logo

ఏళ్లు గడిచాయి.. ఇళ్లు నిలిచాయి

ఏళ్లు గడిచిపోతున్నా.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పునాదుల దశలో కొన్ని చోట్ల, అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లు మరికొన్ని చోట్ల కనిపిస్తున్నాయి.

Published : 26 May 2024 06:05 IST

జగనన్న కాలనీల్లో వసతుల లేమి
నిర్మాణానికి ముందుకురాని లబ్ధిదారులు

పెద కరగ్రహారంలో ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : ఏళ్లు గడిచిపోతున్నా.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పునాదుల దశలో కొన్ని చోట్ల, అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లు మరికొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. బందరు మండలంలో కాలనీలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎక్కడా పూర్తిగా ఇళ్లు నిర్మించిన దాఖలా లేదు. కనీస వసతులు లేకుండా ఇళ్లు ఎలా నిర్మించుకోవాలంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

అన్ని చోట్లా అధ్వానమే...

  • నగరంలోని వివిధ డివిజన్ల ప్రజలకు చినకరగ్రహారంలో 15 వేల మందికిపైగా స్థలాలు కేటాయించారు. ఇప్పటికీ చాలామంది ఇళ్లు నిర్మించుకోలేదు. గ్రామాల్లో లేఔట్లు చూస్తే అన్ని చోట్లా అధ్వానంగా ఉన్నాయి. సుల్తానగరం ప్రజలకు పొలాల మధ్యలో స్థలాలు కేటాయించారు. మెరక చేయకపోవడంతో వర్షం వస్తే మోకాలి లోతు నీళ్లు చేరిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒకరిద్దరు మాత్రమే ఇళ్లు నిర్మించుకోగా.. కొందరు అసంపూర్తిగా వదిలేశారు. చాలామంది ఇక్కడ ఇళ్ల నిర్మాణం అంటేనే హడలిపోతున్నారు. 
  • చిట్టిపాలెంలో ఊరి చివర స్థలాలు ఇచ్చినా... వసతులు లేవని నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారుల ఒత్తిడితో కొంతమంది నిర్మించుకున్నా... అక్కడికి వెళ్లే దారి లేక, ఉండే అవకాశం లేక ఖాళీగా వదిలేశారు.  చిన్నాపురం, ఎస్‌ఎన్‌ గొల్లపాలెం, పొట్లపాలెం, తపశిపూడి తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 
  • మండలంలో ఆరు వేల మందికిపైగా లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తే... వారిలో మూడో వంతు మంది కూడా ఇళ్లు నిర్మించుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేసవిలోనే ఇలా ఉందంటే.. వర్షాకాలంలో నిర్మాణానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. అసలు ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిట్టిపాలెంలో అసంపూర్తిగా గృహ నిర్మాణాలు 

 వసతులేవి.. నిర్మాణం ఎలా?

  • స్థలాలు ఊరికి దూరంగా ఇచ్చారని, వసతులు లేవని, ఇతర కారణాలు చూపుతూ ఇళ్లు నిర్మించలేమని చాలామంది లబ్ధిదారులు అధికారులకు చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో పాటు స్వయం సంఘాల మహిళలకు అదనంగా రుణం కూడా ఇస్తామని ప్రకటించారు. ఎంత రుణం ఇచ్చినా వసతులు లేకుండా ఇళ్లు ఎలా నిర్మించాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
  • పెదకరగ్రహారంలోని కాలనీలో ముళ్ల పొదలు పెరిగిపోయాయి. ప్రజలకు తాగునీరు అందించేందుకు నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకు కూడా అసంపూర్తిగానే ఉంది. అంతర్గత రహదారులు లేక అవస్థలు పడుతున్నారు. ఏ కాలనీలో కూడా పూర్తి స్థాయిలో మెరక పనులు చేపట్టిన దాఖలాలు లేవు. చదును, అంతర్గత రోడ్ల అభివృద్ధి, తాగునీరు, విద్యుత్‌ తదితర వసతులు కల్పించాల్సి ఉంది. ఎక్కడా పూర్తి స్థాయిలో వసతులు లేవు. కనీసం సామగ్రి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల నీటి వసతి కోసం చేతి పంపులు వేసి వదిలేశారు. వర్షం పడితే చాలు కాలనీల్లో నీళ్లు చేరి నిల్వ ఉంటున్నాయి. ఎప్పటినుంచో సమస్య ఇలాగే ఉన్నా పట్టించుకునే వారే కరవయ్యారు. వసతులు లేక చాలామంది ఇళ్ల నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. ఎప్పుడు సౌకర్యాలు కల్పిస్తే అప్పుడే నిర్మించుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కాలనీల్లో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

వసతుల కల్పనకు కృషి

కాలనీల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. ఎన్నికల కోడ్‌ కారణంగా జాప్యం జరిగింది. మండల వ్యాప్తంగా కాలనీల వారీగా ఎక్కడెక్కడ ఏయే వసతులు కల్పించాల్సి ఉందో నివేదిక సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.  

ఎ.బాలకృష్ణారావు, ఎంపీడీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని