logo

ఏ1, ఏ3లను కలిపిన విజయవాడ బంధం

బెంగళూరులో పరిచయమైన వారిద్దరినీ విజయవాడ బంధం కలిపింది. రేవ్‌ పార్టీలు, మత్తుమందులతో ఖుషీ చేసుకునే వీరు..

Updated : 25 May 2024 08:12 IST

నాగబాబు 

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-చిట్టినగర్‌: బెంగళూరులో పరిచయమైన వారిద్దరినీ విజయవాడ బంధం కలిపింది. రేవ్‌ పార్టీలు, మత్తుమందులతో ఖుషీ చేసుకునే వీరు.. చివరకు ఇటీవల బెంగళూరు ఫామ్‌హౌస్‌లో పోలీసులకు దొరికిపోయారు. ఇద్దరి స్వస్థలం విజయవాడలోని కొండ ప్రాంతమే. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి లంకలపల్లి వాసుది ఆంజనేయవాగు ప్రాంతం. ఏ3గా బెంగళూరు పోలీసులు పేర్కొన్న దొమ్మేటి నాగబాబుది వన్‌టౌన్‌ మల్లికార్జునపేట సమీపంలోని ఆకులవారివీధి. వీరిద్దరూ అరెస్టయి ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. నాగబాబు తండ్రి పెయింటింగ్‌ మేస్త్రీగా, ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా చేస్తున్నారు. నాగబాబుకు ఇంకా పెళ్లి కాలేదు. బీటెక్‌ చదివి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. రేవ్‌పార్టీ సూత్రధారి వాసు, నాగబాబుకు బెంగళూరులోనే పరిచయమైనట్లు సమాచారం. ఈ నెల 19న రాత్రి బెంగళూరు శివారులో వాసు పుట్టినరోజు సందర్భంగా ఏ2 అయిన అరుణ్‌కుమార్‌ రేవ్‌ పార్టీ ఏర్పాటుచేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ పార్టీకి విజయవాడకు చెందిన ఏ3 నాగబాబు, చిత్తూరు జిల్లాకు చెందిన ఏ4 రణధీర్‌బాబుతో కలసి ఎండీఎంఏ, కొకైన్, లిక్విడ్‌ గంజాయి తీసుకొచ్చారు. బెంగళూరు పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసినప్పుడు.. నాగబాబు కారులో మత్తుపదార్థాలు దొరికాయి. దీంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని