logo

ఏటా ముంపు.. ఏది కనువిప్పు

వానొస్తే నగరంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అవుట్‌ ఫాల్, వర్షపునీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీత పనులు నిర్వహిస్తే ఈ పరిస్థితి ఉండదు.

Published : 26 May 2024 05:14 IST

డ్రెయిన్ల పూడికతీత పనుల్లో అధికారుల నిర్లక్ష్యం 
రూ.కోట్లలో వెచ్చిస్తున్నా కనిపించని ఫలితం 

స్టెల్లా కళాశాల వద్ద సర్వీస్‌రోడ్డులో నిలిచిన వర్షపు నీరు

విజయవాడనగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: వానొస్తే నగరంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అవుట్‌ ఫాల్, వర్షపునీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీత పనులు నిర్వహిస్తే ఈ పరిస్థితి ఉండదు. కానీ నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా దృష్టిసారించడం లేదు. నగరంలో నిత్యం ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో 20 మెట్రిక్‌ టన్నుల మట్టి, వ్యర్థాలు నేరుగా డ్రెయిన్లలోకి చేరిపోతున్నాయి. పలువురు వ్యాపారులు, హోటళ్ల యజమానులు, చిరువ్యాపారులు వ్యర్థాలను నేరుగా డ్రెయిన్లలో వేస్తున్నారు. రహదారులను శుభ్రం చేసే సిబ్బంది సైతం ఇదే విధంగా చేస్తున్నారు. వీటిని నిలువరించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలం అవుతున్నారు. గతంలో కాలువలను శుభ్రం చేసేందుకు 10-15 మంది పారిశుద్ధ్య సిబ్బందితో గ్యాంగ్‌వర్కు నిర్వహించేవారు. కొద్దికాలంగా దీనికి అధికారులు మంగళం పాడారు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.

ముందెందుకు మేల్కోరూ..?

 • జూన్‌ మధ్య నుంచి వర్షాలు మొదలవుతాయి. పూడికతీత పనులకు జనవరి-ఫిబ్రవరి నుంచి ఆలోచన చేయాలి. టెండర్లు పిలిచి మే నెలాఖరుకలా పనులు పూర్తిచేయాలి. గడచిన కొంతకాలంగా జూన్, జులైలో పూడికతీత పనులు చేస్తున్నారు. ఫలితంగా వర్షం పడగానే తీసిన వ్యర్థాలు తిరిగి డ్రెయిన్లలోకి చేరిపోతూ సమస్య మొదటికొస్తుంది. అదే అదనుగా కొద్దిపాటి పూడిక తీసి మొత్తం పని చేసినట్లుగా గుత్తేదార్లు బిల్లులు చేసుకుంటున్నారు. వారి నుంచి అధికారులు, పాలకులు కమీషన్లు దండుకుంటున్నారు.

ఏటా రూ.కోట్ల వ్యయం..!

ఏటా 25-50 కిలోమీటర్ల మేరకు డ్రెయిన్ల పూడికలు తీసేందుకు రూ.2.50 నుంచి రూ.3.00 కోట్లు వ్యయం చేస్తున్నారు. కనిష్ఠంగా ప్రతి నియోజకవర్గంలో రూ.80 లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.3 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. కానీ వేసవిలో పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతో కార్పొరేషన్‌ యంత్రాలు, సిబ్బందితో పూడికలు తీస్తున్నారు. దీనిపై చీఫ్‌ ఇంజినీర్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పనులు ఆలస్యమయ్యాయని, కోడ్‌ ముగిశాక వెంటనే పూడిక తీయిస్తామని చెప్పారు.


పనులు చేపట్టే ప్రాంతాలు ఇలా..

అధికారులు గుర్తించిన ప్రాంతాల్లో ఏటా పూడికతీత పనులు చేస్తారు.ప్రధానంగా విద్యాధరపురం అంబేడ్కర్‌రోడ్డు, సితార జెంక్షన్‌ నుంచి కబేళారోడ్డు

 • పాతబస్తీ డ్రెయిన్‌ స్ట్రీట్, గణపతిరావురోడ్డు నుంచి జెండాచెట్టు, సుబ్బరామయ్యవీధి.
 • ఒన్‌టౌన్‌ మెయిన్‌బజార్‌ నుంచి బీఆర్‌పీ రోడ్డు వరకు
 • చిట్టినగర్‌ కెటిరోడ్డు కలరా ఆస్పత్రి నుంచి సీవీఆర్‌ పైవంతెన
 • కేఎల్‌ రావునగర్‌ అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ మిల్క్‌ ప్రాజెక్టు నుంచి కెఎల్‌.రావు నగర్‌ రోడ్డు నంబరు 8 వరకు
 • నైజాంగేటు-కంసాలిపేట వరకు
 • కంపాలిపేట నుంచి రైల్వేట్రాక్‌ జీరో బల్పు ఏరియా వరకు
 • గాంధీ హిల్‌ నుంచి హనుమాన్‌పేట వరకు
 • బైపాస్‌ నుంచి బుడమేరు వరకు
 • మధురానగర్‌లోని పలు అంతర్గత డ్రెయిన్లు, సింగ్‌నగర్‌లోని అత్యధిక ప్రాంతాల డ్రెయిన్లు,
 • పటమట లంక పలు డ్రెయిన్లు
 • ఏపీఏఏసీ కాలనీ,
 • కరెన్సీనగర్‌లోని అవుట్‌ డ్రెయిన్, అటోనగర్‌కు అనుబంధమైన డ్రెయిన్లు
 • మొగల్రాజపురం, సున్నపుబట్టీల సెంటర్‌ ప్రాంతపు  డ్రెయిన్లు
 • మదర్‌ థెరిసా జెంక్షన్, డివిమేనర్‌రోడ్డు, జమ్మిచెట్టుసెంటర్‌ ఏరియా డ్రెయిన్లు,
 • పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డు
 • లయోలా కళాశాల రోడ్డు డ్రెయిన్‌
 • బృందావన్‌ కాలనీ ఇతర కాలనీల్లో డ్రెయిన్లు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని