logo

ఆధునికీకరణ అన్నారు.. వసతులు మరిచారు..

2022లో పూర్తయిన విజయవాడ-మచిలీపట్నం డబ్లింగ్‌లో భాగంగా పెడన రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించినా ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు.

Published : 26 May 2024 05:24 IST

పెడన రైల్వేస్టేషన్‌లో సమస్యల కూత

పెడన, న్యూస్‌టుడే: 2022లో పూర్తయిన విజయవాడ-మచిలీపట్నం డబ్లింగ్‌లో భాగంగా పెడన రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించినా ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. మచిలీపట్నం రైల్వేస్టేషన్‌కు ముందు వచ్చే ఈ స్టేషన్‌ ఆర్థికపరంగా రైల్వేకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా ఇక్కడి సమస్యలను తీర్చడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించడం లేదు. ఫలితంగా ప్రయాణికుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి

ఫ్లాట్‌ఫాంపై పైకప్పు లేక ఇబ్బందులు

మచిలీపట్నం-విజయవాడ సెక్షన్‌లో మచిలీపట్నం, గుడివాడల తర్వాత పెడన స్టేషన్‌ ఆదాయ పరంగా మూడోస్థానంలో నిలుస్తుంది. పెడన వాణిజ్య కేంద్రం కావడం ఒక కారణమైతే బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల ప్రజలకు ఈరైల్వేస్టేషన్‌ అందుబాటులో ఉండడం మరో కారణం. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సౌకర్యాల పరంగా చూస్తే అంతగా లేవని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి బయలుదేరే బీదర్, ధర్మవరం,సాయినగర్‌ శిర్డి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో పెడన నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.  రైలు కోచ్‌లకు అనుగుణంగా ఫ్లాట్‌ఫాం పొడవు లేకపోవడంతో జనరల్, స్లీపర్‌ కోచ్‌ల్లోని ప్రయాణికులు ట్రాక్‌ వెంబడి ఉన్న రాళ్లపై నుంచి ఎక్కి దిగాల్సి వస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కోచ్‌లు ఫ్లాట్‌ఫాంపై ఎక్కడ ఆగుతాయో తెలిపే డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు లేక ప్రయాణికులు రైలు ఆగిన తర్వాత తమ కోచ్‌ కోసం ఫ్లాట్‌ఫాంపై పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక ఫ్లాట్‌ఫాంపై రూఫ్‌ కొంతభాగం మాత్రమే ఉండడంతో వర్షం కురిస్తే ఇబ్బందులు తప్పడంలేదు.
పార్కింగ్‌ లేక అవస్థలు: ఇతర ప్రాంతాల నుంచి పెడనకు బైక్‌లపై వచ్చి రైళ్లలో రాకపోకలు సాగించే వారికి పార్కింగ్‌ సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్కింగ్‌కు కాంట్రాక్టర్‌ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. పార్కింగ్‌ భవనంలో ఉంచిన బైక్‌లు చోరీకి గురైన సంఘటనలు కూడా వెలుగుచూశాయి.
హాల్టింగ్‌ లేక: మచిలీపట్నం నుంచి వారంలో మూడు సార్లు వెళ్లే మచిలీపట్నం-యశ్వంత్‌పూర్, ప్రతి సోమవారం వెళ్తోన్న తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పెడనలో హాల్టింగ్‌ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి ఈరెండు రైళ్లకు వెళ్లాల్సిన వారు గుడివాడ లేదా మచిలీపట్నం వెళ్లి రైళ్లను ఎక్కాల్సి వస్తోంది. ఈ రెండు రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని దీర్ఘకాలంగా ప్రయాణికులు అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నా స్పందన లేదు. 

 నిరుపయోగంగా పార్కింగ్‌ భవనం 

అధికారులు ఏమంటున్నారంటే.. 

దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని