logo

క్షణ క్షణం.. భయం భయం

అదో చారిత్రక వైద్య విద్యాలయం. ఎందరో విద్యార్థులు అందులో చదువుకొని నేడు ఎంతో మందికి సేవ చేస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పాటైన ఈ కళాశాల భవనం నేడు శిథిలావస్థకు చేరింది.

Updated : 06 Aug 2022 06:42 IST

శిథిలావస్థలో ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల

న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం

అదో చారిత్రక వైద్య విద్యాలయం. ఎందరో విద్యార్థులు అందులో చదువుకొని నేడు ఎంతో మందికి సేవ చేస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పాటైన ఈ కళాశాల భవనం నేడు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో..  గత్యంతరం లేక ఆ భవనంలోనే బిక్కుబిక్కుమంటూ తరగతులు నిర్వహిస్తున్నారు. నూతన భవన నిర్మాణానికి నిధులోచ్చినా పనులు పూర్తికాకపోవడంతో పెచ్చులూడి పడుతున్న భవనంలోనే పాఠాలు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది.

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్‌లో ఆంధ్ర ప్రొవిన్షియల్‌ హోమియోపతిక్‌ వైద్య కళాశాల, హోమియో ఆసుపత్రిని స్వాతంత్య్రానికి ముందు 1945లో ప్రారంభించారు. తర్వాత కాలంలో కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎమ్‌.గురురాజు పేరు మీద డాక్టర్‌ గురురాజు ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలగా రూపాంతరం చెందింది. దేశంలోనే ఈ ఆస్పత్రి ఎంతో కీర్తి గడించింది. యూజీ, పీజీ కోర్సులు గల ఈ ప్రభుత్వ వైద్య కళాశాల నేడు విద్యార్థులకు కనీసం కూర్చోవడానికి సురక్షితమైన ప్రదేశం లేక కునారిల్లుతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా కళాశాల ఉండగా అందులోనే తరగతి గదులు నిర్వహిస్తున్నారు. కొన్ని తరగతి గదులు, ప్రయోగశాలలు శిథిలమై ఇప్పటికే మూతబడ్డాయి. ఈ క్రమంలో తరగతి గదులు చాలక పక్కనే ఉన్న ప్రాంతీయ హోమియో పరిశోధనా సంస్థ (ఆర్‌ఆర్‌ఐ)లో ఉన్న పీజీ విద్యార్థులతో కలిసి యూజీ విద్యార్థులు కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాల భవనం శిథిలమవడంతో కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకోగా 2017లో నిధులు మంజూరు చేశారు.

పైకప్పు పడిపోకుండా ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు

సగంలో ఆగిన పనులు: కొత్త భవనం నిర్మాణం కోసం ఆయుష్‌ మంత్రిత్వ శాఖ రూ.18 కోట్లు మంజూరు చేసింది. మార్చి 2017లో అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అయినా నేటికీ నిర్మాణం పూర్తికాలేదు. దీంతో విద్యార్థుల కష్టాలు రెట్టింపయ్యాయి. 15 నెలల్లో పూర్తి చేస్తామని పనులు ప్రారంభించిన గుత్తేదారు కొంత కాలంగా పనులు ఆపేశారు. కొవిడ్‌ ప్రభావం, ఇసుక, సిమెంట్‌ ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల గతంలో నిర్ణయించిన ధరలకు నిర్మించలేమని.. పెరిగిన ధరలకనుగుణంగా నిర్ణయించాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దానికి అంగీకరించకపోవడంతో పనులు సగంలోనే ఆగిపోయాయి.

ప్రభుత్వానికి తెలియజేశాం
విద్యార్థుల క్షేమం దృష్ట్యా పలు తరగతి గదులు మూసి వేసి వేరే చోట తరగతులు నడుపుతున్నాం. కొత్త, పాత భవనాల పరిస్థితిపై ఆయుష్‌ కమిషనర్‌కు తెలియజేశాం. పెథాలజీ, ఫార్మసీ ల్యాబ్‌లలో పైకప్పు ధ్వంసం కాగా వాటిని కూడా మూతవేసి మరో చోట పనులు చేయిస్తున్నాం.
- డాక్టర్‌ డి.రమాదేవి, కళాశాల ప్రిన్సిపల్‌

ఫార్మసీ ల్యాబ్‌లో ఊడి పడిన పెచ్చులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని