logo

చెదిరిన సొంతింటి కల

పేరుకే సహకార సంఘం.. కానీ అడుగడుగునా అక్రమాలే. ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకారసంఘంలో పారదర్శకత నేతిబీర చందంగా మారింది.

Updated : 01 Dec 2023 05:30 IST

పాలకవర్గం మాయమాటలతో నిండా మునిగారు
ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీలో సభ్యుల పాట్లు

హౌసింగ్‌ సొసైటీ లేఔట్‌

ఈనాడు, అమరావతి: పేరుకే సహకార సంఘం.. కానీ అడుగడుగునా అక్రమాలే. ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంఘంలో పారదర్శకత నేతిబీర చందంగా మారింది. సీఆర్డీఏ తనఖాలో ఉన్న ప్లాట్లను చూపించి త్వరలో రిజిస్ట్రేషన్‌ చేస్తామని 72 మంది సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అటు తనఖా నుంచి విడుదల కాక, ఇటు ప్లాట్లు దక్కక సభ్యులు నిండా మునిగారు. దీంతో వారు లబోదిబోమంటున్నారు. రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటుందని వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బు లేకపోయినా చాలా మంది అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించినా అక్కరకు రాలేదు.

తూతూమంత్రంగానే నిర్వహణ

సమావేశాలు నిర్వహించకుండానే.. పూర్తి అయినట్లే సంతకాలు సేకరించుకునేవారు. కొన్ని పాలకవర్గ సమావేశాల్లో ఒక్క అధ్యక్షుడి సంతకం మాత్రమే ఉండడాన్ని ఐదు నెలల క్రితం విచారణాధికారి ఇచ్చిన నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. గత నెలలో జరిగిన మహాజన సభలో తీర్మానాలపై జరిగిన చర్చ సందర్భంగా ఆ సమయంలో ఉన్న 145 మంది సభ్యులు వార్షిక బడ్జెట్‌ మినహా అన్నింటినీ ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. అనుకూలంగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. సమావేశం తీరును పర్యవేక్షించేందుకు వచ్చిన పరిశీలకుడు కూడా వ్యతిరేకంగా ఓటు వేసిన వారి సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కలెక్టర్‌కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కానీ 1,035 మంది హాజరులో సంతకాలు చేశారు. ఓటింగ్‌ సమయంలో హాలులో ఉన్న అందరూ వ్యతిరేకంగా ఓటేశారు. హాలులో లేకపోయినా హాజరుపట్టికలోని సంతకాల ఆధారంగా వారు అనుకూలంగా ఓటు వేసినట్లు పరిగణనలోకి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హాజరు సంతకాల సేకరణ విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు పెద్దఎత్తున విమర్శలు ఉన్నాయి. రిజిస్టర్‌లో కాకుండా విడి కాగితాలపై తీసుకున్నారు. పెద్దఎత్తున బోగస్‌ సభ్యులను ప్లాట్ల యాజమానులు గుర్తించి ప్రశ్నించడంతో పలాయనం చిత్తగించారు.

ప్రశ్నిస్తే గొంతునొక్కుడే

గజానికి అదనంగా చెల్లించాలని ఈ ఏడాది మార్చిలో నోటీసు రావడంతో సభ్యులు ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో అనేక అక్రమాలు, లొసుగులు బయటకు వచ్చాయి. అక్రమాలపై విచారణ నిర్వహించమని సంఘం సభ్యులు సహకార శాఖ అధికారులకు వినతులు చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్‌ కలెక్టర్‌కు స్పందనలోనూ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా సహకార అధికారిని పిలిచి వివరణ కోరారు. నిధుల దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమే అని డీసీవో కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాలపై ప్రశ్నిస్తున్న 27 మందిని నాలుగు రోజుల క్రితం తొలగించారు. తొలగింపు అంశాన్ని ఇటీవల జరిగిన మహాజన సభలో టేబుల్‌ ఎజెండాగా చర్చించారు. సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధ్యక్షుడు తనంతట తానే ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చకుండా ఉపసంహరించుకున్నారు.

అలా నెట్టుకొస్తున్నారు

ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసిన మూడేళ్ల తర్వాత తిరిగి నష్టం పేరుతో అప్పటికే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిని అదనంగా సొమ్ము చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. ఇది అక్రమం అని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ పాలకవర్గ సభ్యుల్లోనూ దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పాలకవర్గ సభ్యుడు ఇప్పటికే రాజీనామా చేశారు. మొత్తం 15 మంది సభ్యులకు గాను ఆరు ఖాళీలు ఉన్నాయి. తొమ్మిది మందితోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్నారు. ఖాళీల భర్తీకి గతంలో ఎన్నికల ప్రకటన జారీ అయింది. ఓటరు జాబితాలో అవకతవకలు ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతో ఎన్నికల అధికారి బాధ్యతల నుంచి వైదొలిగారు. మళ్లీ ఇటీవల ఎన్నికల ప్రకటన ఇచ్చారు. స్వల్ప మార్పులతో అనర్హులకు కూడా ఇందులో చోటు కల్పించడం కొసమెరుపు. ఈ ఎన్నికల నేపథ్యంలో పాలకవర్గం అక్రమాలను ప్రశ్నిస్తున్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా తొలగించారు.


అదిగో.. ఇదిగో అంటూ దాటేస్తున్నారు

బాపిరాజు, ఉపాధ్యాయుడు, భీమవరం, పశ్చిమ గోదావరి

నేను 2018లో ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీలో సభ్యుడిగా చేరా. రాజధాని అమరావతికి సమీపంలో ఉందని 244 చదరపు గజాల విస్తీర్ణం ప్లాట్‌ను తీసుకున్నా. దీని కోసం విడతల వారీగా రూ.6.71 లక్షలు చెల్లించా. తర్వాత డ్రాలో నాకు వచ్చిన ప్లాట్‌ విస్తీర్ణం తగ్గింది. మరో ప్లాట్‌ కోసం పాలకవర్గాన్ని అడిగా. రెండు, మూడు నెలల్లో క్లియర్‌ అవుతుందని సీఆర్డీఏ తనఖా ప్లాట్‌ను 2021లో కేటాయించారు. మార్చిన తర్వాత మరో విడత రూ.4లక్షలు చెల్లించా. ఇలా మొత్తం 10.71 లక్షలు ప్లాట్‌ కోసం కట్టా. ఇంత వరకు తనఖా నుంచి ప్లాట్‌ విడుదల కాలేదు. ఎప్పుడు అడిగినా నెల, రెండు నెలలు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఆ తర్వాత ఫోన్‌ ఎత్తడమే మానేశారు. నా డబ్బు ఇక్కడ నిలిచిపోవడంతో, మా అబ్బాయి చదువులకు అప్పు చేయాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని