logo

అడ్డొస్తే కొట్టేయ్‌.. అడగరులే కట్టేయ్‌.. వైకాపా నేతల బరితెగింపు

‘‘విజయవాడ నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. అది ప్రభుత్వానిదైనా, ప్రైవేటుదైనా.. కబ్జా చేసేయ్‌.. రాత్రికి రాత్రి నిర్మాణం మొదలెట్టేయ్‌.. ఎవరైనా అడ్డొస్తే.. కొట్టి పడేయ్‌..’’ అన్నట్టుగా కొందరు వైకాపా నాయకులు, అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

Updated : 24 May 2024 08:07 IST

మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలో దౌర్జన్యం
బహిరంగంగానే కార్పొరేటర్‌ భర్త బెదిరింపులు
ఈనాడు, అమరావతి

వివాదాస్పద స్థలంలో నిర్మాణం చేపడుతున్నారిలా..

‘‘విజయవాడ నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. అది ప్రభుత్వానిదైనా, ప్రైవేటుదైనా.. కబ్జా చేసేయ్‌.. రాత్రికి రాత్రి నిర్మాణం మొదలెట్టేయ్‌.. ఎవరైనా అడ్డొస్తే.. కొట్టి పడేయ్‌..’’ అన్నట్టుగా కొందరు వైకాపా నాయకులు, అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలో లియాఖత్‌ అలీ అనే పేద ముస్లిం స్థలాన్ని కొద్దికాలం కిందట వైకాపాకు చెందిన ముస్లిం మైనార్టీ మహిళా కార్పొరేటర్‌ భర్త సహకారంతో ఓ ప్రముఖుడు కబ్జా చేశారు. దొంగపత్రాలతో రాత్రికి రాత్రి నిర్మాణం ఆరంభించారు. అలాగే సత్యనారాయణపురం లక్ష్మీనగర్‌లో ఓ వృద్ధురాలు గండూరి విజయలక్ష్మి స్థలాన్ని కూడా వైకాపాకు చెందిన ఓ కీలక నేత కొన్నాళ్ల కిందట కబ్జా చేశారు. దొంగ పత్రాలు సృష్టించి, అధికారుల అండతో దర్జాగా నిర్మాణం కట్టేస్తున్నారు. ప్రధానంగా నగరపాలకలో కొందరు కక్కుర్తి అధికారుల సహకారంతో ఆస్తిపన్ను, అసెస్‌మెంట్‌ నంబర్లను నకిలీవి సృష్టించి మరీ కబ్జాలకు పాల్పడుతున్నారు. బాధితులు లబోదిబోమని ఠాణాలు, కోర్టులను ఆశ్రయిస్తున్నా.. తమ స్థలాలను వెనక్కి తెచ్చుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా ఆస్తి, నీటి పన్నులు కడుతున్న వాటిని సైతం.. దొంగపత్రాలతో కబ్జాలు చేస్తున్నారంటే.. వైకాపా నేతలు, అక్రమార్కులు ఎంతగా బరితెగించారో అర్థమవుతోంది.

తనదని అడగడమే నేరమన్నట్లు..

లియాఖత్‌అలీ... ఈయన తండ్రి మహమ్మద్‌ అబ్దుల్‌ పహాబ్‌ రెవెన్యూ విభాగంలో తహసీల్దారుగా పనిచేసేవారు. 1977లో ది రెవెన్యూ ఎంప్లాయీస్‌ కో ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ విజయవాడ (రిజిస్టర్‌ నంబరు: జి-2526) ఏర్పాటైంది. 1979లో సొసైటీ ఆధ్వర్యంలో ఆర్‌.ఎస్‌.నంబరు: 22లో మొగల్రాజపురంలో కొంత స్థలం కొని లేఔట్‌ వేసి ప్లాట్లుగా విభజించారు. వాటిని రెవెన్యూ ఉద్యోగులు కొన్నారు. దీనిలో 281 చదరపు గజాల ప్లాటు నెంబరు 38ను మహమ్మద్‌ అబ్దుల్‌ పహాబ్‌కు కేటాయించారు. ఆ స్థలంలో రేకుల ఇల్లు కట్టుకున్నారు. నగరపాలక సంస్థ డోర్‌ నెం.40-6/1-8, వార్డు నెం.28బి, అసెస్‌మెంట్‌ నెం.2641ఓఎన్, వాటర్‌ టాప్‌ నెం.11999 కేటాయించింది. అప్పటి నుంచి పన్నులు చెల్లిస్తున్నారు. 1995లో అబ్దుల్‌ వహాబ్‌ మరణించారు. అక్కడే కొంతకాలం ఉన్నా.. ఆ తర్వాత లియాఖత్‌అలీ, అతని భార్య అనారోగ్యంతో విద్యాధరపురంలో యుద్దనపూడివారి వీధికి మారారు. తరచూ వచ్చి స్థలాన్ని చూసుకునేవాళ్లు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట వచ్చి చూస్తే.. స్థలం చుట్టూ ప్రహరీ గేటు తొలగించి, చెట్లను నరకడం కనిపించింది. ఇదేంటని నిలదీస్తే.. నగరంలో ఓ బంగారు నగల దుకాణ యజమాని ఇది తన స్థలమని.. కిరాయి మూకలను పెట్టి లియాఖత్‌ అలీని కొట్టించారు.

ఆపడానికి వస్తే తంతానని...

అధికారుల నుంచి నేతల వరకు అందరికీ.. భారీగా ముట్టజెప్పి ఆక్రమణదారు దర్జాగా లియాఖత్‌అలీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. కోర్టులు ఆదేశించినా.. కనీసం అటువైపు కూడా అధికారులెవరూ చూడడం లేదు. పైగా.. ‘ఈ స్థలం వైపు ఎవరైనా వస్తే.. అంతుచూస్తా. ఎవరూ పనులు ఆపడానికి రారు, వస్తే తంతా’ అని కబ్జాలో కీలక సూత్రధారి, పక్క డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త బహిరంగంగానే బెదిరిస్తున్నాడు. నడిరోడ్డుపై నిలబడి.. బాధితులను బెదిరిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నా.. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదు.

దొంగ పత్రాలను సృష్టించి..

రెవెన్యూ కాలనీలో లియాఖత్‌ అలీ స్థలానికి ఎదురుగా ఉన్న ఇంటి నెం.40-6/1-14, గురునానక్‌కాలనీలో ఓ ఇంటి అసెస్‌మెంట్‌ నెం.277558ను వేసి తప్పుడు పత్రాలతో బంగారు నగల దుకాణం యజమాని పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ కబ్జా వెనుక వైకాపా ముస్లిం మైనార్టీ మహిళా కార్పొరేటర్‌ భర్త, రెవెన్యూ సొసైటీకి చెందిన ఓ వ్యక్తి, నగరపాలకలోని ఓ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌.. కీలకంగా వ్యవహరించినట్టు తెలుసుకుని.. లియాఖత్‌అలీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము ఇంటిపన్ను కడుతున్న స్థలానికి మరో నంబరు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీంతో కబ్జాదారులు కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు. మళ్లీ తెరవెనుక వ్యవహారం నడిపించారు. బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహకారంతో తప్పుడు ఇంటి నంబరు, అసెస్‌మెంట్‌పై పన్ను చెల్లించినట్టు చూపించి.. భవన నిర్మాణానికి అనుమతి పొందారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగానే.. నిర్మాణం మొదలెట్టడం ఏంటని లియాఖత్‌అలీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. మళ్లీ కొట్టారు. దీంతో బాధితుడు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశంతో మాచవరం పోలీసులు కేసు (ఎఫ్‌ఐఆర్‌.నం. 118/2024) నమోదు చేశారు. అయినా.. నిర్మాణం ఆపకుండా రాత్రికి రాత్రి రెండు అంతస్తులు కట్టేశారు. బాధితుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.

న్యాయం చేయండి: లియాఖత్‌అలీ

బాధితుడు లియాఖత్‌ అలీ

నా స్థలాన్ని ఇంత దౌర్జన్యంగా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. మేం దశాబ్దాలుగా ఇంటి, నీటి పన్ను కడుతున్నాం. అయినా.. దర్జాగా దొంగ పన్నులు సృష్టించి.. ఇంటి నిర్మాణానికి కూడా నగరపాలక అనుమతులు తెచ్చుకున్నారు. నగరంలో పేద, సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని