logo

వైకాపా.. విషవలయం

హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సంప్రదాయ ప్రచారం కంటే సామాజిక మాధ్యమాలనే ఎక్కువ నమ్ముకున్నారు.

Updated : 26 May 2024 06:26 IST

సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరుతూ..
ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా పోస్టులు
సోషల్‌ మీడియాపై నిఘా అంతంతే..

ఈనాడు, అమరావతి: హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సంప్రదాయ ప్రచారం కంటే సామాజిక మాధ్యమాలనే ఎక్కువ నమ్ముకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మరీ పోరాడారు. గెలిస్తే తాము నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం? అవతలి పక్షంపై వ్యంగ్యాస్త్రాలు, వంటి వాటిపై ఆకట్టుకునేలా మీమ్స్‌ తయారు చేసి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇదేతరుణంలో వైకాపా నేతలు ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోస్తూ అభ్యంతరకర, అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చగొట్టేలా బరితెగించి వ్యవహరిస్తున్నారు. పోలింగ్‌ ముగిసినా వీటిని ఆపలేదు. లెక్కింపు తేదీ సమీపిస్తుండడంతో వీరు మరింత దూకుడుగా వెళ్తున్నారు. శ్రుతిమించి పతాకస్థాయికి చేరుకుంది. ఈనేపథ్యంలో ఈ పోస్టులు ఉద్రిక్తతలకు దారి తీయకుండా పోలీసులు కన్నేసి ఉంచారు. 

అత్యుత్సాహంతో అలజడి...

ఓ మోస్తరు నాయకుడు కూడా ప్రత్యేకంగా వాట్సాప్‌లో గ్రూప్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో కూడా తమ పార్టీ విధానాలు, తమ బలాల గురించి ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా వివిధ వర్గాలకు చేరువ అయ్యేందుకు దగ్గర దారిగా భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలో పలువురు అత్యుత్సాహంతో హద్దులు మీరుతున్నారు.

  • అవతలి వ్యక్తిని కించపర్చేలా, కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తారు. వీటి వల్ల శాంతి, భద్రతలకు భంగం కలిగే వీలుంది. తప్పుడు సర్వేలను ఉటంకిస్తూ.. ఫలానా నేత, పార్టీ ఓడిపోతోందనో, ఒక వ్యక్తిని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ పెట్టే వాటినీ పరిగణనలోకి తీసుకోనున్నారు. 
  • వాస్తవాలను దాచి.. ప్రజల్లోకి వదంతులను భారీగా వ్యాప్తి చేసినా, వాటిని ఇతరులకు షేర్‌ చేసినా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

బరితెగిస్తున్నారు...

  • కృష్ణా జిల్లాలో హోరాహోరీగా పోటీ జరిగిన గన్నవరం నియోజకవర్గంలో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంది. ‘వంశీ గెలుపు తథ్యమని మా జగనన్న ఎప్పుడో చెప్పాడు.. నియోజకవర్గంలో ఓటు లేని నాయకులు వచ్చారు.. జూన్‌ 4 తర్వాత గాజు పెంకులపై నడిపిస్తాం’ అని తెదేపా నేతలను రెచ్చగొట్టేలా ఫేస్‌బుక్‌ల్లో పోస్టులు పెట్టారు. 
  • తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల తర్వాత పారిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయం ఎవరికీ తెలియదు..’ అని పెనమలూరు నుంచి పోటీ చేసిన మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యల్ని వైకాపా ఎక్స్‌లో పోస్టు చేసింది. 

ఏయే సెక్షన్ల కింద నమోదు?

  • సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులతో రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసినా, జరిగే అవకాశాలు ఉన్నా, ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నా పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఐపీసీలోని సెక్షన్‌ 153(ఏ) కింద కేసు కడతారు.
  • ఐటీ చట్టంలో కొన్ని సెక్షన్ల కూడా కేసు నమోదు చేయనున్నారు. 2015లో 66 (ఏ) చెల్లదనీ, దానిని తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పోలీసులు సెక్షన్‌ 66 (సి), 67 కింద నమోదు చేస్తున్నారు. 

ప్రత్యేక  సాఫ్ట్‌వేర్‌తో  పరిశీలన

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యే పోస్టింగులపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఇందుకు ప్రత్యేకంగా సన్నద్ధం అయ్యారు. విజయవాడ కమిషనరేట్, కృష్ణా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల పరిధిలో వివిధ సోషల్‌ మీడియాలో వ్యాపించే వాటిపై సునిశిత దృష్టి సారించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో నిఘా పెడుతున్నారు. ఎవరి గురించి అయినా అవాస్తవాలు ప్రచారం చేస్తే.. తెలుసుకునే వీలుంది. ఈ పోస్టింగ్‌ ఎక్కడి నుంచి ఏయే గ్రూపులకు, ఎవరెవరికి వెళ్లింది? వారు ఎవరికి షేర్‌ చేశారు? తదితర వివరాలు వస్తాయి. ఈ వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై కేసులు పెడతారు. సంక్లిష్టమైన వాటిని కూడా పసిగట్టే వీలుంది. నకిలీ ఐపీ చిరునామాలు, బోగస్‌ ఫేస్‌బుక్‌ ఐడీలతో పోస్టులు పెట్టే వారి సిమ్‌ లొకేషన్, అంతర్జాల వివరాల గుట్టును కూడా లాగనున్నారు. 

మెతకవైఖరితో విచ్చలవిడి..

అధికార పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తున్నా పలు చోట్ల పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందనే సంగతి పోలీసులు మరుస్తున్నారు. చట్టాలను ఉల్లంఘించే వైకాపా నేతలపై కేసులు పెట్టే విషయంలో మెతక వైఖరి అవలంభిస్తున్నారు. అభ్యంతరకర పోస్టులను నామమాత్రంగా తొలగించి మిన్నకుండిపోతున్నారు. చట్టం విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే.. లెక్కింపు రోజు, ఆ తర్వాత.. శాంతి, భద్రతలు అదుపులో ఉంటాయి. లేకుంటే పోలింగ్‌ రోజు చోటుచేసుకున్నట్లే అవాంఛనీయ ఘటనలు పునరావృత్తం అయ్యే ప్రమాదం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని