logo

ముందస్తు సాగునీటి విడుదల లేనట్టే?

ప్రస్తుత ఖరీఫ్‌ పనులు ఆరంభ వేళ.. కృష్ణా నది పరీవాహకంలో సాగునీటికి గడ్డు పరిస్థితి నెలకొంది. కృష్ణా డెల్టాకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తామని గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా..

Published : 26 May 2024 05:40 IST

కృష్ణా డెల్టా ఆయకట్టుకు కష్టకాలమేనా!

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రస్తుత ఖరీఫ్‌ పనులు ఆరంభ వేళ.. కృష్ణా నది పరీవాహకంలో సాగునీటికి గడ్డు పరిస్థితి నెలకొంది. కృష్ణా డెల్టాకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తామని గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. ఈ ఏడాది సాగునీటికి కటకట ఏర్పడింది. 2022, మే 19న సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. జూన్‌ 10న సాగునీటిని విడుదల చేశారు. ఆ తర్వాత సీజనులో 2023, జూన్‌ 6న సాగునీటి పారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించి, ఆ మరుసటి రోజే 7న సాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది రుతు పవనాలు వచ్చేస్తున్నట్టు చల్లని కబురు వినిపిస్తున్నా.. ఐఏబీ సమావేశ నిర్వహణ ఊసే లేదు. కృష్ణా నది ఎగువున పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు లేవు. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీలకు గాను, అంతంత మాత్రంగా సుమారు రెండు టీఎంసీలు మాత్రమే ఉంది. విస్తారంగా వర్షాలు పడితే తప్ప, ముందస్తుగా బ్యారేజీ నుంచి నీటి విడుదల సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసి, అంతా ఓట్ల లెక్కింపు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు జూన్‌ నెల ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ప్రభుత్వ పరంగా సాగునీటి విడుదల, నీటి నిల్వలు తదితరాలపై ఎలాంటి సమాచారం లభించడం లేదు. గత సీజనులో ఒక పంటకే నీరివ్వడం, ప్రస్తుత ఖరీఫ్‌లో ఎప్పుడు నీరిస్తారో తెలియని పరిస్థితి.
సాగర్, ఎత్తిపోతలు, చెరువులే ఆధారం.. ఎన్టీఆర్‌ జిల్లాలో 51,000 హెక్టార్లలో వరి సాగు విస్తీర్ణం ఉంది. నాగార్జునసాగర్, సాగునీటి చెరువులు, ఎత్తిపోతల పథకాల ఆధారంగా జిల్లాలో సాగునీటిని అందించాల్సి ఉంది. 

155 టీఎంసీల నీరు అవసరం

సాగునీటి ప్రణాళిక ప్రకారం.. కృష్ణా డెల్టాకు (ఉమ్మడి కృష్ణా జిల్లాకు) సాగు, తాగు నీటి అవసరాల నిమిత్తం 155 టీఎంసీల పైచిలుకు నీరు అవసరం ఉంది. ముఖ్యంగా ఒక్క సాగునీటి అవసరాలకే 145 టీఎంసీల పైచిలుకు కావాల్సి ఉంది. పులిచింతలలో 45 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. నాగార్జునసాగర్‌ నుంచి నీరు వస్తేనే పులిచింతల నిండుతుంది. మరోవైపు పులిచింతల-ప్రకాశం బ్యారేజీల నడుమ కృష్ణా పరివాహకంలో అధిక వర్షాలు కురిస్తే.. బ్యారేజీకి నీరు చేరుతుంది. ఏదైనా సమృద్ధిగా వర్షాలు పడితేనే నీటి లభ్యత ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లోని కృష్ణా డెల్టాల పరిధిలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఇందులో ఎన్టీఆర్‌ జిల్లాకు 1,757 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని