logo

కదలనున్న అక్రమాల డొంక

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహకార గృహనిర్మాణ సంఘంలో వెలుగుచూసిన అక్రమాలు నిగ్గు తేలనున్నాయి.

Published : 01 Dec 2023 03:29 IST

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహకార గృహనిర్మాణ సంఘంలో వెలుగుచూసిన అక్రమాలు నిగ్గు తేలనున్నాయి. భూముల కొనుగోలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంపు డ్యూటీ బాదుడు, విచ్చలవిడి ఖర్చులు, తదితర అంశాలపై ‘ఈనాడు’లో ‘ఇల్లు లేదు.. ఘొల్లే!’, ‘ఖాతాకు కంతలు.. కళ్లకు గంతలు..!’ శీర్షికన వచ్చిన వరస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటికి సహకార శాఖ ఉన్నతాధికారులు స్పందించి లోతైన విచారణకు ఆదేశించారు. ఏపీ మ్యాక్స్‌ చట్టంలోని సెక్షన్‌ 29 కింద సమగ్ర విచారణకు సహకార సంఘాల రిజిస్ట్రార్‌ బాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ సబ్‌డివిజనల్‌ సహకార అధికారి ఎస్‌.శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. 120 రోజుల్లో విచారణ పూర్తి చేసి, నివేదికను అందజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా సహకార అధికారి గురువారం హౌసింగ్‌ సొసైటీకి నోటీసు అందజేశారు.

ప్రాథమిక విచారణలో ఆధారాలు

సంఘంలో చోటుచేసుకున్న అక్రమాలపై జిల్లా సహకార శాఖ అధికారి రెండు నెలల క్రితం ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. అందులో పలు అక్రమాలు జరిగినట్లు తేలింది. సభ్యులకు వివిధ ధరలకు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌, 41 ప్లాట్లను సభ్యులు కాని వారికి రిజిస్ట్రేషన్‌, 26 ప్లాట్లను కలిదిండి కన్సెల్టెంట్లకు కేటాయింపు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుము, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ పేరుతో అధిక వసూళ్లు, తదితర అంశాలపై డీసీవో జరిపిన ప్రాథమిక విచారణలో అవకతవకలు జరిగినట్లు బయటపడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలోని శ్రీహరిపురం లేఔట్‌ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని