logo

ప్రయాణికులు లేక బస్సులు రద్దు

మిగ్‌జాం తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం ఆర్టీసీ సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు.

Published : 06 Dec 2023 04:19 IST

ఎన్టీఆర్‌ జిల్లాలో 17 శాతం...
కృష్ణాలో 20 శాతం సర్వీసుల నిలిపివేత
ఈనాడు - అమరావతి

మిగ్‌జాం తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం ఆర్టీసీ సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీనికి తోడు పలు మార్గాల్లో రోడ్లపై నీరు రావడంతో ఆర్టీసీ అధికారులు సర్వీసులు రద్దు చేశారు. ఇతర రూట్లలో డిమాండ్‌ లేని కారణంగా సంఖ్యను కుదించారు. కొన్ని మార్గాల్లో అయితే బస్సులు పరిమితంగానే తిరుగుతున్నాయి. నడుస్తున్న సర్వీసుల్లోనూ ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.

కీలక మార్గాల్లోనూ... ఎన్టీఆర్‌ జిల్లాలో నిత్యం 823 ఆర్టీసీ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తుంటాయి. తుపానువేళ మంగళవారం 140 సర్వీసులను రద్దు చేశారు. డిమాండ్‌ లేక 17 శాతం బస్సులను నడపలేదు. సూళ్లూరుపేట - చెన్నై మార్గంలో రహదారి పైకి నీరు చేరడంతో పాటు చెన్నై నగరం నీట మునగడంతో రెండు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. బెంగళూరు నగరానికి రోజూ 8 సర్వీసులు తిరుగుతుంటాయి. నెల్లూరు, తిరుపతి రూట్‌లో వివిధ ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో పాక్షికంగా మూడు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఆపేశారు. విజయవాడ నుంచి గుంటూరుకు నాన్‌-స్టాప్‌ ఏసీ బస్సులు నిత్యం 9 నడుస్తుంటాయి. ఈదురుగాలుల తీవ్రతకు ఏసీ సర్వీసులకు డిమాండ్‌ బాగా తగ్గింది. దీంతో ఈ రూట్‌లో బస్సులను రద్దు చేశారు.

  • విద్యా సంస్థలకు సోమ, మంగళవారాలు సెలవులు ప్రకటించడంతో ఈ ప్రభావం ఆర్టీసీపై పడింది. జగ్గయ్యపేట డిపో నుంచి పరిసర ప్రాంతాలకు 10 పల్లెవెలుగు బస్సులను రద్దు చేశారు. విజయవాడ నగరంలోనూ సిటీ బస్సు సర్వీసులను తగ్గించారు. నిత్యం నగరం, శివారు ప్రాంతాలకు 380 సిటీ సర్వీసులు తిరుగుతుంటాయి. భారీ వర్షాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి నగరానికి షాపింగ్‌, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గడంతో సిటీ బస్సులకు డిమాండ్‌ కనిపించలేదు. దీంతో మంగళవారం 80 సర్వీసులను రద్దు చేశారు. రూట్‌ నెంబరు 10, 48, 23లో షెడ్యూల్స్‌ను బాగా కుదించారు. డిమాండ్‌ మేరకే నడుపుతున్నారు.
  • కృష్ణా జిల్లాలో తుపాను దెబ్బకు 20 శాతం పైగా షెడ్యూల్స్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. జిల్లాలో మొత్తం 445 సర్వీసులు వివిధ రూట్లలో రోజూ తిరుగుతుంటాయి. భారీ వర్షాల కారణంగా జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే బస్సులను నిలిపేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న దివిసీమలోని పలు మార్గాలకు సర్వీసులు రద్దయ్యాయి. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు వెళ్లాల్సిన సర్వీసులకు డిమాండ్‌ అంతంతనే ఉండడంతో రద్దు చేశారు. తదుపరి పరిస్థితులను బట్టి సర్వీసులను పునరుద్ధరిస్తామని అర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని