logo

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ కావాలని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ ఆకాంక్షించారు.

Published : 01 Dec 2023 03:41 IST

వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌

డిజిటల్‌ ప్రచార రథానికి జెండా ఊపుతున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌, పక్కనే కలెక్టర్‌ రాజబాబు తదితరులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ కావాలని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ ఆకాంక్షించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండల పరిధిలోని సుల్తానగరం సుమ కన్వెన్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల్లో సంక్షేమ ప్రయోజనాలు పొందని వారిని గుర్తించడం, లబ్ధి పొందిన వారి అనుభవాలు పంచుకోవడం, పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా గ్రామ, పట్టణ స్థానిక సంస్థల్లో వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమం చేపట్టారన్నారు. 2047 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు పూర్తయ్యే నాటికి ప్రధాని నరేంద్రమోదీ తరచూ చెబుతున్నట్లు దేశం అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతోపాటు ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపడి, అభివృద్ధి విషయంలో నగరాలు, గ్రామాల మధ్య అంతరం తొలగిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర డిజిటల్‌ ప్రచార రథాన్ని గవర్నర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర పథకాలపై సంబంధిత విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సందర్శించారు. నానో ఎరువులు, పురుగుమందులను డ్రోన్ల ద్వారా పంటలపై పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ ఆధ్వర్యాన ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన వారితో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్‌ రాజబాబు మాట్లాడుతూ జనవరి 26వ తేదీ వరకూ జిల్లాలోని 491 గ్రామాలతోపాటు నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల్లో 5 ప్రచార వాహనాల ద్వారా సంకల్పయాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయల శాఖ కార్యదర్శి జి.లక్ష్మీశా కేంద్ర పథకాల అమలు వివరించారు. జడ్పీ ఛైరపర్సన్‌ ఉప్పాల హారిక, కేడీసీసీ బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ తాతినేని పద్మావతి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, మచిలీపట్నం మేయర్‌ చిటికెన వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని