logo

మూడోసారీ.. మసిపూస్తారా!

అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వకాలు.. భారీ యంత్రాలతో తోడేయటాలు.. పరిమితికి మించి నాలుగైదు మీటర్ల తవ్వకాలు.. కృష్ణా నదిలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి.

Published : 26 May 2024 05:35 IST

ఇసుక రేవులపై నివేదికకు మల్లగుల్లాలు..!
కృష్ణా నదిలో గుంతలకు కారణాలు ఏంటో?

మద్దూరు నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో ఇటీవల ఏర్పడిన గుంతలు 

ఈనాడు, అమరావతి: అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వకాలు.. భారీ యంత్రాలతో తోడేయటాలు.. పరిమితికి మించి నాలుగైదు మీటర్ల తవ్వకాలు.. కృష్ణా నదిలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. ‘మా ప్రాంతంలో ఎక్కడా అక్రమ తవ్వకాలు లేవు.. అంతా సవ్యంగానే జరుగుతోంది. భారీ యంత్రాలు పెట్టలేదు. చిన్న జేసీబీలనే పెట్టారు. ఒక మీటరు లోతునే తవ్వకాలు జరిగాయి..!’ అని ఇప్పటికే రెండుసార్లు నివేదికలు పంపిన జిల్లా కలెక్టర్లు ఇప్పుడు మూడోసారి మరో నివేదిక ఇచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లాలో గనుల శాఖ డీడీ సుబ్రహ్మణ్యం.. సెబ్‌ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పలు రేవులు తనిఖీ చేశారు. కృష్ణా జిల్లాలో రేవులు తనిఖీ చేయలేదు. కానీ గుట్టుచప్పుడు కాకుండా నివేదిక ఇచ్చే ఏర్పాట్లు చేశారు. మరోవైపు అక్రమ తవ్వకాలకు బాధ్యులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఇష్టానుసారం తవ్వకాలు సాగించిన విషయం తెలిసిందే. ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి రూ.వందల కోట్ల విలువైన ఇసుక హైదరాబాద్‌కు తరలిన విషయం బహిరంగమే. అయినా.. అంతా సవ్యంగానే జరుగుతుందని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి తప్పుడు నివేదిక ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

అనుమతులే లేవు...!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 56 ఇసుక రేవులను గుర్తించి తవ్వకాలకు దరఖాస్తు చేశారు. ప్రారంభంలో జేపీ సంస్థకు, కొన్ని రేవులకు అనుమతులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 24 రేవులకు పర్యావరణ అనుమతులు వచ్చినట్లు చెబుతున్నారు. జేపీ సంస్థ ఆధ్వర్యంలో నేతలకు కాంట్రాక్టు ఇచ్చి తవ్వకాలు జరిపారు. జేపీ సంస్థ కేవలం అయిదారు నెలలుకూడా రంగంలో లేదు. తర్వాత కృష్ణా జిల్లా రేవులను ఓ ప్రజాప్రతినిధికి కాంట్రాక్టుకు అప్పగించారు. జేపీ సంస్థ పేరుతో తవ్వకాలు సాగించారు. పేరుకే ప్రజాప్రతినిధి కాంట్రాక్టు తీసుకున్నా.. ఎవరికి వారే హైదరాబాద్‌కు భారీ టిప్పర్లు తరలించే వ్యాపారం ప్రారంభించారు. వాస్తవానికి పర్యావరణ అనుమతులు ఉన్నా.. పీసీబీ నుంచి కాన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్, కాన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్స్‌ అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలు సాగించారు. నదిలో ఇసుక లారీలు బారులు తీరేవి. 

రాష్ట్రవ్యాప్త సంచలనం...

నందిగామ డివిజను ప్రాంతంలో కృష్ణా నదిలో దాదాపు 150 లారీలు వరదలో చిక్కుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ తవ్వకాల తీరును తేటతెల్లం చేసింది. అయినా బెరుకు లేకుండా తవ్వేశారు. తర్వాత తనకు నష్టం వస్తుందని ప్రజాప్రతినిధి ఇసుక తవ్వకాల నుంచి తప్పుకొన్నారు. దీంతో కంచికచర్ల వైకాపా నాయకుడు ఒకరికి అప్పగించారు. నెలకు రూ.18 కోట్లు చెల్లించేలా.. ఒప్పందం చేసుకున్నారు. తర్వాత టెండర్‌ మారి జీసీకేసీకి అప్పగించారు. అధికార ఒప్పందాలు కాకముందే నిరుడు మే నుంచే తవ్వకాలు జరిపారు. దీనిపై పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగించారు. 

అడ్డుకున్నదే లేదు..!

ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకున్నదే లేదు. ఒకవేళ ఎవరైనా ప్రయత్నాలు చేసినా పైనుంచి బెదిరింపులు వచ్చేవి. కృష్ణా జిల్లాలో ఇప్పటికీ తవ్వుతూనే ఉన్నారు. పమిడిముక్కల మండలం లంకపల్లిలోనూ, ఘంటసాల మండలం శ్రీకాకుళం, పాపవినాశనం రేవుల్లో తవ్వేస్తున్నారు. రాత్రుళ్లు తవ్వి భారీ టిప్పర్లలో తరలిస్తున్నారు. చోడవరంలోనూ రాత్రి పూట తవ్వారు. పెనమలూరు, మద్దూరు, రొయ్యూరు ప్రాంతాల్లో ఎన్నికలకు ముందు మంత్రి జోగి అనుచరులు ఇష్టానుసారం తవ్వుకున్నారు. తెదేపా నేతలు అడ్డుకున్నా.. కనీసం కేసులు నమోదు చేయలేదు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. రొయ్యూరులో ఓ ప్రైవేటు పట్టాభూమిలోనూ తవ్వేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా.. అధికారులు అడ్డుకోలేదు. అసలు అనుమతులు లేని కృష్ణా జిల్లాలో గుట్టల కొద్దీ ఇసుక ఎలా నిల్వ చేశారనేది ప్రశ్న. ఎన్టీఆర్‌ జిల్లాలో గనిఆత్కూరు, కాసరాబాద, కంచల, మన్నలూరు, కీసర తదితర ప్రాంతాల్లో తవ్వకాలు సాగించారు. కీసర, అనుమంచి పల్లి వద్ద లక్షల టన్నుల ఇసుక నిల్వ చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలించేవారు. ఇంత జరుగుతున్నా.. అంతా సవ్యమేనని నివేదికలు తయారవుతున్నాయి. ‘ఇసుక తవ్వకాల్లో రహస్యం ఏమీ లేదు. అందరికీ తెలిసిందే.. ఇప్పుడు కిందిస్థాయి అధికారుల బాధ్యత గుర్తుకు వస్తుందని’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. 

సక్రమమని నివేదిక...

ఎన్టీఆర్‌ జిల్లాలో 16 రేవులకు అనుమతులు వచ్చినా సీఎఫ్‌వో, సీఎఫ్‌ఈ మాత్రం రాలేదు. దీని కోసం పీసీబీ వద్ద దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కృష్ణాజిల్లాలో మాత్రం ఒక్క రేవుకు కూడా అనుమతి లేదు. పర్యావరణ అనుమతి రాలేదు. తర్వాత దరఖాస్తు చేశారని చెబుతున్నారు. కృష్ణా కలెక్టర్‌గా రాజబాబు ఉండగా ఒకసారి రేవులు పరిశీలించారు. అసలు తవ్వకాలు జరిపే ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో జరిపి నివేదిక సక్రమంగానే ఉందని పంపారు. తర్వాత మరోసారి జాయింట్‌ తనిఖీ జరిగింది. తహసీల్దార్లు, గనుల శాఖ, విజిలెన్సు అధికారులు, సెబ్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. తర్వాత సక్రమంగానే ఉన్నాయంటూ నివేదిక వెళ్లింది. ప్రస్తుతం మూడోసారి పరిశీలన జరిపి నివేదిక పంపాల్సి ఉంది. దీనిపై కసరత్తు జరుగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు