‌ రోడ్డుకు తాకేలా ఉంది. కనీసం ద్విచక్ర వాహనాలు సాఫీగా వెళ్లలేకున్నాయి. కొండపల్లి రైల్వే బ్రిడ్జి పార్టు పూర్తి చేయలేదు. టోల్‌ వసూలు చేసే రోడ్డు.. నిరంతర నిర్వహణ ఉండాలి. కొండపల్లి వద్ద భారీ వాహనాలు తిరుగుతుంటాయి. అందుకే రోడ్డు కుంగిందని పట్టించుకోవడం మానేశారు. జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో 50 వరకు కల్వర్టులు ఉన్నాయి. కొన్ని బాక్సు టైప్, తూముల కల్వర్టులు ఉన్నాయి. ఇక్కడ స్పీడ్‌ బ్రేకర్ల తరహాలో రోడ్డు ఉంది. వాహనం వేగంగా వెళుతుంటే ఎగిరిపడి ప్రయాణీకులకు గాయాలవుతున్నాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బాబోయ్‌ అంటున్నారు. పలు వాహనాలు కల్వర్టుల వద్ద పల్టీలూ కొట్టాయి. ఇబ్రహీంపట్నం-తిరువూరు రహదారి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు గుత్తేదారుకు ఇచ్చారు. ఏటా రూ.2.50-5 కోట్లు చెల్లిస్తున్నారు. నిధులు దోచిపెట్టడమే తప్ప నిర్వహణ లేనేలేదనే విమర్శలున్నాయి.

తారు కుంగిపోయి..

అయిదేళ్లుగా దస్త్రం కదల్లేదు..

ఎ.కొండూరులో నరకం కనిపిస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. సుమారు 1.50 కిమీ దారి నిర్మించకుండా వదిలేయగా భారీ గుంతలుపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని ఇళ్లు తొలగించాలి. 30 ఇళ్లు తొలగించి పరిహారం చెల్లించారు. ఆరింటికి చెల్లించలేదు. అయిదేళ్లుగా పరిహారం దస్త్రం కదల్లేదు. ఈ రహదారి తన కృషితోనే వేశామని చెప్పే ఎంపీ కేశినేని నాని రామచంద్రాపురం గ్రామస్థుల సమస్య పట్టించుకోలేదు. వాస్తవానికి గ్రామంలో రహదారి వద్దనీ.. బైపాస్‌ వేయాలని గ్రామస్థులు కోరారు. పట్టుబడి ఇక్కడ గ్రామం నుంచి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించి సమస్యలు తెచ్చారు. పరిహారం సమస్య విస్మరించడమే కాక.. గోతులను సైతం పూడ్చలేదు.

ఎక్కడ బాగాలేదో చెప్పండి..!

జాతీయ రహదారుల పీడీ నారాయణరెడ్డిని ‘ఈనాడు’ వివరణ కోరగా... రామచంద్రాపురంలో ఆరు ఇళ్లకు పరిహారం ఇవ్వాలి. ఆర్‌అండ్‌బీ అంచనా ఇవ్వాలి. పరిహారం పూర్తయితే టెండర్లు పిలిచి అప్పగిస్తాం. రహదారి ఎక్కడ బాగాలేదో చెప్పండి అంటూనే.. ఇంజినీరుతో తనిఖీకి వెళ్లాలని సూచించారు. కొండపల్లి, కల్వర్టుల వద్ద నిర్వహణ చేపట్టామన్నారు. ఎన్‌హెచ్‌ ఇంజినీరు అనిల్‌ మాట్లాడుతూ.. కల్వర్టుల వద్ద త్వరలో మరమ్మతు చేయిస్తామనీ.. కొండపల్లి వద్ద మరో బీటీ పొర వేస్తున్నామన్నారు.


బలవంతంగా కూల్చారు..!

మా ఇళ్లు బలవంతంగా కూల్చేశారు. పరిహారం ఇచ్చారు. కానీ ఇంత వరకు రోడ్డు వేయలేదు. దుమ్ముధూళి, వర్షాకాలం బురదతో సహజీవనం చేస్తున్నాం. రోగాలు వస్తున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు.

గోపాలరావు, రామచంద్రాపురం


ప్రమాదాలు జరుగుతున్నాయి.!

చాలా ఏళ్లుగా ఇలాగే ఉంది. ఈ దారి బాగు చేసేవారు లేరు. స్థానికులే అప్పుడప్పుడు మట్టి వేసి గుంతలు నింపుతున్నారు. మళ్లీ రెండు రోజులకు మామూలే. నిత్యం వాహనాల రద్దీతో దుమ్ము రేగి అల్లాడుతున్నాం. బైపాస్‌ వేయాలని మేం కోరితే అసలు పట్టించుకోలేదు.

బి.వెంకటేశం, రామచంద్రాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని