logo

పూడ్చకపోతే..అన్నదాతలకు కడగండ్లే

ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీటి పరిస్థితి ఏమిటని మునేరు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ భూభాగంలో కోతకు గురైన భూములకు నష్టపరిహారం చెల్లించాలని ఆ ప్రాంత రైతులు గత ఏడాది డిసెంబరులో పోలంపల్లి మట్టికట్టకు గండ్లు కొట్టిన విషయం తెలిసిందే.

Published : 27 May 2024 04:17 IST

పనులు చేసేందుకు ఇదే సమయం
మేల్కోకపోతే 16,427 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం
వత్సవాయి, పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే

ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీటి పరిస్థితి ఏమిటని మునేరు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ భూభాగంలో కోతకు గురైన భూములకు నష్టపరిహారం చెల్లించాలని ఆ ప్రాంత రైతులు గత ఏడాది డిసెంబరులో పోలంపల్లి మట్టికట్టకు గండ్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐదు నెలలైనా వాటిని అధికారులు పూడ్పించలేదు. వర్షాలు కురిసి వరద చేరితే గండ్లు పూడ్చలేని పరిస్థితి నెలకుంటుంది. వచ్చిన వరద వచ్చినట్లు దిగువకు పోతే కాలువలకు నీరందదు. ఫలితంగా సుమారు 20 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు వెంటనే స్పందించి కట్టలను బలోపేతం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఒక టీఎంసీ నిల్వ చేయాలని..

పోలంపల్లి వద్ద ఉన్న మునేరు డ్యాంకు 135 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్‌ పాలకులు మునేరులో చిన్న ఆనకట్ట  నిర్మించి 16,427 ఎకరాలకు సాగునీరు అందించారు. మూడు దశాబ్దాలుగా అప్పటి ఆనకట్టకే మరమ్మతులు చేసుకుంటూ సాగునీరు అందిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో మునేరుపై నీటి నిల్వ ప్రాజెక్ట్‌లు నిర్మించిన నేపథ్యంలో దిగువకు నీటి పారుదల తగ్గిపోయింది. గతంలో అన్నదాతలు రెండు పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఒక్క పంటకు కూడా సరిగా నీరందని పరిస్థితి నెలకొంది. వరద వచ్చినపుడు సుమారు 10 టీఎంసీల నీరు వృథాగా కృష్ణా నదిలో కలుస్తోంది. అందులో ఒక టీఎంసీని నిల్వ చేయాలనే ఉద్దేశంతో 2004లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రిటిష్‌ ఆనకట్టకు దిగువున డ్యాం నిర్మించారు. కాంక్రీటు పనులు పూర్తి చేసి గేట్లు అమర్చకుండా వదిలేశారు. అది నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం పాత ఆనకట్ట ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. 


భూములు కోతకు గురై...

2012లో వచ్చిన భారీ వరదకు కొత్త ఆనకట్ట మట్టికట్టకు గండి పడింది. దాని నుంచి వరద దిగువకు పారడంతో ఆ పక్కనే ఉన్న తెలంగాణ రైతుల భూములు కోతకు గురయ్యాయి. ఏటా వస్తున్న వరదకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. డ్యాం అసంపూర్తి పనుల వల్లే తాము నష్టపోయామని, అందుకు పరిహారం చెల్లించాలని కొంతకాలంగా వారు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది డిసెంబరులో నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడే కట్టలకు రైతులు గండి కొట్టారు. ఫలితంగా డ్యాంలో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. పంటలు ఎండిపోయాయి. సమస్య పరిష్కారానికి ఖమ్మం, ఎన్టీఆర్‌ జిల్లాల అధికారులు రంగంలోకి దిగారు. 36 ఎకరాలు కోతకు గురైనట్లు ఖమ్మం అధికారులు గుర్తించగా, ఎన్టీఆర్‌ జిల్లా అధికారులు రూ.55 లక్షల నష్ట పరిహారాన్ని అందించారు. నష్టపరిహారం చెల్లింపుపై తెలంగాణ రైతులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.


నీరు రాకుంటే పంటలు పండవు

- తమ్మినేని వెంకటేశ్వర్లు(ధర్మరాజు), రైతు, పోలంపల్లి 

డ్యాం వద్ద తెలంగాణ రైతులు కొట్టిన గండ్లకు అధికారులు వెంటనే పూడ్చాలి. వర్షాలు కురిస్తే పనులు చేయడం కుదరదు. గండ్లు పూడ్చకపోతే కాలువకు నీరు అందక పంటలు సాగు చేయలేం. 


ఇప్పటికే ఆలస్యమైంది 

- పొందూరి గోపి, రైతు, గుమ్మడిదుర్రు

ఆయకట్టులో పదెకరాల మాగాణి ఉంది. కాలువకు నీరు వస్తేనే పంటలు పండుతాయి. లేదంటే తిండి గింజలు, పశుగ్రాసానికి ఇబ్బందులు తప్పవు. అధికారులు ఇప్పటికే ఆలస్యం చేశారు. వెంటనే స్పందించాలి.


సమస్య పరిష్కారానికి కృషి

- రామకృష్ణ, మునేరు ప్రాజెక్ట్‌ డీఈ

తెలంగాణ రైతులకు నష్టపరిహారం చెల్లించాం. మరికొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కరించి గండ్లు పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. నీరు అందిస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు