logo

పాతాళానికి గంగమ్మ

ఇష్టానుసారంగా సాగుతున్న భూగర్భజల వినియోగం ప్రమాదకర పరిస్థితులకు చేరువ చేస్తోంది.

Updated : 01 Dec 2023 05:27 IST

మరో 4 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఇష్టానుసారంగా సాగుతున్న భూగర్భజల వినియోగం ప్రమాదకర పరిస్థితులకు చేరువ చేస్తోంది. సాగునీటి కొరత, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్వోప్లాంట్‌లు, విచక్షణా రహితంగా చేస్తున్న ఆక్వాసాగు, వర్షాభావ పరిస్థితులు... వంటి కారణాలు భూగర్భజల మట్టాలను పాతాళానికి పడిపోయేలా చేస్తున్నాయి. కాలానుగుణంగా పెరుగుతున్న వ్యవసాయ, పారిశ్రామిక, జనావాసాలకు అనుగుణంగా ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యత లేకపోవడంతో భూగర్భ జలాలే దిక్కవుతున్న పరిస్థితి భవిష్యత్తుకు పెనుశాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కృష్ణా డెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 7.36 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. కృష్ణా పరిధిలో వరి సాగే ఎక్కువగా ఉన్నా ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఎక్కువ శాతం మెట్టభూములు కావడంతో తక్కువ విస్తీర్ణంలో వరితో పాటు పత్తి, మిరప, మినుము, పెసర వంటి పంటల సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కృష్ణాతో పోలిస్తే ఉద్యాన పంటల సాగు ఎక్కువగానే ఉంది. మొత్తం సాగు అవసరాలకు అనుగుణంగా నీటి ప్రాజెక్టుల నుంచి సక్రమంగా నీరు ఇవ్వకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలను కాపాడుకునేందుకు భూగర్భజలాలే దిక్కయ్యాయి.

జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు పైబడి ఆక్వా సాగు ఉంది. సాధారణంగా ఉండే సాగునీటి కొరత కారణంగా అత్యధికశాతం చెరువులను నింపేందుకు భూగర్భ జలాలే అవసరమవుతున్నాయి. మరో పక్క జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆక్వా ప్లాంట్‌లన్నీ ఇష్టానుసారం భూగర్భజలాలను తోడేస్తున్నాయి. ఖరీఫ్‌సాగు ప్రారంభం నుంచి సాగునీటి సరఫరా సక్రమంగా లేదు. వర్షాభావ పరిస్థితులు వెంటాడడంతో పంటలను కాపాడుకునే క్రమంలో భూగర్భ జలాల వాడకం గరిష్ఠస్థాయికి పెరిగింది. అవసరాలకు అనుగుణంగా భూగర్భ జలాన్ని వాడుకుంటున్నా వాటిని పరిరక్షించుకునే చర్యలు లేకపోవడం సమస్యాత్మకం అవుతోంది.

యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో చల్లపల్లి చక్కెర కర్మాగారం ఆధ్వర్యాన భూగర్భ జలాలు ఛార్జింగ్‌ చేసుకునేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. కర్మాగారం మూతపడ్డాక పట్టించుకున్న నాధులే లేరు. ప్రకాశం బ్యారేజీ దిగువకు వరద సమయంలో మినహా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు బ్యారేజీ దిగువన నదీ పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు భూగర్భజలాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఫలితంగా సహజంగా 15 నుంచి 20 అడుగుల్లో ఉండాల్సిన నీటి ఊటలు కనుమరుగయ్యాయి. ప్రతి ఏడాది నీటి మట్టం పడిపోతుండడంతో సాధారణ మోటార్ల స్థానంలో సబ్‌మెర్సిబుల్‌ మోటార్లు వాడుకోవాల్సి వస్తోంది. మున్ముందు అవికూడా పనిచేస్తాయో లేదో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

గత ఏడాదితో పోలిస్తే...

గత ఏడాదితో పోలిస్తే కృష్ణా జిల్లా పరిధిలోని ఎనిమిది మండలాల పరిధిలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కల్గించే స్థాయికి చేరుకుంది. భూగర్భ జలవనరుల శాఖ లెక్కల ప్రకారం గడచిన నెలలో ఉయ్యూరు, తోట్లవల్లూరు, అవనిగడ్డ, ఘంటసాల, పమిడిముక్కల, పెనమలూరు, గన్నవరం, బాపులపాడు, నందివాడ, పెడన మండలాల్లోని కొన్ని గ్రామాల్లో 2 మీటర్ల నుంచి 4.50 మీటర్లకు జలమట్టం దిగిపోయింది. భూగర్భజలాలను నిత్యావసరాలకు ఎక్కువగా వినియోగించే కానూరు గ్రామ పరిధిలో కొన్ని చోట్ల దాదాపు 23 మీటర్ల లోతుకు వెళితేనే సాధారణ జల ఆనవాళ్లు కన్పిస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మెట్టప్రాంతం ఎక్కువగా ఉండే ఎన్టీఆర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవే ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాగు, సాగు నీటికి ఇబ్బందులు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు