logo

నీళ్లన్నీ మాకే వదలాలి

తూర్పు కృష్ణాలో కీలకమైన కౌతవరం నీటి పారుదల లాకుల వద్ద సాగునీటి విడుదలపై వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారు.

Published : 01 Dec 2023 03:24 IST

అధికారులపై కైకలూరు వైకాపా ఎమ్మెల్యే ఒత్తిడి

క్యాంప్‌బెల్‌ కాల్వలో ప్రవహిస్తున్న నీరు

కౌతవరం(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: తూర్పు కృష్ణాలో కీలకమైన కౌతవరం నీటి పారుదల లాకుల వద్ద సాగునీటి విడుదలపై వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రైవస్‌(పుల్లేరు) కాల్వకు నీటి సరఫరా నిలిపివేయడంతో కౌతవరం లాకులకు నీరు రాక బుధవారం సాయంత్రం వారాబందీలో ఇస్తున్న నీటిని పూర్తిగా నిలిపివేశారు. ఎగువ నుంచి వచ్చింది 40 క్యూసెక్కులే. అది ఏ మూలకు చాలదు. దీంతో నిబంధనల ప్రకారం లాకుల హెడ్‌ వద్ద బెడ్‌ లెవల్‌ను నిర్వహించాల్సి ఉంది. కానీ బుధవారం రాత్రి ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) ఇరిగేషన్‌ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడంతో రాత్రికి రాత్రి కైకలూరు నియోజకవర్గానికి నీరు వెళ్లే పోల్‌రాజ్‌ కాల్వ లాకు షట్టర్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. గురువారం ఉదయం మూసివేసి మళ్లీ కైకలూరు నియోజకవర్గానికే వెళ్లే క్యాంప్‌బెల్‌ కాల్వకు నీటిని విడుదల చేశారు. లాకుల వద్దకు గురువారం దాదాపు 50 క్యూసెక్కులు రాగా అధికారులు దాన్నే విడుదల చేస్తున్నారు. ఎంత వస్తే అంత మా కాల్వలకే ఇవ్వాలని ఎమ్మెల్యే డీఎన్నార్‌ నీటిపారుదల అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కాల్వకు తక్కువ నీరు ఉన్నప్పుడు హెడ్‌ వద్ద బెడ్‌లెవల్‌ నిర్వహించాలి. దీని వలన కాల్వకు ఇరువైపులా ఉండే గ్రామాల ప్రజల అత్యవసరాలకు, అగ్నిప్రమాదాల సమయంలో ఆ నీటిని వినియోగిస్తారు. కానీ ఉన్న కాస్త నీరంతా తమ ప్రాంతానికే వదలాలంటూ వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడి తేవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని