logo

Crime News: రూ.1.5 కోట్లకు కుచ్చుటోపీ.. నమ్మించి మోసం చేసిన మహిళ

ఆర్థిక అవసరాలను ఎరగా చూపి వారికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకొని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో వెలుగు చూసింది.

Updated : 25 May 2024 07:47 IST

బాధితుల వేదన 

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే : ఆర్థిక అవసరాలను ఎరగా చూపి వారికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకొని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో వెలుగు చూసింది. ఈ ఘటనలో సుమారు రూ.1.5 కోట్ల వరకు మాయలేడి కాజేసినట్లు సమాచారం. బాధితుల వివరాల ప్రకారం.. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో లీలావతి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె పలు బ్యాంకుల సిబ్బందితో మాట్లాడి పలువురికి రుణాలు ఇప్పించింది. అలాగే మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులతోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్లో రుణాల కోసం పలు గ్రూపులను తయారు చేసింది. మంజూరయ్యే రుణంలో కొంత సొమ్ము తనకు ఇస్తే తిరిగి ఇచ్చేస్తానంటూ పలువురికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. అలా మెల్లగా వారి సొమ్ములు కాజేయడం ప్రారంభించింది. సుమారు 60 పైగా గ్రూపులను ప్రారంభించి వాటిలోని సభ్యుల నుంచి రూ.1.5 కోట్ల వరకు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. చాలా మందికి చెందిన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టి విడిపించలేదని వారు వాపోతున్నారు. తమ డబ్బుల గురించి అడిగితే బ్యాంకులకు కడతానని చెప్పిందని, కానీ కట్టలేదన్నారు.

హైదరాబాద్‌లో లీలావతి ఇంటి ఎదురుగా మహిళల నిరసన 

దీంతో బ్యాంకు సిబ్బంది తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 మందికి పైగా బాధితులు ఆమెకు డబ్బులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో లీలావతి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. లీలావతి ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటోందని తెలిసి పలువురు అక్కడకు వెళ్లారు. ఆమె ఇంటి వద్ద ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. ఒక మైక్రో ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధికి చెందిన 3 కాసుల ఛైన్‌ రూ. 65 వేలకు తాకట్టు పెట్టి పరారైందన్నారు. లీలావతి బాధితులు బాపూజినగర్, లక్ష్మీనగర్‌ కాలనీ, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టిడ్కో కాలనీ, జగనన్న కాలనీ తదితర ప్రాంతాల్లో బాధితులు ఉన్నారు. దీనిపై తాలూకా ఎస్సై ఎన్‌.లక్ష్మీనరసింహమూర్తి మాట్లాడుతూ బాధితులు రెండు రోజులుగా లీలావతి అనే మహిళ మోసం చేసిందని తిరుగుతున్నారని, పూర్తి ఆధారాలతో రావాలని వారికి సూచించామన్నారు. వారంతా కలిసి వస్తానన్నారని వారు రాగానే కేసు నమోదు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని